top of page

బోధనకు బొమ్మల ‘కళ’

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 5, 2025
  • 3 min read
  • వర్ణరంజితంగా బోటనీ, జువాలజీ ల్యాబ్‌లు

  • పాఠశాల గోడల నిండా జాతినేతలు, శాస్త్రవేత్తల చరిత్ర

  • ఏ పాఠశాలల్లో పని చేసినా అదే అంకితభావం

  • వినూత్న ప్రక్రియలతో అవార్డులు, రివార్డులు

  • విద్యామంత్రి లోకేష్‌ మెప్పు పొందిన బల్లెడ అప్పలరాజు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

వెయ్యి పదాల్లో చెప్పలేనిది ఒక్క చిత్రం చెబుతుందంటారు. సాధారణంగా దీన్ని జర్నలిజం పరిభాషలో ప్రస్తావిస్తుంటారు. కానీ ఈ వాస్తవం అన్ని రంగాలకూ వర్తిస్తుంది. బోధన వృత్తికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు పాఠాలు చెప్పే క్రమంలో పాఠ్య పుస్తకాల్లోనూ అంశాలను బోధించి, వాటిని పూర్తిగా ఆకళింపు చేసుకునేందుకు వీలుగా పిల్లల చేత పాఠాలను బట్టీ పట్టిస్తుంటారు. అయినా చాలామంది పిల్లలు దాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేక ఫెయిలవుతుంటారు. కానీ అదే పాఠ్యాంశాలకు సంబంధించి వర్ణచిత్రాలు రూపొందించి వాటి ద్వారా బోధన చేస్తే.. ఆ వర్ణచిత్రాలు పిల్లల మదిలో బలమైన ముద్ర వేస్తాయి. చిరకాలం నిలిచిపోతాయి. ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. సరిగ్గా ఇదే భావం ఆ ఉపాధ్యాయుడి మదిలో మెరిసింది. సహజంగానే తనలో ఉన్న కళాత్మక సృజనకు పదునుపెట్టి తన పాఠశాలను కళా నిలయంగా మార్చేశారు. తోటి విద్యార్థులు, సిబ్బంది సహకారంతో పాఠ్యాంశాలను వర్ణచిత్రాలుగా ల్యాబ్‌లు, గోడలపై ఆవిష్కరించి సరికొత్త బోధనా ప్రపంచాన్ని సృష్టించారు. తన ప్రతిభతో స్వయంగా ప్రశంసలు అందుకోవడంతోపాటు తన విద్యార్థులను పాఠ్యాంశాల్లో ఉన్నత ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతూ అవార్డులు, రివార్డులకు అర్హులను చేస్తున్న ఆయనే బల్లెడ అప్పలరాజు. పాతపట్నంలోని ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూల్లో పీజీ టీచరుగా పని చేస్తున్న ఈయన తన సృజనాత్మక బోధనతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ దృష్టిని కూడా ఆకర్షించారు.

ఆ టీచరమ్మే ఆదర్శం

కవిటి మండలం భైరిపురం గ్రామానికి చెందిన బల్లెడ అప్పలరాజు 2013 జూన్‌లో టీచర్‌ ఉద్యోగం సంపాదించారు. జి.సిగడాం ఏపీ మోడల్‌ స్కూల్‌లో బోటనీ టీచరుగా తొలి పోస్టింగు అందుకున్న ఆయన అనంతరం పెరుమాళి మోడల్‌ స్కూల్‌కు బదిలీ అయ్యారు. అనంతరం 2022 మే నుంచి పాతపట్నం మోడల్‌ స్కూల్లో పని చేస్తున్నారు. తను పని చేసిన ప్రతి పాఠశాలనూ వర్ణరంజితం చేస్తూ బొమ్మలతో విద్యాబోధనను కళాత్మకంగా నిర్వహించడం అప్పలరాజు హాబీగా మారిపోయింది. పాఠశాల మేనేజ్‌మెంట్‌ నుంచి అందే సహాయంతో నిమిత్తం లేకుండా అవసరమైతే తన సొంత ఆర్థిక వనరులతో తాను అనుకున్న పనిచేయడం ఆయనకు అలవాటుగా మారింది. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇలా వృత్తిపట్ల నిబద్ధతత, అందులో వినూత్నత కనబరచడం, సొంత సొమ్ము ఖర్చు చేయడం చాలా అరుదు. దీని కారణమేంటి.. అని ఆయన్ను ప్రశ్నిస్తే.. చిన్నతనంలో తమకు పాఠాలు చెప్పిన ఒక టీచరమ్మే స్ఫూర్తి అని అప్పలరాజు వెల్లడిరచారు. తమ స్వగ్రామం భైరిపురంలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు రంగనాయకమ్మ అనే ఒక ఉపాధ్యాయురాలు ఉండేవారని చెప్పారు. ఆమె ఎందరికో తన సొంత సొమ్ముతో విద్యాదానం చేసి, తీర్చిదిద్ది ఉన్నతంగా ఎదిగేందుకు చేయూతనిచ్చారని చెప్పారు. అలాగే తాను చదువుకున్న వెన్నెలవలస నవోదయ విద్యాలయంలో విలువలతో కూడిన బోధన, క్రమశిక్షణ తనకు అలవడ్డాయని వివరించారు. పాఠశాలలో వర్ణచిత్రాలు వేయడానికి, సుందరీకరణకు అయ్యే ఖర్చుల విషయంలో పాఠశాల యాజమన్యం ఇచ్చినా ఇవ్వకపోయినా తన సొంత డబ్బులు వెచ్చిస్తున్నానని చెప్పారు. పలు సందర్భాల్లో యాజమాన్యాలు ఖర్చులకు బిల్లులు ఇస్తుంటాయని, అయితే ఆ విషయంలో వారిని ఒత్తిడి చేయడం తనకు ఇష్టంలేదని, ఇలా వర్ణచిత్ర బోధన ద్వారా ఆత్మసంతృప్తి పొందుతున్నానని ఆయన చెప్పారు.

ల్యాబ్‌లు, లైబ్రరీల్లో ‘చిత్ర’మైన వాతావరణం

పిల్లలకు రంగురంగులతో ఇంద్రధనస్సును తలపిస్తూ, వివిధ రకాల మొక్కలతో కూడిన పరిసరాలు విశేషంగా ఆకర్షిస్తాయన్నది తెలిసిందే. ఇదే పాతపట్నం మోడల్‌ పాఠశాలలో కళ్లకు కడుతోంది. ఎంత బట్టీ పట్టినా పాఠాలు వంటబట్టక ఇబ్బందిపడిన విద్యార్థులు ఇప్పుడు బొమ్మల బోధన పట్ల ఆకర్షితలవుతున్నారు. అందుకు తగినట్లే బోటనీ టీచర్‌ బల్లెడ అప్పలరాజు బోటనీ, జువాలజీ ల్యాబ్‌లను సప్తవర్ణ చిత్రాలతో నింపేశారు. సాధారణంగా ప్రయోగశాలలు బీకర్లు, రసాయనిక పదార్ధాలు, ప్రయోగ పరికరాలతో నిండి ఉంటాయి. కానీ ఈ పాఠశాలలోని ల్యాబ్‌లు వాటితోపాటు బోటనీ, జువాలజీ పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో వివరించే రంగురంగుల చిత్రాలతో ఆకట్టుకుంటున్నాయి. వృక్షశాస్త్రానికి సంబంధించి వివిధ రకాల మొక్కలను హెర్బేరియం రూపంలో ఏర్పాటు చేసి వాటి వివరాలు అక్కడే పొందుపరిచారు. అలాగే పాఠశాల లైబ్రరీ గోడలను పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించే చిత్రాలు, నినాదాలతో తీర్చిదిద్దారు. పాఠశాల గోడలపైనా పలువురు నేతలు, శాస్త్రవేత్తల చిత్రాలు, వారి ఆవిష్కరణలు, ఇతర ప్రత్యేకతల గురించి వివరించడం ప్రశంసలు అందుకుంటోంది. పాడైపోయిన వస్తువులతో వివిధ రకాల హ్యాంగింగ్స్‌, పాఠశాల కళావేదిక ఇరువైపులా, వెనక భాగంలో జాతీయ జెండా రంగుల్లో భారతీయ కళారీతులను తెలియజెప్పే చిత్రాలకు అందంగా తీర్చిదిద్దారు.

అవార్డులు, ప్రశంసలు

అప్పలరాజు మాస్టారు తన సొంత ప్రతిభ, వనరులతో విద్యార్థులను సృజనశీలురిగా తీర్చిదిద్దుతూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. పాఠశాలలో వినూత్న బోధన రీతులను ఆవిష్కరించిన ఆయన లఘు చిత్రాల ద్వారా పిల్లల్లో నైపుణ్యాలను సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నారు. లఘు చిత్రాలకు విజ్ఞాన కథాంశాలను తానే తయారు చేసి దర్శకత్వం వహించడంతోపాటు పిల్లలను నటింపజేస్తూ తన మొబైల్లోని చిత్రీకరించి, ఎడిట్‌ చేసి వీడియోలు తయారు చేస్తున్నారు.

` ఇంధన వనరుల పరిరక్షణ(ఎనర్జీ కన్జర్వేషన్‌)పై తీసిన లఘు చిత్రాలకుగాను వరుసగా మూడేళ్లు బహుమతులు అందుకున్నారు. 2022లో రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతికి ఎంపిక కాగా రూ.20వేల నగదు పురస్కారం, 2023లో మూడో స్థానం సాధించి రూ.5 వేలు, 2024లో కన్సొలేషన్‌ ప్రైజ్‌ కింద రూ.2 వేలు అందుకున్నారు. అప్పటి జెన్‌కో ఎండీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ విజయానంద్‌ చేతుల మీదుగా వాటిని అందుకున్నారు. ఈ క్యాష్‌ రివార్డుల్లో విద్యార్థులను ప్రైజ్‌ డిస్ట్రిబ్యూషన్‌కు తీసుకెళ్లడానికి అయిన ఖర్చులు మినహాయించి మిగతా సొమ్మును పాఠశాలలో సౌండ్‌ సిస్టమ్‌ అభివృద్ధికి వెచ్చించారు.

`గత ఏడాది జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఆయన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

`ఈ ఏడాది డిజిటల్‌ బోధనలో బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ టీచర్‌గా ఎంపికయ్యారు. దాన్ని మొన్న ఆగస్టులో సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు చేతుల మీదుగా అందుకున్నారు.

మంత్రి లోకేష్‌ ప్రశంసలు

`వర్ణచిత్ర, డిజిటల్‌ విద్యా బోధనలో అప్పలరాజు మాస్టారు చూపుతున్న నిబద్ధత, సృజనశీలత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను సైతం ఆకట్టుకుంది. ఆయన స్వయంగా ఎక్స్‌(ట్విటర్‌), ఫేస్‌బుక్‌ ద్వారా స్పందిస్తూ ఆయన కృషిని మెచ్చుకున్నారు. ఈ విషయం సమగ్రశిక్ష ఉన్నతాధికారుల ద్వారా మంత్రి దృష్టికి వెళ్లింది. రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో 40 మంది బెస్ట్‌ ప్రాక్టిసింగ్‌ టీచర్లను గుర్తించి సమగ్రశిక్ష ఆధ్వర్యంలో వారితో ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూప్‌ నిర్వహిస్తున్నారు. వీరందరికీ ప్రత్యేకంగా ఒకరోజు శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగానే అప్పలరాజు మాస్టారు కృషిని గుర్తించిన సమగ్రశిక్ష పీడీ ఆ విషయాన్ని మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page