బాబ్బాబు.. ఒక్క దరఖాస్తు వేద్దురూ!
- NVS PRASAD

- Aug 25, 2025
- 3 min read
గడువు ముగుస్తున్నా బార్ టెండర్లకు స్పందన శూన్యం
షాపులకు కమీషన్.. బార్‌కైతే ఎమ్మార్పీ అట!
లాభదాయకత లేకపోవడం వల్లే వ్యాపారుల వెనుకంజ
దరఖాస్తులు రప్పించేందుకు ఎక్సైజ్ అధికారుల తంటాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పలాస నియోజకవర్గంలోని మారుమూల గ్రామంలో దుకాణం నడుపుకొంటున్న కాంతారావుకు మూడురోజుల క్రితం ఎక్సైజ్ అధికారుల నుంచి ఫోనొచ్చింది. బార్ లైసెన్స్‌కు టెండర్ వేయమని కోరడం దాని సారాంశం. బడ్డీతో జీవనం సాగిస్తున్న తాను అప్లికేషన్ ఫీజుకే రూ.ఐదు లక్షలు చెల్లించి టెండరులో పాల్గొనడమేమిటని నోరెళ్లబెట్టడం కాంతారావు వంతైంది.
శ్రీకాకుళం నియోజకవర్గం అంపోలు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో దాబా నడుపుడుతున్న మరో వ్యక్తికి కూడా ఇదే విధంగా ఫోనొచ్చింది. మద్యం షాపుల కంటే తక్కువ మొత్తానికే బార్ టెండర్ దక్కించుకోవచ్చని, దరఖాస్తు వేయాలన్న సూచన ఆ ఫోన్‌కాల్ సారాంశం.
.. ఇలా ఒకరిద్దరు కాదు.. జిల్లాలో 2,500 మందికి పైగా ఎక్సైజ్ అధికారుల నుంచి ఫోన్‌కాల్స్ అందుకున్నారు. గతంలో బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్ముతూ దొరికిపోయినవారిని సైతం విడిచిపెట్టకుండా బార్‌లకు టెండర్లు వేయాలని ఎక్సైజ్ అధికారులు విన్నవించుకున్నారు. దాబాలు నడుపుతున్నవారు, మద్యం షాపులకు గతంలో నిర్వహించిన టెండర్లలో పాల్గొన్నవారు, ఎప్పుడో బార్‌లు నడిపి ఆ తర్వాత బొక్కబోర్లా పడిపోయినవారు.. ఇలా ఎవర్నీ విడిచిపెట్టకుండా ఫోన్లు చేస్తున్నారు. అయినా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 26 బార్‌లకు ఒక్కరు కూడా టెండరు వేయడానికి ముందుకు రావడంలేదు. మంగళవారంతో టెండర్ల దాఖలు గడువు ముగియనుండంతో ఆలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం విధించిన షరతుల మేరకు టెండర్లు వేయించడానికి ఎక్సైజ్ అధికారులు నానా పాట్లు పడుతున్నారు. ఇది ఒక్క శ్రీకాకుళం జిల్లా పరిస్థితి మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే ఉంది. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీ ఒక కారణం కాగా, గత ప్రభుత్వంలో అసలు, కొసరు అన్నీ కోల్పోవడం మరో కారణం. దీంతో బార్ అంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడిరది.
ధరలు.. ని‘బంధనాలు’
కొత్త పాలసీ ప్రకారం ఒక బార్‌కు కనీసం నాలుగు టెండర్లు దాఖలు కావాలి. లాటరీ పద్ధతిలో వాటిలో నుంచి ఒక టెండర్‌ను ఖరారు చేస్తారు. టెండరు దరఖాస్తు ఫీజు ఐదు లక్షలు ముందుగా చెల్లించాలి. లాటరీలో బార్ మంజూరైతే ప్రారంభ ధరగా రూ.55 లక్షలు చెల్లించాలి. వాస్తవానికి వ్యాపారంలో గతంలో లాభాలు వచ్చి ఉంటే నాలుగు దరఖాస్తులూ నలుగురి పేర్ల మీద ఒకే వ్యాపారి వేసుండేవాడు. ఆ లెక్కన దరఖాస్తు ఫీజు రూ.20 లక్షలతో పాటు ఫీజు రూ.55 లక్షలు కలుపుకొంటే రూ.75 లక్షలు పోయినా ఒక బార్ వస్తుందని ముందుకెళ్లుండేవారు. కానీ గత ఐదేళ్ల పరిస్థితి పరిశీలిస్తే ఏ ఒక్క బార్ కూడా కనీసం పెట్టుబడిని వెనక్కు తీసుకోలేకపోయింది. శ్రీకాకుళం నగరంలో 11 బార్‌ల యజమానులు ఒక్కటై పోటీ లేకుండా గతసారి టెండర్లు దక్కించుకోవడం వల్ల కొంతమేరకు బయటపడగలిగారు గానీ, జిల్లాలో మిగిలినచోట్ల, అలాగే రాష్ట్రంలో అనేకచోట్ల బార్ నిర్వాహకులు పెద్ద ఎత్తున నష్టపోయారు. శ్రీకాకుళంలో బార్ లైసెన్స్ ఫీజు రూ.25 లక్షలు ఉన్నప్పుడు దాని మీద రూ.2 లక్షలు పెంచి రూ.27 లక్షలకు బార్‌లు దక్కించుకున్నారు. అదే రాజాంలో రూ.25 లక్షల బార్‌ను పోటీ పడి ధర పెంచి రూ.75 లక్షలకు తీసుకోవడం వల్ల భారీగా నష్టపోయారు. కడపలో అయితే ఒక బార్‌ను రూ.1.80 కోట్లకు తీసుకొని నిండా మునిగిపోయారు. గత ఐదేళ్లుగా బార్‌లు నడిపినవారందరి పరిస్థితి దాదాపు ఇదే. ఆ అనుభవంతోనే ఈసారి బార్ టెండర్లలో పాల్గొనడానికి ఎవరూ ఆసక్తి చూపడంలేదు.
ధరల్లో వ్యత్యాసం
అదే సమయంలో రాష్ట్ర మద్యం వర్తకుల సంఘం కూడా ప్రభుత్వంపై పాలసీ మార్పు కోసం పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తోంది. గతంలో ఉన్న బార్‌లనే రెన్యువల్ చేయాలని కోరుతోంది. దరఖాస్తులు పడకపోతే ప్రభుత్వ విధానంలో మార్పు వస్తుందని, అంతవరకు తొందరపడి ఎవరూ టెండర్లు వేయొద్దని పదే పదే గుర్తు చేస్తోంది. వాస్తవానికి మద్యం రిటైల్ షాపులో అమ్మకాలకు 13 శాతం కమీషన్ ఇస్తున్న ప్రభుత్వం బార్‌లకు మాత్రం అటువంటి మార్జిన్ ఇవ్వడంలేదు సరికదా.. ఎమ్మార్పీకే మద్యం సరఫరా చేస్తోంది. బార్‌లు తమకు నచ్చినంత రేటుకు అమ్ముకోవచ్చని చెబుతుంది. కానీ పోటీ ప్రపంచంలో పక్కనే ఉన్న వైన్‌షాపు కంటే బార్‌లో ఎక్కువ రేటుకు కొనడానికి ఎవరూ ముందుకు రారు. అదే సమయంలో మరో బార్‌లో ఎమ్మార్పీకే మందు అమ్ముతామని బోర్డు పెడితే అక్కడికే వ్యాపారం వెళ్లిపోతుంది. అటువంటప్పుడు బార్‌కు టెండర్లు వేసి లక్షలాది రూపాయలు నష్టపోవడమెందుకని వ్యాపారస్తులు భావిస్తున్నారు. బార్ నడిచినంత కాలం ఏడాదికి పది శాతం చొప్పున లైసెన్స్ ఫీజు పెరుగుతుందన్న నిబంధన కూడా వెనక్కి లాగుతోంది.
ఉపయుక్తం కాని వేళలు
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి 2014`19 ఎక్సైజ్ పాలసీ అమల్లో ఉంది. ఆ ప్రభుత్వం మద్యం పాలసీ మార్చినా బార్‌ల జోలికి జగన్మోహన్‌రెడ్డి వెళ్లలేదు. కేవలం ప్రైవేటు మద్యం దుకాణాలను తీసేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే షాపులు నడిపారు. దీనివల్ల ఆ సమయంలో రాత్రి 8 గంటల తర్వాత మద్యం తాగాలనుకునేవారు రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉండే బార్‌లకు వెళ్లడం వల్ల కొంతమేరకు అమ్మకాలు జరిగాయి. అదే సమయంలో ఎక్కడికక్కడ ఎక్సైజ్ అధికారులను మేనేజ్ చేసుకొని బార్‌లు ఉన్న శ్రీకాకుళం, రాజాం, పలాస, ఆమదాలవలస వంటి ప్రాంతాల్లోని ప్రభుత్వ మద్యం షాపుల్లో ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉన్న బ్రాండ్లు అమ్మకుండా చూసుకున్నారు. బ్రాందీల్లో మ్యాన్షన్‌హౌస్, మార్ఫియస్ వంటివి, విస్కీల్లో 100 పైపర్స్, బ్లాక్ డాగ్‌తో పాటు మరికొంత రేంజ్ ఉన్న బ్రాండ్లు దొరక్కుండా చూసుకున్నారు. దాంతో వీటిని ధర ఎక్కువైనా బార్లలో కొనాల్సిన పరిస్థితి మందుబాబులకు ఏర్పడిరది. ఈ విధంగా కొంతమేర సొమ్ము చేసుకోగలిగారు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చింది. దీంతో ఉదయం 8 గంటలకే షాపులు తెరిచి రాత్రి 11 గంటల వరకు విక్రయిస్తున్నారు. కొత్త బార్‌పాలసీ ప్రకారం రాత్రి 12 వరకు బార్‌లు నిర్వహించే వెసులుబాటు కల్పించారు. అయితే శ్రీకాకుళం లాంటి నగరాలు రాత్రి 10 గంటలకే నిద్రలోకి జారుకుంటాయి. అలాంటప్పుడు 12 గంటల వరకు బార్‌లు తెరిచి ఉంచడం వల్ల ప్రయోజనమేమీ ఉండదని వ్యాపారస్తులు భావిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో బార్‌ల సంఖ్య ఈసారి పెరిగింది. గీతకార్మికులకు 78 కేటాయించడం వల్ల అవి కొత్తగా రానున్నాయి. దీనివల్ల పూర్తిగా వ్యాపారం పడిపోతుందన్న భయంతో ఎవరూ టెండర్లకు రావడం లేదు. ఒక బార్‌కు నాలుగు దరఖాస్తులు పడినచోటే లాటరీకి వెళ్లాలనేది ప్రభుత్వ నిబంధన. అటువంటిది జిల్లాలో ఒకటి కూడా లేకపోవడం ఎక్సైజ్ అధికారులకు పిచ్చెక్కిపోతోంది.










Comments