బీసీ రిజర్వేషన్ల రాజకీయం!
- DV RAMANA

- Jul 16, 2025
- 2 min read

బీసీ రిజర్వేషన్ల అంశం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉంది. జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతుల(బీసీ)కు ఆ దామాషా పద్ధతిలో విద్య, ఉద్యోగాలు కేటాయించాల్సి ఉండగా అలా జరగడంలేదని ఆ వర్గాల దీర్ఘకాల ఆరోపణ.. పోరాటం. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ అంశం గా మారపోతూ ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలు నీరుగారిపోతున్నాయి. మన దాయాది తెలుగు రాష్ట్రం తెలంగాణలో ప్రస్తుతం అలాంటి రాజకీయమే నడుస్తోంది. ఆ రాష్ట్రంలో కోర్టు తీర్పు ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ చివరిలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ బీసీ రిజర్వేషన్లను తెరపైకి తీసుకొచ్చారు. ఏకంగా బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు అమలు చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఆర్డినెన్స్ రూపొందించి ఇటీవలి మంత్రివర్గ సమా వేశంలో దాన్ని ఆమోదముద్ర వేయించారు. తుది ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపింది. అక్కడ రాజముద్ర పడగానే సదరు ఆర్డినెన్స్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. రిజర్వే షన్లు అమల్లోకి వస్తాయి. కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం పెండిరగులో పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం 22 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లను అమాంతంగా 42 శాతానికి పెంచేయడం ఆ వర్గాలకు ఆమోద యోగ్యమే కాకపోతే దానికి అనుసరించిన పద్ధతి, న్యాయపరంగా వాటి చెల్లుబాటుపైనే అనుమానాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. గవర్నర్ ఆమోదం పొంది ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే రెండు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నిక ల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతాయి. దాంతో బీసీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు లభిస్తాయన్నది నిర్వివాదాంశం. ఒకవేళ ఏ కారణం చేతనైనా కేంద్రం దీన్ని ఆమోదించకపోయినా లేదా ఎవరైనా ఈ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించినా కూడా కాంగ్రెస్ పార్టీకే మైలేజీ లభిస్తుంది. ఈ కారణాలతో ఆర్డినెన్స్ అమలుకు నోచుకోకపోతే స్థానిక ఎన్నికల ప్రచారానికి వజ్రాయుధం లభించినట్లే. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ హామీనే ప్రచారాస్త్రంగా చేసుకుంది. కాంగ్రెస్‌ను గెలిపించి అధికారంలోకి తెస్తే బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని అప్పట్లో ఆ పార్టీ వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర వరకు ఆ హామీని పెద్దగా పట్టించుకోని సీఎం రేవంత్‌రెడ్డి కోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ల హామీని ఉన్నఫళంగా తెరపైకి తెచ్చి.. అదీ రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందకుండా ఆర్డినెన్స్ రూపం లో తేవడం ద్వారా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక విషయం గమనార్హం. కేసీఆర్ హయాంలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రయత్నించి విఫలమైంది. 22 శాతంగా ఉన్న ఈ వర్గాల రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ ఆదే శాలు జారీ చేసింది. అయితే కోర్టు దాన్ని తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేయడంతో బీసీ రిజర్వేషన్లు మళ్లీ 22 శాతానికే పరిమితమయ్యాయి. మరో న్యాయపరమైన అంశం ఏమిటంటే.. విద్య, ఉద్యోగ, రాజకీయపరమైన రిజర్వేషన్లు మొత్తం కలిపి 50 శాతానికి మించకూడదని గతంలోనే సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. దేశ న్యాయవ్యవస్థ మొత్తం ఆ రూలింగ్‌నే ప్రామాణికంగా తీసుకుని ఇటువంటి కేసుల్లో నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో పలు రాష్ట్రాలు ముస్లింలు, ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన నిర్ణయాలను ఈ రూలింగ్ ఆధారంగానే న్యాయస్థానాలు తిరస్కరించాయి. ప్రసుతం తెలంగాణలో రిజర్వేషన్ల కోటా స్ట్రక్చర్ పరిశీలిస్తే.. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 22 శాతం.. అంటే సరిగ్గా 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు బీసీ రిజర్వేషన్లు 22 నుంచి 42 శాతంగా అమలైతే.. మొత్తం రిజర్వేషన్లు 70 శాతానికి ఎగబాకుతాయి. అంటే తెలంగాణ జనాభాలోని మిగిలిన అన్ని వర్గాలకు కలిపి 30 శాతం సీట్లే దక్కుతాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులు అంగీకరించే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ సర్కారుకు మాత్రం కావలసిన రాజకీయ ప్రయోజనం మాత్రం సిద్ధిస్తుంది. మా ప్రయత్నం మేం చేశాం.. బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నదే మా తాపత్రయం.. కానీ అడ్డుకోవడానికి కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టు నిలిపివేసింది’.. అంటూ రాజకీయ ప్రత్యర్థులు, కోర్టులపైకి నెపాన్ని నెట్టివేసి ప్రయోజనం పొందే అవకాశం కాంగ్రెస్‌కు లభిస్తుంది. ఇదే మరి రాజకీయమంటే!










Comments