top of page

బ్రిటన్ నుంచి మన సంపద తెచ్చుకోలేమా?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 19 hours ago
  • 3 min read

బ్రిటీష్ వలసపాలన గురించి ఈ తరంవారికి పెద్దగా తెలియదు. చరిత్ర పుస్తకాý ద్వారా, వారూ వీరు చెప్పగా వినడమే తప్ప. ఒకనాటి బ్రిటీష్ ప్రభుత్వ ఆధిపత్య విధానాలకు బలి కాని దేశం లేదని చెప్పడం అతిశయోక్తి కాబోదేమో! అంతెందుకు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా విలసిల్లుతున్న అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటీష్ వలసవాద పాలనలో మగ్గిపోయిన దేశమే. ఇక మనదేశం సంగతి చెప్పనక్క ర్లేదు. సుమారు 200 ఏళ్లపాటు బ్రిటీష్ దాస్యశంఖలాల్లో చిక్కుకుని సర్వం కోల్పోయింది. రాచరికంలో ఉండే బ్రిటీష్ ప్రభుత్వం విస్తరణ కాంక్షతో దాదాపు 57 దేశాలను తన ఆధిపత్యంలోకి తీసుకుంది. వ్యాపారం పేరుతో మొదట ఆయా దేశాల్లో అడుగుపెట్టడం, అక్కడి ప్రజలు ప్రభుత్వాల్లో ఉన్న అనైక్యత ను ఆసరా చేసుకుని అధికారాన్ని లాక్కోవడం క్రమంగా బ్రిటీష్ వలస పాలనను ఏర్పాటు చేయడం నాటి బ్రిటిష్ ప్రభుత్వ నిత్యకార్యక్రమంలా ఉండేది. ఆ విధంగా 1920నాటికి ప్రపంచంలో నాలుగో వంతు భూభాగం, ఐదోవంతు జనాభా బ్రిటిష్ పాలన కింద ఉండేవంటే వారి సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఎంతగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆనాడు బ్రిటన్‌ను ‘రవి అస్తమించని బ్రిటీష్ సామ్రా జ్యం’ అని అభివర్ణించేవారు. అంటే ప్రపంచమంతటా విస్తరించిన బ్రిటీష్ సామ్రాజ్యంలో ఏదో ఒకచోట సూర్యుడు కనిపిస్తూనే ఉండేవాడన్నమాట. అయితే కాలం, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అదే రీతిలో బ్రిటిష్ రాజ్యాం కూడా కాలగతిలో తిరుగుబాట్లు, ఉద్యమాలు, స్వాతంత్య్ర పోరాటాలకు తలగ్గొక తప్పలేదు. ఒక్కో దేశానికి తమ నుంచి విముక్తి కల్పించకతప్పలేదు. ఆ విధంగా 1984లో చివరిసారి గా బ్రూనై బ్రిటీషర్ల నుంచి స్వాతంత్య్రం పొందింది. ఒకప్పుడు తిరుగులేని పెత్తనం చేసి, అనేక దేశాల వనరులు, సంపదలు, అపురూపమైన వస్తువులను తమ దేశానికి ఎత్తుకుపోయిన బ్రిటన్ ఇప్పుడు వాటిని తిరిగి ఇవ్వకతప్పదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలంక చేస్తున్న డిమాండ్లు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. బ్రిటిష్ పాలనలో జరిగిన దోపిడీ, అన్యాయాలపై ఇప్పుడు శ్రీలంక గళం విప్పింది. వలస పాలన కాలంలో బ్రిటన్ తమ దేశానికి చేసిన ఆస్తి, ప్రాణనష్టా నికి భారీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా తమ దేశం నుంచి దొంగిలించు కుపోయిన అమూల్యమైన చారిత్రక సంపదను, సాంస్కృతిక వారసత్వాన్ని వెనక్కి ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నది. ఆ మేరకు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్ పార్లమెంటులో చేసిన ఒక ప్రకటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా దేశాలు తమను పాలించిన దేశాల నుంచి నష్టపరిహారం కోరుతున్నప్పుడు మనం ఎందుకు మౌనంగా ఉండా లని ఆయన ప్రశ్నించారు. దీనికి స్పందించిన ప్రభుత్వం.. కేవలం సంపదనే కాకుండా, బ్రిటిష్ సైన్యం శ్రీలంకను పాలించిన కాలంలో చేసిన దాడులు, విధ్వంసాలు, పోయిన మనుషుల ప్రాణాలకు కూడా పరిహారం కోరతామని వెల్లడించింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా దౌత్యపరంగా బ్రిటన్‌పై ఒత్తిడి తెస్తామని ప్రభుత్వం తెలిపింది. 1796 నుంచి 1948 వరకు దాదాపు 152 ఏళ్ల పాటు శ్రీలంక ను (అప్పట్లో సీలోన్) బ్రిటన్ పాలించింది. మనదేశం మాదిరిగానే అప్పట్లో శ్రీలంకలో అనేక రాజ్యాలు ఉండేవి. ఆ సమయంలో రాచరిక వ్యవస్థలకు చెందిన సింహాసనాలు, కిరీటాలు, బంగారు ఖడ్గాలతో పాటు అపారమైన నిధులను బ్రిటన్ తరలించుకుపోయింది. నేటికీ లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఎనిమిదో శతాబ్దానికి చెందిన దేవి తార అనే అద్భుతమైన కాంస్య విగ్రహం ఉంది. నిలువెత్తు బంగారు పూతతో మెరిసిపోయే ఈ విగ్రహాన్ని తిరిగి తెచ్చుకోవడాన్ని శ్రీలంక ప్రథమ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయంలో లంక ప్రభుత్వం నెదర్లాండ్స్ నుంచి స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తోంది. బ్రిటన్ నుంచి మొండిచేయి ఎదురవుతున్నా, శ్రీలంకకు ఇటీవల నెదర్లాండ్స్(ఒకప్పటి డచ్ రాజ్యం) నుంచి గొప్ప విజయం లభించింది. 2023 డిసెంబర్‌లో నెదర్లాండ్స్ ప్రభుత్వం సుమారు 250 ఏళ్ల క్రితం శ్రీలంక నుంచి దోచుకెళ్లిన ఆరు ప్రధాన వస్తువులను తిరిగి ఇచ్చేసింది. వీటిలో వజ్రాలు పొదిగిన బంగారు ఖడ్గం, పురాతన తుపాకులు, చారిత్రక లెవ్కే ఫిరంగి ఉన్నాయి. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు శ్రీలంక తన దృష్టిని బ్రిటన్ వైపు సారించింది. బ్రిటిష్ మ్యూజియంలో బంధీలుగా ఉన్న తమ వారసత్వ వస్తువులను విడిపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే ఈ పోరాటం అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా వరకు పురాతన వస్తువులు విదేశాల్లోని ప్రైవేట్ వ్యక్తుల వద్ద, వేలంలో అమ్ముడుపోయిన కలెక్షన్లలో ఉన్నాయి. వారిపై ఒత్తిడి తేవడం అంతర్జాతీయ చట్టాల పరంగా క్లిష్టమైన ప్రక్రియ. మరోవైపు శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం వంటి గడ్డు పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఈ సెంటిమెంట్ కార్డును వాడుతోం దని ఆ దేశానికి చెందిన ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. కారణం ఏదైనా వలస పాలన కాలంనాటి లెక్కలు తేల్చాలన్న శ్రీలంక డిమాండ్ మాత్రం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇక శ్రీలంక తరహాలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడంలేదన్న ప్రశ్నలు భారత ప్రజల్లో వినిపించ డం సహజం. పరిస్థితులు, కారణాలు ఏవైనా శ్రీలంక లాంటి చిన్నదేశమే బ్రిటన్ చేత పోయిన తమ సంపదను తిరిగి కక్కించడానికి ప్రయత్నిస్తుంటే ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదుగుతున్నామని చెప్పు కొంటున్న మన ప్రభుత్వం ఆ ప్రయత్నం గానీ.. ఆ ఆలోచన గానీ ఎందుకు చేయడంలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అప్పట్లో శ్రీలంక కంటే భారత్ సుసంపన్న దేశం. 200 ఏళ్లుదేశాన్ని గుప్పిట్లో పెట్టు కున్న బ్రిటీషర్లు కోహినూర్ వంటి అమూల్యమైన వజ్రాలు, ఇతర అపురూపమైన సంపదలను తరలిం చుకుపోయారు. సాధ్యాసాధ్యాల సంగతెలా ఉన్నా.. మొదట ప్రయత్నమంటూ మొదలవ్వాలి కదా!



Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page