top of page

బోయపాటి మార్క్‌ ‘తాండవం’.. స్క్రీన్‌ మీద కాదు..ఆడియన్స్‌ తల మీద!

  • Guest Writer
  • Dec 12, 2025
  • 5 min read

గతంలో ఒక ఇంటర్వ్యూలో బోయపాటి ఒక మాట చెప్పారు.. ‘‘సినిమా మొదలయ్యాక ప్రేక్షకులు ఒక 20 నిమిషాలు మనల్ని క్షమిస్తారు.. ఆ తర్వాత మనమే వాళ్ళను కథలోకి తీసుకెళ్ళాలి’’ అని.

బోయపాటి ఆ మాటను తూచా తప్పకుండా పాటించారు. ఫస్టాఫ్‌ మొదలైన 20 నిమిషాలు ప్రేక్షకుడిని అలా వదిలేసి, ఆ తర్వాత మెల్లగా సినిమాలోకి లాక్కెళ్ళారు. కాదు కాదు.. తెలివిగా లాక్కొని పోయి ఇరికించేశారు!

ఫస్టాఫ్‌ అంతా ఏదో రొటీన్‌గా నడిపించేసి, ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ఒక భారీ ఫైట్‌, అఖండ ఎంట్రీతో ‘‘అమ్మో ఏదో జరగబోతోంది’’ అనే అంచనాలు పెంచేశారు. ఆ నమ్మకంతో సెకండాఫ్‌ కోసం కూర్చున్న ప్రేక్షకుడికి అసలు సినిమా (చుక్కలు) మొదలవుతుంది.

ఫస్టాఫ్‌కే ఒకరిద్దరు కాదు, ఏకంగా 3, 4 విలన్లను పరిచయం చేసిన బోయపాటి.. వాళ్లు చాలరన్నట్టు మెయిన్‌ విలన్లుగా చైనా బ్యాచ్‌ ని దింపారు. పోనీ అక్కడితో ఆగాడా? అది కూడా సరిపోలేదని ఆది పినిశెట్టిని తాంత్రికుడిగా ఇరికించారు. ఆదికి ఒక పొడుగాటి ఫ్లాష్‌ బ్యాక్‌, అందులోనూ ఒక భయంకరమైన ఫైట్‌ పెట్టి, ఆదిని కూడా పాపం ఈ రొంపిలోకి లాగారు.

ఇక సెకండాఫ్‌ స్క్రీన్‌ప్లే గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది ఒక సైకిల్‌లా సాగుతుంది..

బాలయ్యతో చేసిన తొలి రెండు చిత్రాల్లో సగటు మాస్‌ కమర్షియల్‌ ఫార్ములాలే ప్రయత్నించాడు బోయపాటి శ్రీను. మూడో ప్రయత్నంలో మాత్రం ఆ ఫార్ములాకే కొంచెం డివైన్‌ టచ్‌ ఇచ్చాడు. బోయపాటి సినిమా అంటే ఇద్దరు బాలయ్యలు కామన్‌ కాగా.. ఈసారి రెండో బాలయ్యను పరమ శివభక్తుడైన అఘోరాగా మార్చి సినిమాకు కొత్త కలర్‌ తీసుకొచ్చాడు. కల్చర్‌.. డివైన్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమాలు బాగా క్లిక్‌ అవుతున్న ట్రెండులో ‘అఖండ’ అదుÄతే విజయాన్నందుకుంది. ఐతే అలాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాకు సీక్వెల్‌ అనేసరికి బోయపాటి అన్నీ డబుల్‌ డోస్‌ ఇచ్చేద్దామని ప్రయత్నించాడు. కానీ అది కాస్తా ఓవర్‌ డోస్‌ అయిపోయింది. ఇటు మాస్‌ సన్నివేశాలు శ్రుతి మించిపోయాయి. అటు డివైన్‌ ఎలిమెంట్లను వాడుకున్న తీరూ హద్దులు దాటిపోయింది. మొత్తంగా ‘అఖండ’లా ‘అఖండ-2’ ఒక ఆర్గానిక్‌ ఫీల్‌ తీసుకురావడంలో ఫెయిలైంది. ‘అఖండ-2’లో అతిగా అనిపిపిస్తూనే.. మాస్‌ ప్రేక్షకులను అలరించే ఎపిసోడ్లకేమీ లోటు లేదు. అఖండ పునరాగమనాన్ని చూపించే ఇంటర్వెల్‌ ఎపిసోడ్లో మాస్‌ ప్రేక్షకులకు.. బాలయ్య అభిమానులకు పూనకాలు ఖాయం. అఖండను హనుమంతుడు పూనే మరో యాక్షన్‌ ఎపిసోడ్‌ కూడా బాగానే పేలింది. మిగతా యాక్షన్‌ ఎపిసోడ్లను కూడా మాస్‌ మెచ్చేలా తీర్చిదిద్దారు. కానీ ఆయా ఎపిసోడ్లలో బలమైన ఎమోషన్‌ మాత్రం మిస్సయింది. అందుక్కారణం.. సినిమాలో బలమైన విలన్లు లేకపోవడం.. హీరోకు అసలు ఎదురే లేనట్లు చూపించడం. అన్ని తాంత్రిక విద్యలూ నేర్చుకుని పిశాచాలను వశపరుచుకున్నట్లు చెప్పే విలన్‌ భయంకరమైన అవతారంలో కనిపిస్తాడే కానీ.. అఖండ తనకు ఎదురొచ్చిన రెండుసార్లూ కనీసం నిలవజాలడు. ఇక చైనా ఆర్మీ చీఫ్‌ అండ్‌ కో వ్యవహారం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గన్నులు పట్టుకుని పదుల సంఖ్యలో రౌడీలు వచ్చినా.. తాంత్రిక విద్యలు తెలిసిన మాంత్రికుడొచ్చినా.. వందల మంది సైనికులతో కలిసి శత్రు దేశపు సైన్యాధ్యక్షుడు వచ్చినా.. జస్ట్‌ ఒక శూలం మాత్రమే చేతిలో ఉన్న అఖండ వీడియో గేముల్లో చంపినట్లు అందరినీ చంపుకుని పోవడమే ఉంటుంది. విలన్లను అంత వీక్‌ చేసి.. హీరోను మరీ అంత పీక్స్‌ లో చూపిస్తే.. ఇక కిక్కేముంటుంది? బోయపాటి సినిమాల్లో కథలు.. అందులో లాజిక్కుల గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోలేం. హీరోయిజం.. యాక్షన్‌ ఎపిసోడ్ల మధ్య మొక్కుబడిగా ఒక థ్రెడ్‌ ఏదో నడిపిస్తుంటాడతను. ‘అఖండ-2’ను పాన్‌ ఇండియా సినిమాగా మలిచే క్రమంలో కుంభమేళా.. అందులో ఒక వైరస్‌ అంటూ ఏదో కసరత్తు చేశాడు కానీ.. అది వర్కవుట్‌ కాలేదు. అది పూర్తిగా మిస్‌ ఫైర్‌ అయిందనే చెప్పాలి. సనాతన ధర్మం గురించి ఒక చోట డైలాగులైతే బాగున్నాయి కానీ.. దాని చుట్టూ సన్నివేశాలు కూడా ఓవర్‌ డోస్‌ అయినట్లే అనిపిస్తుంది. శివుడి ఎలిమెంట్‌ ‘అఖండ’లో మాదిరి ఆర్గానిక్‌ ఫీల్‌ ఇవ్వదు. పాన్‌ ఇండియా అప్పీల్‌ కోసం ‘అఖండ’ పరిధి పెంచే ప్రయత్నంలో ప్రతి విషయమూ హద్దులు దాటిపోయినట్లే అనిపిస్తుంది. అఖండ పాత్రతో ఫస్ట్‌ పార్ట్‌ లో ఉన్న ఎమోషనల్‌ కనెక్ట్‌ కూడా ఇక్కడ మిస్సయింది. యాక్షన్‌ సన్నివేశాల్లో ఆ పాత్రతో చేయించిన విపరీతమైన అతే అందుక్కారణం. ఓవరాల్‌ గా చెప్పాలంటే ‘అఖండ’లో ఉన్న సోల్‌ ‘అఖండ-2’లో మిస్సయింది. మాస్‌ అంశాలు ఓవర్‌ డోస్‌ అయిపోవడంతో ‘అఖండ-2’ ప్రేక్షకులకు సంతృప్తినివ్వడం కష్టమే.


బాలయ్య ఎంట్రీ - సనాతన ధర్మం మీద ఒక పెద్ద ‘క్లాసు’ పీకడం. చైనా వాడో, తాంత్రికుడో ఎదురొస్తే శూలంతో నరకడం - ఒక ‘ఫైటు’,మళ్ళీ ఇంకో పెద్ద ‘క్లాసు’..మళ్ళీ ఇంకో భయంకరమైన ‘ఫైటు’.

ఇలా ‘‘క్లాసు-ఫైటు-క్లాసు-ఫైటు’’ అంటూ లూప్‌ లో సాగే ఈ కథనంలో, థియేటర్లో ఇరుక్కున్న ప్రేక్షకుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఫీల్‌ అవుతాడు. అఖండ తెరమీద విలన్లను పొడుస్తుంటే.. కింద ఆడియన్స్‌ ని తన ఉపన్యాసాలతో పొడుస్తూ సహనంతో ఒక ఆట ఆడుకున్నాడు.

ఈ సినిమాతో బోయపాటి తన పరిధులు దాటి, ఆకాశాన్ని దాటి, చివరకు గ్రహాలను కూడా దాటి నేరుగా కైలాసానికి వెళ్ళిపోయారు. ‘‘నా భూతో నా భవిష్యత్‌’’ అన్నట్టు.. ఏకంగా కైలాసంలో ఉన్న శివుణి? కూడా క్యారెక్టర్‌ లా మార్చేసి సినిమాలోకి లాగారు.

అంతటితో ఆగితే ఆయన బోయపాటి ఎందుకు అవుతారు? తగలబడిన మనిషి ఆత్మ రూపంలో బయటకు వచ్చి శివుడితో డిస్కషన్‌ పెట్టడం, లాజిక్‌ లకు సమాధులు కట్టడం.. ఇవన్నీ చూశాక బోయపాటి వేరే లెవెల్‌ కి (ఏ లెవలో మీకే తెలియాలి) వెళ్లిపోయాడని అర్థమవుతుంది.

తాంత్రికుడు ఉన్నాడు కదా అని పిశాచాలను కూడా వదలకుండా వాడేసుకున్న విధానం చూస్తే.. ‘‘అబ్బో.. అబ్బో.. అబ్బో..’’ అనక తప్పదు.

ఫైనల్‌ పంచ్‌:

అసలే బాలయ్య, ఆపై బోయపాటి.. ఇంకేం..? తెరపై అఖండ తాండవం..!!

అసలే బాలయ్య అనే వెండితెర ఘనాపాటి.. అందులోనూ బోయపాటి.. అసలు తెలుగు హీరో అంటేనే ఓ మానవాతీత శక్తి.. ఇక అఘోరా వంటి మానవాతీత దైవిక శక్తులున్న అఖండ పాత్ర అయితే.. ఇంకేముంది..? సినిమా అంతా దబిడి దిబిడే.. అనగా లాజిక్కుల జోలికి పోకూడదు, అవి వెతికితే మతిపోతుంది అని..!

ఫస్ట్‌ ఆఫ్‌ ఆల్‌.. చైనా గురించి ఈ దర్శకుడికి కనీసావగాహన లేనట్టుంది. లేదా అక్కర్లేదే అనుకున్నట్టుంది. మన ఇండియన్‌ సినిమా దేశభక్తి టచ్‌ అనగానే యాంటీ పాకిస్థాన్‌, యాంటీ టెర్రర్‌ లైన్‌ తీసుకుంటుంది కదా, కానీ ఇక్కడ డిఫరెంట్‌.. చైనాను తీసుకున్నారు. పాకిస్థాన్‌లో సైనిక జనరల్స్‌ పెత్తనాలు, నిర్ణయాలు చల్తా.. కానీ చైనాలో నెవ్వర్‌.. చైనాలో పార్టీ, ప్రభుత్వం అల్టిమేట్‌.. వాళ్ల ప్రతి అడుగుకూ ఓ లెక్క ఉంటుంది. సైన్యం ఏమీ సుప్రీం కమాండ్‌ కాదు.

అన్నింటికీ మించి చైనా అన్నిరకాల బయోవార్‌ సహా అన్నిరకాల యుద్ధాలకూ రెడీగా ఉంటుంది తప్ప అది హిందూ ధర్మం మీద, మరీ కుంభమేళాల్ని, హిందూ ధర్మాన్ని టార్గెట్‌ చేసుకుని, నదుల్లో ప్రమాదకర వైరస్‌ను కలపడం వంటి క్షుద్ర, ఉగ్రవాద పోకడలకు వెళ్లినట్టు దాఖలాల్లేవు. సరిహద్దుల్లో స్ట్రెయిట్‌ గల్వాన్‌ చేతియుద్ధాలే తప్ప, మన భూభాగాన్ని ఆక్రమించుకోవడం తప్ప పాకిస్థాన్‌ తరహా ‘టెర్రరిస్టు’ పోకడలు ఉండవు దానికి.. పైగా సనాతన ధర్మాన్ని టార్గెట్‌ చేస్తే ఈ దేశాన్ని నష్టపరుస్తామనే ఊహ ఓ అబ్సర్డ్‌..

సేమ్‌, అలాగే చైనాను విలన్‌గా చూపించాలీ అంటే వాళ్ల ఆహారాన్ని, వాళ్ల భాషను, వాళ్ల సంస్క ృతిని తిట్టిపోయాల్సిన పని లేదు కూడా.. ఇంకాస్త చెప్పుకోవాలంటే గంజాయి అమ్ముకునే బ్యాచ్‌ అధికారుల్ని కిడ్నాప్‌ చేస్తే ఏకంగా ఎమ్మెల్యే రంగంలోకి దిగిపోయి ఒంటిచేత్తో ఫైట్‌ చేయాలా..? పైగా పీఎం ఆఫీసు నుంచి ఫోన్‌ వస్తుందట, ఎస్పీ కూడా ఆ కిడ్నాప్‌ బాధితుల్లో ఉంటాడట.. హేమిటో..

అఖండ ఫస్ట్‌ పార్ట్‌లో ప్రజ్ఞా జైస్వాల్‌ బాలయ్యకు కల్లు తాపించి, ఆవకాయ బద్దను నాకిస్తుంది. ఇందులో ఓ లేడీ ఆఫీసర్‌తో మందుకొడతాడు. (మొన్నీమధ్య ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో బోయపాటి, బాలయ్య విచిత్రమైన హిందీ మాట్లాడతారు చూశారా..? అక్కడక్కడా అఖండ తెరపై బాలయ్య పాత్ర కూడా అలాగే మాట్లాడేస్తూ ఉంటుంది).. ఐటమ్‌సాంగ్‌ కూడా పేలవంగా ఉంది.

వేక్సిన్‌ అనేది ముందు జాగ్రత్త.. అది చికిత్స కాదు. గంగానదిలో వైరస్‌ కలిపితే, ఎందరి ప్రాణాలో పోతూ ఉంటే అప్పటికప్పుడు సైంటిస్టు (హర్షాలి) జనని వేక్సిన్‌ కనిపెడితే, సైంటిస్టుల్ని చంపేసి, ఆమెను వేటాడటం ఏమిటి..? వేక్సిన్‌ కొత్తవాళ్లకు వైరస్‌ రాకుండా అడ్డుకోగలదు గానీ ఆల్రెడీ ఆ ప్రభావం ఉన్నవాళ్ల మీద పనిచేసేది ఏముంటుంది..? పైగా బయోవార్‌ చేసేవాడు వేక్సిన్‌ను అంతం చేయాలని చూడడు, మరో వైరస్‌ ప్రయోగిస్తాడు. చైనా వూహాన్‌ ల్యాబులో అలాంటివి బోలెడు వైరసులు.. కోవిడ్‌ను మించినవి...

సరే, ఆమెను కాపాడటానికి అఖండలోలాగే అఘోరా బాలయ్య వచ్చేస్తాడు. కమాన్‌ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ అంటాడు, అదీ చేతిలో ఒక్క శూలంతో.. మొత్తానికి గదతో, శూలంతో, అనుకోకుండా దొరికిన మిషన్‌ గన్‌తో నానా బీభత్సపు ఫైట్లు చేసేసి దేశాన్ని రక్షించేస్తాడు. సనాతన ధర్మాన్ని కూడా కాపాడేస్తాడు. సగటు తెలుగు హీరోను మించిన ‘అతి’ యాక్షన్‌తో.. శుభం.. ఓ సీన్‌లో మనిషిని అరచేత్తో తలకిందులుగా పట్టుకుని హారతి ఇవ్వడం.. త్రిశూలంతో హెలికాప్టర్‌ రెక్కలు తిప్పడం.. ఒక్కడే వరల్డ్‌ బెస్ట్‌ ఆర్మీని ఢీకొనడం.. బోయపాటి- బాలయ్యపాటి కాంబోకే సాధ్యం.

సినిమాకు బలం.. బాలయ్య అభిమానుల కోణం నుంచే కాదు, తటస్థ ప్రేక్షకులకూ నచ్చేవి డైలాగ్స్‌.. పదునుగా బాలయ్య నోటి నుంచి వచ్చి పడుతుంటయ్‌.. నిజానికి బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌ తరహా అఖండ డైలాగులతో పోలిస్తే పదును తక్కువే, ఐనా సరే పవర్‌ఫుల్‌గానే ఉన్నాయి. ఫస్టాఫ్‌ ఏవో సీన్లు, పాటలు గట్రా సాదాసీదాగా ఓ సగటు తెలుగు సినిమాలాగే ఉన్నా సెకండాఫ్‌ అఖండ పాత్ర ఎంటరయ్యాకే బీభత్సరసం థియేటర్లలో పొంగిపొర్లుతుంది. యాక్షనే యాక్షన్‌.. సూపర్‌ మ్యాన్‌, ఐరన్‌ మ్యాన్‌, యతీంద్రియ మ్యాన్‌..!!

దానికితోడు నందమూరి థమన్‌ వీర దంచుడు.. తనకు తెలిసిన బీజీఎం అంటేనే మోత, అతి.. ఎంత ఎక్కువ డెసిబిల్స్‌ సౌండ్‌ అంటే ఎక్కువ దంచినట్టు అట.. బీజీఎం మోత మీద పెట్టిన శ్రద్ధ పాటలు, ట్యూన్స్‌ మీద పెడితే బాగుండేది.

నిజానికి ఆ బాలయ్య పంచ్‌ డైలాగ్స్‌ మామూలుగా చెప్పినా బాగానే ఉంటాయి, కానీ బాలయ్య కదా, అరిచి చెప్పాల్సిందే, లేకపోతే పేలవా..? ఏమో మరి.. బోయపాటి ఇలాంటివి అస్సలు పట్టించుకోడు. తగలబడిన మనిషి ఆత్మ రూపంలో బయటకు వచ్చి శివుడితో డిస్కషన్‌ పెట్టడం, పిశాచాలను కూడా కథలోకి పట్టుకురావడం అంటే మామూలు విషయమా..

నటీనటుల విషయానికి వస్తే బాలయ్యకు తిరుగేముంది..? యాక్షనే కాదు, తల్లి అంత్యక్రియలు వంటి కొన్ని ఎమోషనల్‌ సీన్లలోనూ తన అనుభవాన్ని రంగరించాడు. నిజానికి అఖండ అంటే బాలయ్య, అంతే.. తనకు తప్ప ఇంకెవరికీ సూట్‌ కాదు అన్నట్టుగా చేశాడు. సంయుక్త ప్రయారిటీ లేని పాత్ర.. ఉన్నంతలో హర్షాలి పాత్ర బెటర్‌. చైనా ఆర్మీ జనరల్‌ పాత్రలో షాంఘై షెల్ట్రిం, మాజీ జనరల్‌ పాత్రలో శాశ్వత ఛటర్జీ, ప్రధాని పాత్రలో సర్వదమన్‌ బెనర్జీ, క్షుద్ర మాంత్రికుడు ఆది ఎట్సెట్రా పర్లేదు.

ప్రస్తుతం ఇండియన్‌ సినిమా ట్రెండ్‌ ఏమిటి..? సనాతన ధర్మం, దేశభక్తి, యాక్షన్‌ టచ్‌ ఏదో ఒకటి బలంగా ఉండాలి కదా.. ఇందులో అన్నీ కలిపి కొట్టారు. ఏమాటకామాట.. హైందవం మీద, చైనా కల్చర్‌తో తేడా మీద డైలాగ్స్‌ బాగున్నాయి. కుంభమేళా సీన్స్‌, హిమాలయాల సీన్స్‌ చిత్రీకరణ గట్రా నిర్మాణ విలువలు గ్రాండ్‌గా ఉన్నాయి.

బాలయ్య ఫ్యాన్‌ కోణంలో చూస్తే, సినిమా అఖండం.. అలాగే చూడాలి. గతంలో బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణిలో పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ ఉంటాయి. బాలయ్య అరిచి చెప్పడు, స్పష్టంగా, అర్థమయ్యేలా ఉంటుంది డిక్షన్‌.. ప్చ్‌, అలా చెప్పిస్తే బోయపాటికే నచ్చదు, బాలయ్యకు నప్పదు అనుకుంటాడు.

అవునూ, ఈ రేంజ్‌ అతి యాక్షన్‌ సీన్లు, ఈ హై డెసిబిల్స్‌ సౌండ్స్‌తో ఓ రేంజ్‌, ఓ లెవల్‌కు తీసుకుపోయారుగా, మరి తరువాత సినిమా ఎలా ఉండాలి..? దీనికి రెట్టింపు ‘స్టాండర్డ్‌’ సెట్‌ చేయాలా..?!

కానీ ఏమాటకామాట... అఖండకు పూర్తి కంట్రాస్టులో బాలయ్య తన నాన్న ఎన్టీయార్‌లాగే ఓ వీరబ్రహ్మేంద్రస్వామి వంటి సాత్విక, ధార్మిక పాత్ర చేస్తే చూడాలని ఉంది..!! తల్లి కడుపులో ఉన్నప్పుడే జైబాలయ్య నినాదం విన్న అభిమన్యుడు, కారణ జన్ముడు కదా... చేస్తాడేమో చూడాలి..!!

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని నీడలా అంటిపెట్టుకుని ఎప్పుడూ ఓ సూరీడు కనిపిస్తుండేవాడు. జుట్టు తెల్లగా, మీసాలు మాత్రం నల్లగా.. నిగనిగ.. బాలయ్య అఖండ లుక్‌ చూడగానే గుర్తొచ్చే కేరక్టర్‌ సూరీడే.. గడ్డం పూర్తిగా నెరిసి, మీసాలు మాత్రం నల్లగా.. మరి బాలయ్య పౌరుషం కదా.. ఎన్నటికి నెరిసేదే లేదన్నమాట. లుక్కు కూడా లాజిక్కుకు అందకూడదు మరి, అంతే.. అఘోరాకు దుస్తులు, కండువా, భారీ రుద్రాక్ష మాలలు.. హబ్బో.. చివరకు త్రిశూలం మీద నంది బొమ్మ, జబ్బలకు తాయెత్తుల్లాంటి ఆభరణాలు, గాజుల్లాంటి కంకణాలు, ఉంగరాలు, వడ్డాణం వంటి బెల్టు కూడా..! ఇలా..!!

- ముచ్చట సౌజన్యంతో...

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page