top of page

బిల్డప్‌ బాబాయ్‌..!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Oct 11, 2025
  • 2 min read
  • పదవి వచ్చెను.. వేషము మార్చెను!

  • చిన్న పదవి రాగానే విభూది సూరిబాబు ఎక్స్‌ట్రాలు

  • పచ్చ కండువా తీసేసి వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో ఆర్భాటం

  • హోదాకు మించి కార్గిల్‌ పార్కులో విన్యాసాలు

  • పోస్టు రాకముందు ఏనాడు దానివైపు చూడని ఘనుడు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘శత్రువులెక్కడో ఉండర్రా.. కూతుళ్ల రూపంలోనో, అక్కచెల్లెళ్ల రూపంలోనో మన చుట్టూనే తిరుగుతుంటారు’.. అంటాడు రావు రమేష్‌ ‘అఆ’ సినిమా క్లైమాక్స్‌లో. అధికార పార్టీ పరిస్థితి కూడా అటువంటిదే. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఎక్కడినుంచో ప్రతిపక్షాలు దిగుమతి కానక్కర్లేదు.. కేవలం అధికార పార్టీ కార్యకర్తలు, ఛోటా నేతలే చాలు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన దగ్గర్నుంచి టీడీపీలో ఉన్నామనే ఒకే ఒక్క సాకు చూపించి.. పట్టుమని పది ఓట్లు వేయించలేనివారు కూడా నామినేటెడ్‌ పదవులు పొంది ఇప్పుడు ఓవరాక్షన్‌ చేస్తుండటాన్ని చూసి ఆ పార్టీ శ్రేణులే బుగ్గలు నొక్కుకుంటున్నాయి. కావాలంటే ఈ ఫొటో చూడండి..

..ఇందులో వైట్‌ అండ్‌ వైట్‌ డ్రస్‌ వేసుకొని నల్లకళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తిపేరు విభూది సూరిబాబు. ఈయన ఉందో లేదో తెలియని 31వ డివిజన్‌ ఇన్‌ఛార్జినని చెప్పుకునేవారు(ఇవన్నీ గతంలో లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన పోస్టులు). ఇప్పుడు తాజాగా రాష్ట్ర కనీస వేతనాల బోర్డుకు డైరెక్టర్‌గా ఆయనకు నామినేటెడ్‌ పదవి లభించింది. ఆయన్ను స్థానిక ఎమ్మెల్యే రికమండ్‌ చేశారా? లేక కూన రవి ఇప్పించారా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. తనకు సదరు పదవి వచ్చిన వెంటనే సూరిబాబు హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న కార్గిల్‌ పార్క్‌ను సందర్శించారు. విచిత్రమేమిటంటే.. ఆయనది అదే డివిజన్‌ కాబట్టి రోజూ ఆ పార్క్‌ను చూస్తునే ఉంటారు. పార్క్‌ అభివృద్ధికి మున్సిపల్‌ కార్పొరేషన్‌, సుడా నిధులు వెచ్చించి చేపట్టిన పనులు నీరుగారిపోయినా ఏరోజూ ఆయన మాట్లాడలేదు. కానీ ఇప్పుడు కనీస వేతన బోర్డు డైరెక్టర్‌ పదవి వరించగానే ఆయనలో రాజకీయ రక్కసి నిద్రలేచినట్టుంది. వెంటనే పసుపు కండువా పక్కన పెట్టి వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌ ధరించి, రేబాన్‌ కళ్లద్దాలు పెట్టుకొని ఆర్భాటం చేశారు. స్థానిక సచివాలయ సిబ్బందిని పిలిపించి పార్క్‌ కోసం మాట్లాడారు. అధునాతనంగా, అతి సుందరంగా పార్కును తీర్చిదిద్దుతామని సెలవిచ్చారు. అసలు కార్గిల్‌ పార్క్‌ గానీ, నగరంలో మరో అభివృద్ధి అంశంలో గానీ రాష్ట్ర కనీస వేతనాల బోర్డు సభ్యుడికి ఏం అవగాహన ఉంటుంది? ఇది మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన పార్క్‌ కాబట్టి కమిషనర్‌ మాట్లాడాలి.. మున్సిపల్‌ పాలకవర్గం లేనందున కలెక్టర్‌ అయినా మాట్లాడాలి.. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు ఎటువంటి అభ్యంతరాలూ ఉండవు. కానీ విభూది సూరిబాబు కనీస వేతనాల బోర్డు మెంబరైన తర్వాత పార్క్‌ స్కెచ్‌ పట్టుకొని సూచనలు చేయడమే విడ్డూరం.

పాత బ్లూప్రింట్‌తో హడావుడి

ఎందుకంటే.. ఇటీవల ఈ పార్క్‌ పరిస్థితి అధ్వానంగా ఉందని ‘సత్యం’లో కథనం వచ్చిన తర్వాత కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు పార్క్‌ను సందర్శించి దాన్ని సుందరీకరణకు డిజైన్‌ రూపొందించమని సుడా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సుగుణాకర్‌కు సూచించారు. పార్కులో ఏమేమి ఉండాలి? ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే ప్రణాళికను రూపొందించే పనిలో సుగుణాకర్‌ ఉన్నారు. ఇది రెండు మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈలోగానే పార్క్‌ పాత బ్లూప్రింట్‌ను పట్టుకొని పాపం సూరిబాబు ఫొటోలకు ఇలా ఫోజిచ్చారు. మునిగిపోతున్న పార్కుకు ఎక్కడ్నుంచి నిధులు తెచ్చి పైకెత్తాలో తెలియక కేంద్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యే తలలు పట్టుకుంటుంటే.. ఆధునిక టెక్నాలజీతో పార్క్‌ను అభివృద్ధి చేస్తామని సూరిబాబు వాకృచ్చారు. పోనీ ఈయనేమైనా గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ డైరెక్టరా అంటే.. కానే కాదు. కనీస వేతనాల బోర్డు కింద కూర్చోబెట్టారు. పోనీ ఆ బోర్డేమైనా రాజ్యాంగబద్ధమైన సంస్థా అంటే.. అదీ కాదు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 39, 43కు అనుసంధానంగా పని చేయమని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించే వ్యవస్థ ఇది. కానీ మనోడు ఇచ్చిన బిల్డప్‌కు స్థానిక ప్రజానీకం ముక్కున వేలేసుకుంటోంది. వాస్తవానికి స్థానికి పౌరసమాజం ఎప్పట్నుంచో ఈ పార్క్‌ అభివృద్ధి కోసం చేయని ప్రయత్నం లేదు, కలవని నేత లేడు. అయినా పనులు ఒడ్డెక్కడంలేదు. ఈ లెక్కన ఒక్క విభూది సూరిబాబే కాదు.. చాలామంది తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులతో అధికార వేదికను పంచుకుంటున్నారు. అధికారులతో రివ్యూ చేస్తుంటే.. వీరు ఏ హోదాలో వేదిక మీద ఉంటున్నారో, అదే స్థాయిలో ఉన్న మరికొందరు తెలుగు తమ్ముళ్లు స్టేజి కింద ఎందుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. కొసమెరుపేటంటే.. రైతుబజార్‌ జంక్షన్‌ నుంచి ఏసీబీ కార్యాలయం వరకు ఉన్న బొందిలీపురం రోడ్డును వెడల్పు చేయాలని కలెక్టర్‌ ఆమధ్య ఒక ఇంజినీరింగ్‌ వ్యవస్థను కోరారు. ఇది మున్సిపాలిటీ రోడ్డు కాబట్టి.. దానికి ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ ఉన్నారు కాబట్టి.. ఆయన రిజల్యూషన్‌ పాస్‌ చేస్తే రోడ్డెక్కుతామని, అంతవరకు తమకు ఆ హక్కు లేదని స్వయంగా అక్కడి అధికారులు రాజకీయ నాయకులకు స్పష్టం చేశారు. అంటే ఎవరు చేయాల్సిన పని వారు చేయాలని దానర్థం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page