top of page

బెల్ట్‌ బాగోతం.. సర్కారీ ఊతం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Sep 23, 2025
  • 3 min read
  • ఆదాయం పెంచుకునే యావలో రాష్ట్ర ప్రభుత్వం

  • విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్‌ షాపులపై ఉదాసీనత

  • నామమాత్రపు కేసులతో సరిపెట్టేస్తున్న అధికారులు

  • ఇదే అదనుగా రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు

  • చివరికి నష్టపోతున్నది మందుబాబులే

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

తక్కువ ధరకే నాణ్యమైన మద్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హమీని రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చినా.. మరో రకంగా మందుబాబుల జెల్ల కొట్టి జేబులు గుల్ల చేస్తోంది. నాణ్యమైన మద్యం మాట ఎలా ఉన్నా తాగినోళ్లకు తాగినంత అన్నట్లు గల్లీలు, గ్రామాలు అన్న తేడా లేకుండా విచ్చలవిడిగా మందు అందుబాటులో ఉంచుతోంది. జిల్లాలో 176 మద్యం షాపులు ఉండగా.. అవన్నీ అధికార పార్టీ నేతల భాగస్వామ్యం ఉన్నవే కావడం విశేషం. వీటికి సమాంతరంగా గ్రామాల్లో బెల్ట్‌షాపులు తెరిచారు. ప్రభుత్వం ఇస్తున్న నామమాత్రపు కమీషన్‌ వల్ల నష్టపోతున్నామంటూ, మద్యం వ్యాపారులు ఎక్కడికక్కడ సిండికేటుగా ఏర్పడ్డారు. ఎవరికివారుగా వ్యాపారం చేస్తే లాభాలు రావడం లేదని గ్రహించి ముఠా కట్టారు. అలా అందరూ కలిసికట్టుగా టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల, నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల పరిధిలో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచి అమ్ముతున్నారు. మరోవైపు అమ్మకాలు పెంచేందుకు గ్రామాల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేయించారు. లైసెన్స్‌డ్‌ షాపులో అమ్మే ధరకే ఈ షాపులకు అన్ని రకాల బ్రాండ్ల మద్యం సరఫరా చేస్తున్నారు. బెల్ట్‌ నిర్వాహకులు క్యార్టర్‌కు రూ.20 నుంచి రూ.50 వరకు పెంచి విక్రయిస్తున్నారు. దీనికితోడు షాపుల వద్దే కూర్చొని మద్యం సేవించడానికి వీలుగా అనధికార రూములు ఏర్పాటు చేసుకున్నారు. గుడి, బడి సమీపాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై ఉన్నతాధికారులకు అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నా ఫలితం కనిపించడంలేదు. బహిరంగంగా మద్యం విక్రయాలు సాగించడం, బెల్ట్‌షాపులు విషయంలోనూ ఇదే ఉదాసీనత కనిపిస్తోంది.

నేతల భాగస్వామ్యంలోనే

అధికార కూటమి పార్టీల నాయకుల కనుసన్నల్లోనే మద్యం దుకాణాలు నడుస్తుండటంతో ఎక్సైజ్‌ అధికారులు ఏమీ చేయలేక చేతులు ముడుచుకు కూర్చున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఈ అక్రమాల్లో పలువురు ఎక్సైజ్‌ అధికారుల పాత్ర కూడా ఉందంటున్నారు. కాగా మద్యం పాలసీలో 20 శాతం కమీషన్‌ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం తీరా పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత దాన్ని పది శాతానికి కుదించిందని విమర్శిస్తున్నారు. జనాభా ఆధారంగా మద్యం షాపులకు లైసెన్స్‌ ఫీజులు ఎక్కువగా నిర్ణయించడం, కమీషన్‌ తగ్గించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్టు మద్యం వ్యాపారులు చెబుతున్నారు. మద్యం పాలసీలో పేర్కొన్న విధంగా 20 శాతం కమీషన్‌ ఇవ్వాలని రాష్ట్రస్థాయిలో మద్యం వ్యాపారులు ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. దాంతో అధిక ధరలకు మద్యం విక్రయించడం, బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు పెంచుకోవడం వంటి తప్పుడు దారుల్లోకి వ్యాపారులు మరలుతున్నారు. ఎక్సైజ్‌ శాఖ గణాంకాలే బెల్ట్‌ షాపులు, మద్యం అక్రమ రవాణా వంటి విషయాల్లో ప్రభుత్వ ఉదాసీనతకు దర్పణం పడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 31 వరకు జిల్లాలో 837 బెల్ట్‌ షాపులపై కేసులు నమోదు చేసి 837 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 1120 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. కానీ మద్యం సరఫరా చేసిన వ్యాపారుల మీద ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బెల్ట్‌ నిర్వహిస్తున్న కొద్దిమందిపై నామమాత్రంగా కేసులు పెట్టారు. ఒడిశా నుంచి మద్యం సరఫరా చేస్తున్న 88 మందిని అరెస్టు చేసి 1034 లీటర్లు మద్యం, బీరు స్వాధీనం చేసుకొని 87 కేసులు నమోదు చేశారు. ఇక కల్తీ మద్యం తయారీపై సారవకోట మండలంలో ఒక కేసు నమోదైంది. మద్యం బాటిళ్లతో దొరికిన వ్యక్తి వాటిని ఏ షాపు నుంచి తీసుకొస్తున్నాడో తెలిసినా సదరు లైసెన్స్‌ దుకాణం జోలికి వెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బెల్టుకు మద్యం సరఫరా చేసినవారికి మొదటిసారి రూ.5 లక్షల అపరాధ రుసుము విధిస్తామని, అదే పునరావృతమైతే దుకాణం సీజ్‌ చేస్తామని ప్రభుత్వం చేసిన హెచ్చరికలు ఎక్కడా అమలుకావడం లేదంటే ప్రభుత్వం తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిబంధనలు పట్టవు

మద్యం షాపుల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు కొనసాగించాలి. అయితే పట్టణాల్లో కొంతమేర సమయపాలన అమలవుతున్నా మండల, గ్రామీణ ప్రాంతాల్లో అసలు అమలుకావడం లేదు. పట్టణ ప్రాంతాల్లో మద్యం షాపు పక్కనే పాన్‌షాపులు ఏర్పాటు చేసి మద్యం షాపులు మూసేసిన తర్వాత వాటి ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. రాత్రి పది గంటలు దాటిన తర్వాత 180 ఎంఎల్‌ సీసీ ధరను రూ.10 అంత కంటే ఎక్కువ పెంచి విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుండటాన్ని అసరా చేసుకుని వ్యాపారులు నిబంధనలను కాలరాస్తున్నారు. మద్యం వ్యాపారాల్లో చాలావరకు టీడీపీ నేతలే భాగస్వాములుగా ఉంటూ ప్రభుత్వం తమదేనన్న ధీమాతో బెల్టు షాపుల ఏర్పాటు, లూజు విక్రయాలకు పాల్పడుతున్నారు. ఇక మద్యం దుకాణాల పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో మందు బాబులు బహిరంగంగానే మద్యం సేవిస్తున్నారు.

యథా ప్రభుత్వం..తథా అధికారులు

ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా వ్యాపారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మద్యం అమ్మకాలు పెంచేందుకు రకరకాల పద్ధతులను అనుసరిస్తోంది. గత ఏడాది అక్టోబరులో కొత్త మద్యం పాలసీ ప్రారంభమైన తర్వాత మద్యం విక్రయాలపై కొంత కఠిన వైఖరి అవలంభించిన ప్రభుత్వం వ్యాపారులకు కమీషన్‌ను ఇవ్వకుండా జాప్యం చేసింది. దీనిపై ఉద్యమాన్ని లేవనెత్తడంతో 10 శాతంగా ఉన్న కమీషన్‌ 14 శాతానికి పెంచినట్టు ప్రకటించినా వ్యాపారులకు అందలేదు. దీనికి బదులు లైసెన్సు షాపులకు అనుబంధంగా వాటి పరిధిలో బెల్ట్‌ షాపులు పెట్టి మద్యం సరఫరా చేసుకొనే వెసులుబాటును అనధికారికంగా కల్పించిందన్న ఆరోపణలు ఉన్నాయి. 20 శాతం కమీషన్‌ పూర్తిస్థాయిలో ఇవ్వగలిగితే తప్ప మద్యం లైసెన్స్‌ ఫీజులను రికవరీ చేసుకోలేమన్న భావనతో వ్యాపారులు ఉన్నారు. ఆదాయం కోసం ప్రభుత్వమే పరోక్షంగా బెల్టు దుకాణాలకు సహకరిస్తుండటంతో ఎక్సైజ్‌ అధికారులు వాటి విషయంలో కన్ను చేరేస్తున్నారు. బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న సిండికేట్‌ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోకుండా నామమాత్రంగా కేసులు నమోదుచేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మద్యం అమ్మకాల ద్వారా ఇచ్చే కమీషన్లతో సంబంధం లేకుండా ప్రతి దుకాణం నుంచి అధికారులు నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page