top of page

స్థానికులకు ‘సున్నా’.. ఇతర రాష్ట్రాల వారికే ‘ఐదు వేలు’

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 9 hours ago
  • 2 min read
  • శ్రీకాకుళం పెత్తనం.. బీహార్, యÖపీలకే జీతం

  • నిబంధనలు ఇప్ప్పుడు బయటబెట్టిన మైనార్టీ సంక్షేమ శాఖ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళంలో ఇమామ్‌ల గౌరవభృతి స్థానికులకు కాకుండా ఇతర రాష్ట్రాల వారికే జమ అవుతున్న వైనం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు అనర్హుల ఖాతాల్లోకి జమవుతున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్‌లకు నెలకు రూ.5వేల గౌరవభృతి అందిస్తోంది. మైనార్టీ సంక్షేమానికి ఉద్దేశించిన ఈ పథకం శ్రీకాకుళం జిల్లాలో అమలవుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో గౌరవభృతి పొందుతున్న ఇమామ్‌లలో ఎక్కువ మంది స్థానికులు కాకుండా బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని వెలుగులోకి రావడంతో పథకం అమలు, అర్హతలు, పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇటీవల మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇమామ్‌లతో డీఆరఓ విశ్వేశ్వరరావు సమావేశం నిర్వహించారు. ఇందులో కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారని తెలిసింది. హాజరైన వారిలో ఎవరికీ తెలుగు రాదు. వచ్చిన వారంతా ఉర్దూ, హిందీలో మాట్లాడుతున్నారు. జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన 36 మసీదులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం సుమారు 20 మంది ఇమామ్‌లకు మాత్రమే గౌరవభృతి అందుతున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ పేర్కొంటోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గౌరవభృతి పొందుతున్న వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు లేరు. స్థానికంగా మసీదుల్లో విధులు నిర్వహిస్తున్న ఇమామ్‌లలో బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారేనని తెలుస్తోంది. వీరే ప్రభుత్వ గౌరవభృతి పొందుతున్నారు. ప్రభుత్వ పథకాలకు ఈ రాష్ట్రానికి చెందిన వారికే ప్రాధాన్యం ఉండాలని, అలా కాకుండా మసీదులో అధికారికంగా విధులు నిర్వహిస్తున్న ఎవరైనా అర్హులేననడం సరికాదని స్థానికులు అంటున్నారు. ఈ అంశంపై జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సంప్రదించగా.. “జిల్లాకు చెందినవారు ఇమామ్‌లుగా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే మసీదుల్లో ఇమామ్‌లుగా సేవలందిస్తున్నారు. అందుకే వారికి గౌరవభృతి చెల్లిస్తున్నాం” అని వివరణ ఇచ్చారు. ఎవరైనా అధికారికంగా ఫిర్యాదు చేస్తే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మన్యం, విజయనగరం జిల్లాల్లో కూడా ఇదే విధానం అమలవుతోందని తెలుస్తోంది. అక్కడ కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన ఇమామ్‌లకే గౌరవభృతి అందుతోందని చెబుతున్నారు.

నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

ముస్లిం మతాచారాల ప్రకారం అర్హత కలిగిన ఇమామ్‌లను స్థానిక మసీదు కమిటీలు నియమిస్తాయి. వారు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఆయా మసీదుల్లో అధికారికంగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ అర్హత ప్రమాణాలు పూర్తి చేస్తే గౌరవభృతి పొందేందుకు అర్హులయ్యే అవకాశం ఉందని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. మైనార్టీ సంక్షేమ అధికారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే గౌరవభృతి అందుకొనేవారు ఈ రాష్ట్రానికి చెందినవారై ఉండాలనే నిబంధన ఉందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నందున ఈ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలనే నిబంధన ఉంది. దీన్ని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇమామ్ ఈ రాష్ట్రానికి చెందిన వారై, గుర్తింపు పొందిన మసీదులో విధులు నిర్వహించాలి.

ఇమామ్ ఎంపికను మసీదు కమిటీ చూసుకుంటుంది. ఆధార్, బ్యాంకు ఖాతా, నివాస ధ్రువీకరణ పత్రాలను సరిగ్గా పరిశీలించకుండా ఇమామ్‌ల ఎంపిక జరుగుతోందనడానికి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ పనిచేస్తుండడమే నిదర్శనం. ప్రజాధనంతో అమలవుతున్న సంక్షేమ పథకాలలో పారదర్శకత లోపించింది అనడానికి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు జిల్లాలో మసీదులకు ఇమామ్‌లుగా వ్యవహరిస్తూ, వారి ఖాతాల్లో గౌరవభృతి జమ చేయించుకోవడమే ఇందుకు ఉదాహరణ. ఇది కేవలం స్థానికులు, బయటి రాష్ట్రాల వారు అనే చర్చ మాత్రమే కాదు.. ప్రభుత్వ సంక్షేమ నిధులు నిజమైన అర్హులకు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా చేరుతున్నాయా లేదా అన్నదే ప్రధాన అంశం. ఈ నేపథ్యంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా వారీగా లబ్ధిదారుల వివరాలు, అర్హత ప్రమాణాలు, ఎంపిక విధానాన్ని బహిర్గతం చేస్తే అనుమానాలకు తెరపడే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page