బదిలీల గండం నుంచి ‘ముగ్గురు’ సేఫ్!
- BAGADI NARAYANARAO

- 10 hours ago
- 2 min read
నాలుగేళ్లు దాటినా కదలని అధికారులు
గత ప్రభుత్వ హయాంలో ల్యాండింగ్.. ప్రస్తుత కూటమితో మంతనాలు?
అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులున్నా అండగా నిలుస్తున్న రాజకీయ ప్రాపకం!
వెళ్లేది లేదంటున్న బీసీ సంక్షేమ, ఖజానా, ఔషధ నియంత్రణ శాఖల బాస్‌లు


(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రభుత్వాలు మారినా.. ప్రజాప్రతినిధులు మారినా.. ఆ ముగ్గురు అధికారుల సీట్లు మాత్రం కదలడం లేదు! గత వైకాపా హయాంలో సిఫార్సులతో ల్యాండ్ అయిన సదరు అధికారులు.. ఇప్పుడు కూటమి నేతలతోనూ మంతనాలు సాగిస్తూ జిల్లాలో తిష్ట వేశారు. మూడేళ్ల పరిమితి ముగిసి, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా బదిలీల గండం నుంచి ఎలా తప్పించుకుంటున్నారనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
జిల్లాలో సాధారణ బదిలీల ప్రక్రియ ముగిసి, పలువురు ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగినా.. ఆ ముగ్గురు అధికారులు మాత్రం జిల్లాను వదిలి వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్లు దాటితే బదిలీ కావాల్సి ఉన్నా, వీరు మాత్రం నాలుగేళ్లుగా ఇక్కడే తిష్ట వేసి చక్రం తిప్పుతున్నారు. గత వైకాపా హయాంలో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో జిల్లాకు వచ్చిన వీరు.. ఇప్పుడు ప్రభుత్వం మారినా, ప్రస్తుత కూటమి ప్రజాప్రతినిధులతో అంటకాగుతూ తమ సీట్లను భద్రపరుచుకోవడం జిల్లా ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఆ ముగ్గురు అధికారుల వ్యవహారంపై ప్రత్యేక కథనం..
కోర్టు స్టేలతో బీసీ సంక్షేమ శాఖ అధికారిణి హల్‌చల్!
జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి (డీబీసీడబ్ల్యూవో)గా పనిచేస్తున్న అనురాధ ఇక్కడ బాధ్యతలు స్వీకరించి నాలుగున్నరేళ్లు దాటింది. ఈమెపై గతంలో పనిచేసిన చోట అవినీతికి పాల్పడినట్లు ‘ఏసీబీ’ చార్జ్ షీట్ కూడా దాఖలైంది. దీనిపై డైరెక్టరేట్ అధికారులు స్పందించి ఈమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వగా, కలెక్టరేట్‌లోని కొందరు సిబ్బంది సహకారంతో కాలయాపన చేసి, హైకోర్టు నుంచి సాంకేతిక కారణాలతో ‘స్టే’ తెచ్చుకున్నారు. ఈమెపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా కలెక్టర్ రెండుసార్లు విచారణ కమిటీలు వేసినా, ఆ నివేదికలు బుట్టదాఖలయ్యాయనే విమర్శలు ఉన్నాయి. నాటి వైకాపా నేతలు, నేటి టీడీపీ నాయకుల ఆశీస్సులతో ఈమె తన పంథా మార్చకుండా కొనసాగుతున్నారు.
‘నలుగురి’ ముఠాతో ఏడీసీ చంద్రరావు బేరసారాలు!
జిల్లా సహాయ ఔషధ నియంత్రణాధికారి (ఏడీసీ) చంద్రరావు జిల్లాకు వచ్చి నాలుగేళ్లయింది. ఈయన తన చుట్టూ నలుగురు రిటైల్ వ్యాపారులను ‘కోటరీ’గా పెట్టుకుని జిల్లాలోని ఫార్మసిస్టులు, హోల్‌సేల్ మెడికల్ ఏజెన్సీలతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలను శ్రీకాకుళం జిల్లాలోనే అమలు చేస్తూ మెడికల్ షాపుల యజమానులను వేధిస్తున్నట్లు సమాచారం. జి.సిగడాం మండలానికి చెందిన ఒక ఫార్మసిస్ట్ ఈయనపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా, రాజకీయ అండదండల వల్ల విచారణను నీరుగార్చారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రజాప్రతినిధులనే లెక్కచేయని ఖజానా శాఖ డీడీ రవికుమార్
జిల్లాలో అన్నిటికంటే ఎక్కువ వివాదాల్లో ఉన్న అధికారి జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్. నాలుగున్నరేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న ఈయనపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇటీవల ఉద్యోగులతో జరిగిన ఒక వివాదంలో స్వయంగా కూటమి ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ఈయన ఏమాత్రం లెక్కచేయకుండా తలబిరుసుగా వ్యవహరించారు. ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లినా, ఈయనపై ఎలాంటి చర్యలు లేకపోవడం వెనుక పెద్ద హస్తమే ఉందనే ప్రచారం సాగుతోంది.
కమిటీలు వేస్తారు.. నివేదికలు నీరుగారుస్తారు!
ఈ ముగ్గురు అధికారులు తమ శాఖల్లో బదిలీలు, సర్దుబాట్లు, డెప్యూటేషన్లు, సిబ్బంది ప్రమోషన్ల పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప, నివేదికలను బయట పెట్టడం లేదని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. ఇటీవల కొన్ని కీలక శాఖల అధికారులను మార్చినా.. రాజకీయ పైరవీలతో బదిలీల మినహాయింపు జాబితాలో ఈ ముగ్గురి పేర్లు చేరడం చూసి తోటి ప్రభుత్వ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, కలెక్టర్ స్పందించి వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.






Comments