బాబోయ్.. ఘోష్ట్ మాల్స్!
- DV RAMANA

- Jan 7
- 2 min read
2000 దశకంనాటి నిర్మాణాల్లో 20 శాతం ఖాళీ
ఫలితంగా అద్దె రూపంలోనే రూ.350 కోట్ల నష్టం
నిర్వహణ లోపాలు, పోటీ పెరగడమే కారణం
40 శాతానికి మించి ఖాళీగా ఉంటే నిరర్థకమే

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
మాయాబజార్ సినిమా చూసిన వారికి ‘చిన చేపను పెద చేప.. చిన మాయను పెను మాయ.. అది స్వాహా.. ఇదె స్వాహా’ అంటూ కృష్ట పాత్రధారి ఎన్టీఆర్ పాడిన పాట గుర్తుండే ఉంటుంది. చిన్న చేపలను పెద్ద చేపలు తినడం ఎంత సహజమో.. చిన్నమాయను పెద్ద మాయ కబళించడం అంతే సహజం అన్నది దీని అర్థం. దేశంలో షాపింగ్ మాల్స్ విషయంలో అదే మాయ జరుగుతోంది. ఒకప్పుడు ఉచ్ఛస్థితిలో ఉన్న వీధుల్లోని కిరాణా, చిల్లర వ్యాపారాలను సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ దెబ్బతీస్తే.. ఇప్పుడు వీటి స్థానాన్ని ఆన్‌లైన్ షాపింగ్ ఫాట్‌ఫారాలు, హైటెక్ మల్టీప్లెక్స్‌లు ఆక్రమిస్తున్నాయి. మారుతున్న వినియోగదారుల అభిరుచులు, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే మానం సహజ నైజం, నిర్వహణపరమైన లోపాలు షాపింగ్‌మాల్ సంస్కృతిని మలిగిపోయేలా చేస్తోంది. ఫలితంగా దేశంలో వేల సంఖ్యలో షాపింగ్ మాల్స్ ఖాళీగా ఉండిపోతున్నాయి. వీటినే ఘోష్ట్ మాల్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకపక్క దేశంలో షాపింగ్ మాల్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంటే.. మరోపక్క మూతపడుతున్న మాల్స్ సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ప్రధానంగా మెట్రో నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాలకు కూడా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు తమ శాఖలను విస్తరిస్తూ ఆధునిక హంగులు, సొబగులతో వ్యాపారాధిక్యత చాటుకునేందుకు పోటీ పడుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆయా సంస్థల నిర్వాహకులు చేస్తున్న పారపాట్లు, నిర్లక్ష్యం, ఇతర కారణాలతో ఘోస్ట్ మాల్స్ సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. షాపింగ్‌మాల్స్ పెరుగుతున్నప్పటికీ.. తక్కువ పనితీరు కలిగిన షాపింగ్ సెంటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇవి క్రమేపీ పూర్తిగా మూతపడటమో లేదా మాల్స్‌లోని ఎక్కువ భాగంగా ఖాళీగా ఉండిపోవడమో జరుగుతోంది. ఒక షాపింగ్ మాల్‌లో మొత్తం లీజుకు ఇవ్వదగిన స్థలంలో 40 శాతం కంటే ఎక్కువ షాపింగ్ స్థలం ఖాళీగా ఉంటే దాన్ని ఘోస్ట్ మాల్‌గా పరిగణిస్తారు.
కారణాలు ఇవే..
మన దేశంలో రిటైల్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ప్రారంభ దశలో అంటే 2000 ఆ ప్రాంతంలో నిర్మించిన పాత షాపింగ్ సెంటర్లలో దాదాపు 20 శాతం వరకు ఘోస్ట్ మాల్స్‌గా మారాయని మార్కెట్ నిపుణుల అంచనా. మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, వారి అభిరుచులకు అనుగుణంగా మాల్స్ లేకపోవడం, భవనాలు పాతబడిపోవడం వంటివి షాపింగ్ మాల్స్ నిరర్థకంగా మారడానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. ఇ-కామర్స్ పేరుతో ఆన్‌లైన్ షాపింగ్ పెరిగిపోవడం, ఒకే ప్రాంతంలో కొత్త మాల్స్, పెద్ద రిటైల్ పార్క్స్ రావడం వల్ల కొత్తవాటి నుంచి ఎదురవున్న పోటీని పాత మాల్స్ తట్టుకోలేకపోతున్నాయి. ఇక నిర్వహణ సరిగా లేకపోవడం, ఎప్పటికప్పుడు ఆధునికీకరించకపోవడం, ఆకర్షణ కోల్పవడం వంటివి ఒకప్పుడు వెలుగులీనిన మాల్స్‌ను సైతం ఘోష్టులుగా మార్చేస్తున్నాయి.
15.5 మిలియన్ చ.అడుగులు ఖాళీ
ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 32 ప్రధానం నగరాల్లో 350కి పైగా షాపింగ్ సెంటర్లు ఉండగా.. 74 షాపింగ్ మాల్స్‌లో 15.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం నిరర్థకంగా, నిరుపయోగంగా ఉంది. ఈ ఖాళీ స్థలంలో 4.8 మిలియన్ చదరపు అడుగుల వరకు స్టోర్స్ ఉండవచ్చు. వీటిని ఆధునికీకరించి తిరిగి వినియోగంలోకి తీసుకొస్తే సంవత్సరానికి రూ. 357 కోట్ల మేరకు కేవలం అద్దె రూపంలో ఆదాయం పొందొచ్చు. వాటిలో జరిగే వ్యాపారాల ద్వారా వచ్చే లాభాలు కోల్పోవడం వంటివి లెక్కిస్తే ఇంకా చాలానే ఉంటుంది. ఈ లెక్క ప్రకారం టైర్-1 నగరాల్లో రూ. 236 కోట్లు, టైర్-2 నగరాల్లో రూ. 121 కోట్ల వరకు ఆదాయం కోల్పోతున్నట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా అంచనా వేసింది. ప్రధానంగా పాత మాల్స్‌ను పునరుద్ధరించడం లేదా వినియోగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ అన్నారు. టాప్ పెర్‌ఫార్మింగ్, పాత మాల్స్ మధ్య అంతరం బాగా పెరుగుతోంది. గ్రేడ్ ఏ మాల్స్ దాదాపు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. వీటిలో కేవలం 5.7 శాతం ఖాళీ స్థలం మాత్రమే ఉంది. తక్కువ స్థాయి మాల్స్ విషయానికి వస్తే.. ఇవి నిర్మాణాత్మక సమస్యలతో సతమతం అవుతున్నాయి. గ్రేడ్ సి మాల్స్‌లో ఖాళీ స్థలం వాటానే సగటున 36 శాతం వరకు ఉంది. ఎక్కువ స్థలం ఖాళీగా ఉన్న వాటిల్లో కో వర్కింగ్ స్థలాలు, విద్య, వినోద కేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్స్ వంటివి ఏర్పాటు చేయడం ద్వారా అద్దె ఆదాయం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మైసూర్, విజయవాడ, తిరువనంతపురం, వడోదరా, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లోని మాల్స్‌లో రెండు నుంచి ఆరు శాతం వరకు ఖాళీ స్థలం ఉంది. ఇవి బాగా నడుస్తున్నాయి. ఇక అమృత్‌సర్, నాగ్‌పూర్, జలంధర్ వంటి చోట్ల ఎక్కువ సరఫరా, పేలవ నిర్వహణ కారణంగా 34 నుంచి 49 శాతం వరకు మాల్స్ ఖాళీగా ఉంటున్నాయి.










Comments