బీహార్ మార్పు కోరుతోందా?
- DV RAMANA

- Nov 8, 2025
- 2 min read

మొదటిదశ పోలింగ్ పూర్తి చేసుకున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగుపై రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరిస్తే.. మొదటి దశ పోలింగ్ జరిగిన తీరు ఎవరికి అనుకూలమన్నదానిపై రకరకాలు విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలిదశ పోలింగ్ సరళిని లోటుపాట్లను గుర్తించి పార్టీలు తదనుగుణంగా రెండో దశకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే తొలిదశలో బీహర్ చరిత్రలోనే రికార్డుస్థాయి పోలింగ్ నమోదు కావడం కొత్త చర్చలకు తావిస్తోంది. 73 ఏళ్ల బీహార్ చరిత్రలో 64.66 శాతం పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారని గణాంకాలు చెబుతున్నాయి. తొలిదశ పోలింగ్ జరిగిన 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంత భారీ సగటు నమోదు కావడం ఎవరికి అనుకూలం.. ఇంకెవరికి ప్రతికూలం అన్న చర్చ జరుగుతోంది. ఆ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో నమోదైన 62.57 శాతమే ఇంతవరకు అత్యధికంగా ఉండేది. లోక్‌సభ ఎన్నికల్లో అయితే 1998లో ఆ రాష్ట్రం 64.6 శాతం ఓటింగ్ నమోదు చేసింది. కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఈ రెండు అంకెలను అధిగమించాయి. భారీగా తరలివచ్చి ఓట్లు వేయడం ద్వారా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని ఎన్నికల సంఘం హర్షం వ్యక్తం చేస్తుండగా రాజకీయ పార్టీలు మాత్రం ఈ భారీ పోలింగ్ ఎవరి కొంప ముంచుతుందోనని లోలోన మధనపడిపోతున్నాయి. కొందరు విశ్లేషకులు భారీ పోల్ పర్సంటేజీపై కొత్త వాదన వినిపిస్తున్నారు. సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా పోలింగ్ భారీగా జరిగిందంటే.. అది ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకతగా నిదర్శనంగా భావిస్తారు. తమలో గూడుకట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకతను వెల్లడిరచేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఇష్టపడనివారు కూడా భారీగా తరలివచ్చి వ్యతిరేక ఓటును బలంగా గుద్దేస్తారు. గత మూడు ఎన్నికల్లో బీహార్‌లో దాదాపు ఇదే జరిగింది. 2010లో బీజేపీతో కలిసి పోటీ చేయడం ద్వారా నితీశ్‌కుమార్‌కు చెందిన జేడీయూ గెలిచింది. అప్పుడు ఓటింగ్ 52.73 శాతంగా నమోదైంది. 2015లో ఓటింగ్ శాతం 56.91 శాతానికి పెరిగింది. ఆ ఎన్నికల్లో విపక్ష ఆర్జేడీతో జట్టుకట్టడం ద్వారా జేడీయూ నెగ్గింది. అంటే అప్పటివరకు అధికారంలో ఉన్న జేడీయూ-బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినట్లే కదా. 2020లో మళ్లీ నితీష్ పార్టీ మళ్లీ కమలం పార్టీతో జట్టు కట్టి గెలిచింది. ఆ ఎన్నికల్లో కూడా గతం కంటే అధికంగా 57.29 శాతం ఓటింగ్ జరిగింది. 2020లో తొలి దశ ఓటింగ్ 56.2 శాతమే. కానీ ఈసారి 64.66 శాతం ఓటింగ్ జరిగింది. ఈ మూడు ఎన్నికల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించినా.. ఆ ప్రభుత్వాల్లో ప్రధాన భాగస్వామిగా ఉన్న నితీష్‌కుమార్ చాకచక్యంగా ప్రతి ఎన్నికల్లోనూ తన సంకీర్ణ భాగస్వామిని మార్చడం ద్వారా ఆ వ్యతిరేకత నుంచి తప్పించుకుని అధికారాన్ని కాపాడుకోగలిగారు. ఆ కారణంగానే 2020 ఎన్నికల్లో 75 సీట్లు సాధించి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఈ ఎన్నికల్లో మాత్రం గతం నుంచీ ఉన్న బీజేపీ`జేడీయూ(ఎన్డీయే) కూటమే జంపింగులు, మార్పులు లేకుండా యథాతథంగా బరిలో నిలవడంతో ఈసారి కచ్చితంగా ఆ కూటమిపై యాంటీ ఇన్‌కంబెన్సీ (ప్రభుత్వంపై వ్యతిరేకత) ప్రభావం చూపుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా భారీ పోలింగ్ నమోదు కావడమే దీనికి సంకేతమని కూడా పేర్కొంటున్నారు. ఈ వాదనల పరిస్థితి అలా ఉంటే.. మరికొందరు ప్రస్తుత పోలింగ్ శాతం పెరుగుదలకు వేరే కారణాలు ఉన్నాయంటున్నారు. జనం పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం పోలింగ్ శాతం పెరుగుదల కారణం కావచ్చేమోగానీ.. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కూడా కారణమేననే వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఎస్‌ఐఆర్ సందర్భవంగా బీహార్ వ్యాప్తంగా నకిలీ ఓటర్లు, లేని ఓటర్లు అంటూ 47 లక్షల ఓట్లు తొలగించారు. ఫలితంగా గతంలో 7.89 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు తగ్గిపోయింది. ఈ తగ్గుదలే ఓటింగ్ శాతం పెరగడానికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఉదాహరణకు 100 మంది ఓటర్లు ఉండి.. వారిలో 60 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే 60 శాతం పోలింగ్ జరిగిందని లెక్కగట్టి చెబుతారు. ఎస్‌ఐఆర్ తర్వాత వంద ఓటర్ల సంఖ్య 80కి తగ్గిందనుకుందాం.. కానీ గతంలో మాదిరిగా అదే 60 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారనుకుందాం. దాన్ని శాతాల్లోకి లెక్క కడితే పోలింగ్ 75 వస్తుంది. అంటే 75 శాతం పోలింగ్ జరిగినట్లన్నమాట. ఆ లెక్కన పోలింగ్ శాతం గతంలో నమోదైన 60 శాతం కంటే ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ ఓట్లు వేసిన సంఖ్య మాత్రం మారలేదు. గత ఎన్నికల్లో ఓట్లు వేసిన 60 మందే ఈ ఎన్నికల్లోనూ ఓట్లు వేశారు. ఈ గణాంక గారడీయే ఈసారి రికార్డుస్థాయి పోలింగ్ నమోదైనట్లు చూపుతోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంకెల సంగతి పక్కన పెట్టినా ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు, ఈ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ పేరుతో బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ మాటాల్లో చెప్పాలంటే.. బీహార్ మొదటి దశ పోలింగ్ రెండు విషయాలను సూచిస్తోంది. మొదటిది బీహార్‌లో 60 శాతానికిపైగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కానీ గత పాతిక ముప్పయ్యేళ్లుగా తగిన రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఓటర్లలో ఒక రకమైన ఉదాసీనత నెలకొంది. రాష్ట్ర ప్రజలు ఏకధాటిగా 15 ఏళ్లపాటు లాలు కుటుంబపాలన చూశారు. మరో 20 ఏళ్లు నితీష్ రాజకీయ క్రీడ చూశారు. ఇప్పుడు ఈ రెండిరటికీ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది.










Comments