బాబోయ్.. బూడిద మేఘం!
- DV RAMANA

- Nov 25, 2025
- 2 min read
ఇథియోపియాలో పేలిన అగ్నిప్రమాదం
కిలోమీటర్ల ఎత్తులో ఎగసిన రసాయన బూడిద
వేల కి.మీ. దూరంలోని భారత్‌పై దట్టంగా ధూళి
వాతావరణ సమస్యలు, ఆరోగ్యాలకు దెబ్బ
అనేక విమానాలు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఉరుము ఉరిమి మంగళం మీద పడటమంటే బహుశా ఇదేనేమో!.. కాకపోతే ఎక్కడ ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా.. ఎక్కడ పదివేల ఏళ్లనాటి అగ్నిప్రమాదం. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేశంలో వేల ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న అగ్ని పర్వతం విస్ఫోటనం చెందడంతో కిలోమీటర్ల ఎత్తున ఎగసిన బూడిద మేఘాలు భారతదేశంపైకి దండెత్తి వచ్చి కమ్మేశాయి. ముఖ్యంగా వాయువ్య, ఉత్తర భారతదేశాలను బూడిద మేఘాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలే శీతాకాలం.. దేశ రాజధాని ఢల్లీి సహా ఉత్తరభారత ప్రాంతాలన్నీ పొగమంచుతో నిండిపోయి కాలుష్య మేఘాలను కదలనీయకుండా చేసి ప్రజలను ఇబ్బందిపెడుతూ అనారోగ్యానికి గురిచేస్తుంటాయి. ఇప్పుడు ఈ పొగమంచుకు, కాలుష్య మేఘాలకు అగ్నిపర్వతం వెదజల్లుతున్న బూడద మేఘాలు తోడయ్యాయి. సోమవారం అర్ధరాత్రికే బూడిద మేఘాలు భారత్‌కు చేరుకున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావం ఇప్పటికే విమాన సర్వీసులపై పడిరది. ఇండిగో, ఆకాశ ఎయిర్‌లైన్స్ సంస్థలు అలర్ట్ జారీ చేశాయి.
జరిగిందేంటే..
ఇథియోపియా దేశంలోని అపార్ ప్రాంతంలో ఉన్న హేలీగుబ్బి అనే అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటనం చెందింది. 10వేల నుంచి 12వేల ఏళ్లపాటు ఈ అగ్నిపర్వతం నిద్రాణ స్థితి(స్లీపింగ్ మోడ్)లో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి. ఎర్టా ఆలే అగ్నిపర్వత శ్రేణిలో భాగమైన హేలీగుబ్బి దానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. డానాకిల్ డిప్రెషన్‌లోని టెక్టానిక్ ప్లేట్ల విభజన కారణంగా తాజా విస్ఫోటనం చోటు చేసుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం నుంచి భారీగా వెలువడుతున్న ఎరుపు రంగు బూడిద మేఘాలు ఆకాశంలో సుమారు 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగసి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. అగ్నిపర్వతం నుంచి విడుదల అవుతున్న సల్ఫర్ డయాక్సైడ్‌తో కూడిన బూడిద మేఘాలుగా ఏర్పడి ఆకాశాన్ని కమ్మేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను స్పుట్నిక్ ఆఫ్రికా విడుదల చేసింది.
భారతదేశంపై ప్రభావం
బూడిద మేఘాలు ఆఫ్రికా, ఒమన్, యెమన్, ఎర్ర సముద్రం మీదుగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ భారత వాతావరణంలోకి ప్రవేశించాయి. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలోనే వీటి ప్రభావం కనిపించింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు దట్టమైన బూడిద మేఘాలు దేశ రాజధాని ఢల్లీి `ఎన్సీఆర్ గగనతలంలో ఏర్పడినట్లు తెలిసింది. వీటి వల్ల ఢల్లీి వాతావరణం మరింత విషతుల్యమవుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు తర్వాత బూడిద మేఘాల కదలికలను నిపుణులు ట్రాక్ చేస్తున్నారు. వాతావరణ ట్రాకర్ల అంచనాల ప్రకారం ఈ బూడిద మేఘాలు పశ్చిమ రాజస్థాన్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాయి. జోధ్‌పూర్, జైసల్మార్ మీదుగా భారత ఉపఖండంలో వ్యాపిస్తున్నాయి. ఇవి క్రమంగా ఈశాన్యం వైపు కదులుతున్నాయని. 25 వేల నుంచి 45వేల అడుగుల ఎత్తులో ఆవరించి ఉన్నాయని ఇండియా మెట్ స్కై వెదర్ సంస్థ పేర్కొంది. హర్యానా, ఢల్లీి, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, హిమాచల్‌ప్రదేశ్ సహా హిమాలయ పర్వత ప్రాంతాలకూ వ్యాపించవచ్చని అంచనా వేస్తున్నారు. బూడిద మేగాలు ఎక్కువ ఎత్తులో ఉన్నందున ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉత్పన్నం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
విమానయాన రంగానికి నష్టం
అయితే బూడిద మేఘాల ప్రభావం విమానయాన రంగంపై తక్షణ ప్రభావం చూపుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నోటం, యాష్‌టం(హెచ్చరిక) జారీ చేసింది. ఇప్పటికే గగనతలంలో ఉన్న విమానాలకూ దీన్ని వర్తింపజేసింది. ఇంజిన్‌లో అసాధారణ పరిణామాలు లేదా క్యాబిన్‌లో వింత వాసన వస్తే వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించాలని సూచించింది. బూడిద మేఘాలు ఉన్న మార్గాల్లో ప్రయాణించరాదని సూచించింది. బూడిద పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు రన్‌వేలను చెక్ చేయాలని, అవసరమైతే కార్యకలాపాలను నిలిపివేయాలని అన్ని విమానాశ్రయాలకు సూచించారు. దాంతో పలు విమాన సర్వీసులను రద్దు చేయడమే, మార్గం మళ్లించడమో చేస్తున్నారు. కొచ్చి-దుబాయ్ ఇండిగో, కొచ్చి-జెడ్డా ఆకాశ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆమ్‌స్టర్‌డామ్-ఢల్లీి విమాన సర్వీసును రద్దు చేసినట్లు కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ వెల్లడిరచింది. కన్నూర్`అబుదాబీ విమానాన్ని ముందు జాగ్రత్తగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. బూడిద మేఘం భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఇండిగో సంస్థ ఆరు విమాన సర్వీసులను రద్దు చేసింది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా, కువైట్, అబుదాబీ సర్వీసులను అకాశ ఎయిర్‌లైన్స్ నిలిపివేసింది. పలు అంతర్జాతీయ విమానాలను పాకిస్తాన్ గగనతలం ద్వారా దారి మళ్లించారు. కానీ భారత విమానయాన సంస్థలు ఆ మార్గాన్ని ఉపయోగించే పరిస్థితి లేకపోవడంతో అనేక భారతీయ విమాన సర్వీసులకు అంతరాయం వాటిల్లింది.










Comments