top of page

బాండ్‌ పోయె.. ట్రస్ట్‌ వచ్చే..ఢాం ఢాం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 25, 2025
  • 3 min read

ఎత్తుకు పైఎత్తు వేయడం, ఒక మార్గం మూసుకుపోతే మరో మార్గాన్ని చూసుకోవడం.. ప్రతిచోటా ఉండేదే. ఇది రాజకీయాల్లో ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందులోనూ ఈ రంగంలో డబ్బు ప్రాధాన్యం పెరిగిన తర్వాత మరింతగా పాతుకుపోయింది. దానికి ఎన్నికల బండ్ల వ్యవహారమే నిదర్శనం. గతంలో ఎన్నికల బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలకు గుప్త విరాళాలు ఇచ్చే సంస్కృతి ఉండేది. అది వికృతరూపం దాల్చడంతో సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసేసింది. దాన్ని రద్దు చేస్తేనేం.. పార్టీలు, కార్పొరేట్‌ వర్గాలు మార్గాన్ని ఓపెన్‌ చేసి యథాప్రకారంగానే.. ఇంకా చెప్పాలంటే ఎక్కువగానే రాజకీయ పార్టీల్లోకి నగదు వెల్లువలా ప్రవహిస్తోంది. దీని కోసమే ప్రత్యేకంగా ఎన్నికల ట్రస్ట్‌లు కూడా పుట్టుకొచ్చాయి. ఈ ట్రస్టుల ద్వారా రాజకీయ విరాళాలు మూడొంతులు పెరగడం ఈ సంస్కృతి ఎంతగా పాతుకుపోతోందో చెప్పకనే చెబుతోంది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన ఒక కథనం ప్రకారం 2024`25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని రాజకీయ పార్టీలకు ఏకంగా రూ.3811.37 కోట్ల విరాళాలు అందాయట! ఈ నిధులు తొమ్మిది ఎన్నికల ట్రస్టుల ద్వారా పార్టీలకు చేరాయి. ఆ మేరకు ఆ ట్రస్టులు ఎన్నికల సంఘానికి విరాళాలు ఇచ్చాయి. ఈ నిధుల్లో ఏకంగా 82 శాతం అంటే రూ. 3,112.50 కోట్లు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఖాతాలోకే చేరగా, సుమారు ఎనిమిది శాతం అంటే రూ. 298.77 కోట్లు కాంగ్రెస్‌ అందాయి. మిగిలిన సుమారు రూ.400 కోట్ల బ్యాలెన్స్‌ను దేశంలోని మిగతా పార్టీలు పంచుకున్నాయి. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాతే ఈ పెరుగుదల నమోదైంది. కానీ గత ఆర్ధిక సంవత్సరం (2023-24)లో ట్రస్టుల ద్వారా అందిన విరాళాలు రూ.1,218 కోట్లు మాత్రమే. విరాళాలు ఇస్తున్న ట్రస్టుల్లో ప్రూడెంట్‌ ఎన్నికల ట్రస్ట్‌ అతి పెద్దది. దీని ద్వారానే రూ.2,668.46 కోట్లు పార్టీలకు అందించగా, వాటిలో ఎక్కువ మొత్తం రూ.2,180.71 కోట్లు బీజేపీకి వెళ్లాయి. భారతి ఎయిర్‌టెల్‌కు చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్‌ నేతృత్వం వహిస్తున్న ట్రస్ట్‌`జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, మెఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, భారతి ఎయిర్‌టెల్‌, అరబిందో ఫార్మా, ట్రోంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ వంటి తదితర ప్రధాన కార్పొరేట్‌ల నుంచి నిధులను స్వీకరించింది. మరో ప్రధాన దాత`టాటా గ్రూప్‌ కంపెనీలైన టాటా సన్స్‌, టాటా కన్సల్టెన్సీ సర్విసెస్‌(టీసీఎస్‌), టాటా స్టీల్‌కార్పస్‌తో ఏర్పాటైన ప్రొగ్రెసివ్‌ ఎన్నికల ట్రస్ట్‌ రూ. 914.97 కోట్ల విరాళం ఇవ్వగా ఇందులో సుమారు 81 శాతం బీజేపీకి వెళ్లింది. మహీంద్రా గ్రూప్‌ (మహీంద్రా అండ్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా) నిధితో పనిచేస్తున్న న్యూ డెమోక్రటిక్‌ ఎన్నికల ట్రస్ట్‌ అందజేసిన మొత్తం రూ 160 కోట్లలో రూ 150 కోట్ల వరకు బీజేపీకి అందాయి. ట్రయంప్‌ ఎన్నికల ట్రస్ట్‌లో ఎక్కువ వాటా ఉన్న జీజీ పవర్‌ Ê ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ రూ.25 కోట్ల నుంచి రూ.21 కోట్ల మొత్తాన్ని బీజేపీకి విరాళంగా అందించింది. జన్‌ప్రగతి ఎన్నికల ట్రస్ట్‌ ఎక్కువగా కేఈసీ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ నుంచి స్వీకరించే నిధుల్లోంచి రూ. కోటి శివసేన (యూబీటీ)కు విరాళమిచ్చింది. ఇదిలా ఉండగా జన్‌కళ్యాణ్‌ ఎన్నికల ట్రస్ట్‌ తన వాటా రూ. 19 లక్షలను రెండుగా చీల్చి బీజేపీ, కాంగ్రెస్‌లకు సరిసమానంగా అందించింది. దేశంలో ఎన్నికలు, రాజకీయ పార్టీల నిర్వహణకు నిధులు అవసరం. కానీ అందుతున్న నిధుల్లో సింహభాగం అధికార పార్టీ అయిన బీజేపీ ఖాతాలో చేరడమే చర్చనీయాంశం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.6,088 కోట్ల విరాళాలు అందాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 53 శాతం ఎక్కువ. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ రూ.522 కోట్లు మాత్రమే అందుకుంది. అంటే కాంగ్రెస్‌ కంటే బీజేపీకి అందిన విరాళాలు 12 రెట్లు ఎక్కువ. కార్పొరేట్‌ సంస్థలు అధికారంలో ఉన్న పార్టీలకు విరాళాలు ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తాయి. ప్రభుత్వాన్ని నడిపే పార్టీ బలంగా ఉంటే వాణిజ్య, పారిశ్రామిక విధానాలు అనుకూలంగా ఉంటాయని, రాయితీలు లభిస్తాయని ఆశించడమే దీనికి కారణం. అధికార పార్టీకి విరాళాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రాజెక్టులు దక్కించుకోవడం కూడా మరో కారణం. అయితే విరాళాల పేరుతో నిధుల సేకరణలో పార్టీల మధ్య ఇంత ఎక్కువగా అసమానతలు ఉండటం ప్రజాస్వామ్యానికి సవాలుగా మారుతుందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ దగ్గర భారీగా నిధులు ఉండి, మరో పార్టీ వద్ద అరకొరగా ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల్లో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పోటీలో బ్యాలెన్స్‌ తప్పుతుంది. ఒకే పార్టీ దగ్గర వేల కోట్ల నిధులు ఉండటం వల్ల ప్రచారం, ఎన్నికల నిర్వహణలో ఇతర పార్టీలు వెనుకబడిపోతున్నాయి. ఇది ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులకు సమానావకాశాలు అన్న ప్రజాస్వామ్య సూత్రాన్ని దెబ్బతీస్తుంది. ఎలక్టోరల్‌ బాండ్లు రద్దయినప్పటికీ ట్రస్ట్‌ల ద్వారా వచ్చే నిధుల్లో కార్పొరేట్‌ సంస్థల ప్రభావం ఎంత ఉందో స్పష్టంగా తెలియడం లేదు. కార్పొరేట్‌ విరాళాలు పెరగడం అనేది ఒకవైపు దేశ ఆర్థిక వృద్ధిని సూచించినా మరోవైపు రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగిపోతుందనే సంకేతాలను ఇస్తోంది. ఇంకో కోణంలో చూస్తే తమ పార్టీకి విరాళాలు ఇచ్చిన కార్పొరేట్‌ సంస్థలకు ఏదో రూపంలో మేలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వాన్ని నడిపే పార్టీల్లో కలగడం సహజం. ఇప్పటికే అది కొన్ని సంస్థల విషయంలో జరుగుతోందన్న ఆరోపణలు లేకపోలేదు. అందువల్ల రాజకీయ నిధుల సేకరణలో మరింత పారదర్శకత ఉండాలని, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు తగ్గితేనే ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రయ ఆరోగ్యకరంగా ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ఎలక్టోరల్‌ బాండ్లను రద్దుచేసిన సుప్రీంకోర్టు రాజకీయ విరాళాల విషయంలో పూర్తి పారదర్శకత ఉండేలా మార్గదర్శకాలు రూపొందిస్తే బాగుంటుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page