top of page

బాలలే బలిపశువులు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Nov 29
  • 4 min read
  • బెగ్గింగ్‌ మాఫియా కోరల్లో బాల్యం

  • నానాటికీ విస్తృతమవుతున్న పిల్లల అక్రమ రవాణా

  • పంజా విసురుతున్న చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠాలు

  • అమ్మడానికి, ఆవయవాల దోపిడీకి కూడా కిడ్నాపులు

  • సరైన రీతిలో స్పందించలేకపోతున్న ప్రభుత్వాలు

  • ఈ తరహా కేసుల్లో రాష్ట్రంలో శ్రీకాకుళానికి మూడోస్థానం

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర ఆగినప్పుడు చంకలో చంటిబిడ్డను పెట్టుకొని పాలకోసం డబ్బులివ్వమని కోరే మహిళలు కనిపిస్తుంటారు. ఎప్పుడు గ్రీన్‌లైట్‌ పడుతుందా? ఎప్పుడు జంక్షన్‌ దాటేద్దామా అన్న ఆలోచనతో మనం వారిని సరిగా పట్టించుకోం కానీ.. నిండా పదమూడేళ్లు లేని అమ్మాయిలు కూడా చీర కట్టి, చంకలో నెలల పిల్లాడ్ని వేసుకొని భిక్షాటన చేస్తుంటుంది. తల్లి కాని ఈ తల్లికి ఈ బిడ్డడు ఎలా వచ్చాడని కూడా మనం ఎప్పుడూ ఆలోచించం. జాలి కలిగితే ధర్మం చేస్తాం.. లేదంటే వీరికి ఇదే పనైపోయిందంటూ ఈసడిరచుకుంటాం. ఇక్కడ చీర కట్టుకుని భిక్షాటన చేస్తున్న చిన్న అమ్మాయి, ఆమె చంకలో ఉన్న బిడ్డ.. ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో సొంత తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడ్డవారే.

రోడ్ల మాద మనకు తరచూ బాలగాంధీలు కనిపిస్తుంటారు. ఒంటి నిండా సిల్వర్‌ కలర్‌ పెయింట్‌ పూసుకుని బోడిగుండు, కుళ్లాయి పంచె కట్టు, కళ్లద్దాలు, చేతికత్రో అచ్చం గాంధీ విగ్రహాన్ని తలపిస్తూ జంక్షన్లలో శిలావిగ్రహాల్లో గంటలతరబడి నిలబడి నిలువుకాళ్ల శిక్ష అనుభవిస్తుంటారు. వీరిపై జాలితో తోచినంత డబ్బులు ఇస్తుంటాం. కానీ ఈ బాలగాంధీలు కూడా చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠాల చేతుల్లో బంధీలే.

రైల్వే కంపార్ట్‌మెంట్‌లో కాలు లేదా చెయ్యి విరిగిన స్థితిలో బాలకులు ఫ్లోర్‌ క్లీన్‌ చేస్తూ కనిపిస్తుంటారు. వీరంతా పుట్టుకతో వికలాంగులు కాదు. చైల్డ్‌ ట్రాఫికింగ్‌కు బలైన బాధితులు. పిల్లలను ఎత్తుకొచ్చి భిక్షాటనకు వీలుగా అవయవాలను విరిచేసి.. వారు సంపాదించే ఎంగిలి మెతుకులకు అర్రులు చాచే ముఠా కూడా ఉంది. అసలు దృష్టి సారించాల్సింది వీటి మీద. ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయినవాడు ఎక్కడో ఒకదగ్గర ఉన్నట్టు క్లూ ఇస్తాడు. లవర్‌ను లేపుకుపోయినవాడు ఏడాది తర్వాత బిడ్డతోనైనా బయటపడతాడు. కానీ అడ్రస్‌ లేకుండాపోయిన బాలలు, బాల్యం కోసమే ఇప్పుడు ఆలోచించాలి.

ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు

పిల్లల అక్రమ రవాణా (ట్రాఫికింగ్‌)లో మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంటే.. రాష్ట్రంలో మన జిల్లా మూడో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయినా పిల్లలు మాయమవడాన్ని పోలీస్‌ శాఖ ఎక్కడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంలేదు. టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు కనిపించకుండాపోతే లేచిపోయారన్న సాకుతోను, అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు కనిపించకుండాపోతే ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయారని, మళ్లీ తిరిగొస్తారన్న నెపంతోను ఈ తరహా కేసులను సీరియస్‌గా తీసుకోవడంలేదు. కానీ మానవ అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ కలిగి ఉందని తెలిస్తే మన గుండెలాగిపోవడం ఖాయం. ఎంతసేపూ చిన్నారులు కనిపించకుండాపోతే పిల్లలు లేనివారు తీసుకుపోయారనో, భిక్షాటనకు వీరిని వాడుకుంటున్నారనో సరిపెట్టుకోడానికి వీల్లేదు. ఎందుకంటే మానవ అక్రమ రవాణాలో మనిషి శరీరంలోని ఆర్గాన్లు(అవయవాలు) తొలగించి లక్షలకు అమ్ముకునే ముఠాలూ ఉన్నాయి. కానీ ఈ కోణంలో ప్రభుత్వాలు దృష్టి సారించడంలేదు. రాష్ట్రంలో బాలలు అక్రమ రవాణాకు గురవుతున్నారని కొన్ని జాతీయ సంస్థలు ఇచ్చిన నివేదికపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందులో మన జిల్లా మూడో స్థానంలో ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 2022 తర్వాత 18 ఏళ్ల లోపు పిల్లలు 98 మంది అక్రమ రవాణాకు గురయ్యారని సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌-ఆన్‌-రికార్డ్‌ అసోసియేషన్‌ విడుదల చేసిన నివేదిక పేర్కొనడంతో జిల్లాలో బాలల భద్రత ఎలా ఉందో అర్ధమవుతుంది.

చాలా ఏళ్లుగా ఇదే పరిస్థితి

చాలా ఏళ్లుగా ఇదే పరిస్థికోవిడ్‌ తర్వాత పేదరికం, నిరుద్యోగం పెరగడం ఈ అక్రమ రవాణా పెరుగుదలకు ప్రధాన కారణంగా నివేదికలో పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రుణాలు లేదా చిన్న మొత్తాల్లో డబ్బు ఆశ చూపించి అనేక ముఠాలు వారి పిల్లలను బాల కార్మికులుగా మార్చి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నట్టు పలు స్వచ్ఛంద సంస్థల నివేదికలో పేర్కొంటున్నాయి. ఈ అంశాలు బాలల అక్రమ రవాణాకు అనువైన పరిస్థితులను సృష్టించాయని పేర్కొన్నాయి. బాలల అక్రమ రవాణా కేసుల్లో జాతీయస్థాయిలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఢల్లీి తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఉంది. 2016`22 మధ్య 50,210 కేసులు నమోదైనట్టు నివేదికలో పేర్కొన్నారు. బాలల అక్రమ రవాణాకు అనువైన ప్రాంతాలు(హైరిస్క్‌ జోన్స్‌)గా గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, భీమవరం జిల్లాలు గుర్తింపు పొందాయి. ఇందుకు కారణాలను కూడా నివేదికలో ప్రస్తావించారు. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల ద్వారా అక్రమ రవాణాదారులు పిల్లలను ఇతర రాష్ట్రాలకు సులభంగా తరలించడానికి వీలవుతుంది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో వ్యవసాయ రంగం, భీమవరం ప్రాంతంలోని ఆక్వా సాగులో బాల కార్మికుల డిమాండ్‌ ఎక్కువగా ఉంది. వీటి వల్లే ఈ జిల్లాల్లో బాలల అక్రమ రవాణా కేసులు అధికంగా నమోదవుతున్నట్టు పేర్కొంది. శ్రీకాకుళం నుంచి మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో పాటు బాలలను పనుల కోసం తరలించడం సర్వసాధారణం. మరోవైపు బాలల అక్రమ రవాణా స్వరూపం క్రమంగా మారుతోందని స్వచ్ఛంద సంస్థల నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 2024లో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అంతర్‌ రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠాలు చురుకుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. ఈ ముఠాలు శిశువులను అధిక ధరకు సంతానం లేని జంటలకు అమ్ముతున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

వలసల ముసుగులో తరలింపు

గత కొన్నేళ్ల గణాంకాలు చూస్తే గుంటూరు జిల్లాలో 208, నెల్లూరు జిల్లాలో 125, ఆ తర్వాత శ్రీకాకుళం 98 బాలలు అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని నివేదికలో పేర్కొన్నారు. కర్నూలులో 74, భీమవరంలో 28 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర మండలాల్లో మత్స్యకార జనాభా అధికంగా ఉంది. వీరి జీవనాధారానికి అనువైన అవకాశాలు జిల్లాలో పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల గుజరాత్‌లోని వీరావల్‌ వంటి ప్రాంతాలకు తమ పిల్లలతో సహా వలస పోతున్నారు. ఈ వలసల ముసుగులోనే బాలల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మానవ అక్రమ రవాణా నిరోధక బృందం, చైల్డ్‌లైన్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కలిసి ఆమదాలవలస రైల్వేస్టేషనలో మత్స్యకార బాలలను అడ్డుకొని వెనక్కి తీసుకువచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం జిలాల్లో మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలు చురుకుగా పనిచేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బాలల అక్రమ రవాణా ఇప్పటికీ తీవ్ర సమస్యగా కొనసాగుతోంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో శిశువులను అధిక ధరకు సంతానం లేని జంటలకు విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠాలను పోలీసులు గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, అక్రమ రవాణాను నియంత్రించడానికి ప్రతి జిల్లాలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించాల్సి ఉందని నివేదికలో అభిప్రాయపడ్డారు. బాలల అక్రమ రవాణాను నియంత్రించడానికి విస్తృత ప్రచారంతో పాటు, కాల్‌లాగ్‌ల పర్యవేక్షణ, సమాచార వినియోగంతో కూడిన అత్యవసర సహాయక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. బాలల అక్రమ రవాణా జరుగుతున్నట్లు అనుమానం వస్తే తక్షణమే 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు లేదా 112 పోలీస్‌ ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్‌ చేసేలా అవగాహన కల్పించాలని సూచించింది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఆన్‌లైన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ వెబ్‌సైట్‌లను సందర్శిస్తున్నారు? అనే విషయాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని తల్లిదండ్రులకు సూచించింది.

ఈ ఏడాది 9 కేసులు

జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కార్యక్రమాల్లో భాగంగా బాలల రక్షణ, సంరక్షణ విభాగం అధికారులు చైల్డ్‌లైన్‌ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి బాలల అక్రమ రవాణా నియంత్రణకు కృషి చేస్తున్నారు. యాంటీ ట్రాఫికింగ్‌లో భాగంగా ఈ ఏడాది ఇప్పటి వరకు తొమ్మిది మందిని అధికారులు గుర్తించారు. వీరిని బాల కార్మికులుగా, భిక్షాటన కోసం, వ్యభిచారం, సంతానం లేని దంపతులకు విక్రయించడానికి తరలిస్తున్నట్టు గుర్తించి రక్షించారు. చిన్నపిల్లలను రోడ్డుపై విడిచిపెట్టి వెళుతున్న ఘటనలు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 18 నమోదయ్యాయి. వీరిలో 12 మంది ఆడ, ఆరుగురు మగ పిల్లలు ఉన్నారు. జీవనోపాధి కోసం పిల్లలను ఒంటరిగా వదిలేసి తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఘటనలు ఏడు నమోదయ్యాయి. ఇవి కాకుండా అదృశ్యమైన 18 ఏళ్ల లోపల పిల్లలు 21 మందిని కనుగొని ఇళ్లకు తిరిగి తీసుకొచ్చారు. భిక్షాటన చేస్తున్న 34 మంది చిన్నారులను వెనక్కు తీసుకొచ్చారు. ఇంటి నుంచి పారిపోయిన 115 మందిలో ఆడపిల్లలూ ఉన్నారు. ప్రేమ పేరుతో 18 ఏళ్ల లోపు యువతీ యువకులు 34 మంది ఇంటి నుంచి వెళ్లిపోయారు. బాల నేరస్తులుగా 179 మందిని గుర్తించారు. తల్లిదండ్రుల నిరాదరణకు గురైన 37 మందిని అక్కున చేర్చుకున్నారు. 368 మంది బాలకార్మికులను గుర్తించి విముక్తి కల్పించారు. కార్పొరేట్‌ స్కూల్స్‌ సిబ్బందితో బాధించబడిన వారిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇలా వివిధ రకాలుగా బాధితులైన 2,473 మంది బాలలను ఈ ఏడాది ఇప్పటి వరకు రెస్క్యూ చేశారు. అయితే అనధికారికంగా మరికొన్ని ఉండొచ్చు. ఇందులో ట్రాఫికింగ్‌ (అక్రమ రవాణా) వేరు, ఇంటి నుంచి అలిగి వెళ్లిపోవడం వేరు. అక్రమ రవాణాకు గురైనవారు ఏమయ్యారన్నదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page