బంధీల చెర నుంచి ‘బరాటానికి’ విముక్తి
- BAGADI NARAYANARAO

- Nov 11
- 1 min read
ప్రభుత్వ చెరువేనంటూ బోర్డులు పెట్టిన అధికారులు
9.76 ఎకరాల ఆక్రమణ తొలగింపు త్వరలోనే

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కొన్ని రోజులుగా చెలరేగిన వివాదానికి అధికారులు చెక్ పెట్టారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో గార రెవెన్యూ అధికారులు ఆక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గార మండలం అంపోలు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 199లో బరాటంవాని చెరువు విస్తీర్ణం 19.53 ఎకరాలు కాగా, సుమారు 9.76 ఎకరాలు ఆక్రమణకు గురైంది. దీనిపై ‘సత్యం’ కథనాలు ప్రచురించింది. చెరువు గర్భంలో గ్రామీణ ఉపాధి హమీ పనులు చేయడానికి సానివాడ సర్పంచ్, డ్వామా సిబ్బంది ప్రయత్నాలను ఆక్రమణదారులు అడ్డుకొని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సానివాడ సర్పంచ్ లక్ష్మి గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారులను ఆశ్రయించి ఆక్రమణలు తొలగించాలని విన్నవించారు. స్పందించిన అధికారులు సర్వే చేయించి ఆక్రమణలు గుర్తించి హద్దులు నిర్ణయించినా ఆక్రమణదారులు లెక్క చేయలేదు. చెరువు గర్భంలో ఆక్రమణలను శాశ్వతంగా తొలగించడానికి గార తహసీల్ధారు బృందం నిర్వహించిన సర్వే ఆధారంగా ఉపాధి హమీ పథకం ద్వారా పనులు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా పనులు ముందుకు సాగలేదు. అధికారులు నోటీసులు ఇచ్చినా స్పందించకుండా ఆక్రమించిన భూమిపై సర్వహక్కులు కలిగి ఉన్నాయని న్యాయస్థానాన్ని బాధ్యులు ఆశ్రయించారు. దురాక్రమణ కారణంగా సుమారు 200 ఎకరాల ఆయకట్టుకు నీరందడం లేదని చెరువుకు పైభాగంలో 163 ఎకరాలతో పాటు వానోడుపేట, తంగివానిపేట, సానివాడ, ఒప్పంగి తదితర గ్రామాల పరిధిలో ఆరు చెరువులకు నీటిని సరఫరా చేసి 728 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని, దురాక్రమణల వల్ల రిజర్వు ట్యాంకుగా పని చేయాల్సిన బరాటం చెరువు నిర్వీర్యం అయిపోయిందని న్యాయ స్థానానికి అధికారులు విన్నవించారు. దీనిపై న్యాయస్థానం ఆక్రమణదారులకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించి తక్షణం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. న్యాయస్థానం ఆదేశాలతో జిల్లా ఉన్నతాధికారులు గార రెవెన్యూ అధికారులకు ఎండార్స్‌మెంట్ ఇచ్చి ఆక్రమణలు తక్షణమే తొలగించాలన్నారు. దీంతో రెవెన్యూ యంత్రాంగం ఆక్రమణ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఖరీఫ్ వరికోత పూర్తి చేసిన తర్వాత ఆక్రమణలను తొలగించే చర్యలు చేపడుతున్నట్టు గార రెవిన్యూ అధికారులు స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలతో ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలపై సానివాడ సర్పంచ్ లక్ష్మి స్పందిస్తూ రైతుల సాగునీటి అవసరాలు తీరడానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. వరికోతలు పూర్తి చేసిన తర్వాత ఆక్రమణకు గురైన 9.76 ఎకరాలను ఉపాధిహమీ పథకం ద్వారా పనులు చేపట్టి నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.










Comments