విశాఖ జోన్ తొలి ప్రభావం..!
- BAGADI NARAYANARAO

- 4 hours ago
- 2 min read
అముదాలవలస నుంచి పలాసకు కార్యాలయాల తరలింపు
56 ఏళ్ల చరిత్ర కలిగిన డివిజనల్ కేంద్రానికి గండం
రైల్వే ఉద్యోగుల్లో ఆందోళన.
కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే జోక్యం కోసం ఎదురు చూపు

(సత్యం న్యూస్, అముదాలవలస )
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ (విశాఖ రైల్వే జోన్) ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో కనిపించడం ప్రారంభమైంది. దశాబ్దాలుగా జిల్లా రైల్వే పరిపాలనా కేంద్రంగా కొనసాగుతున్న శ్రీకాకుళం రోడ్డు (అముదాలవలస) నుంచి కీలక రైల్వే ఇంజినీరింగ్ కార్యాలయాలను పలాసకు తరలించే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు విశాఖ జోన్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ జోన్ అధికారులు ఈ నెల 3న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అముదాలవలసలోని సహాయక మండల ఇంజినీర్ (ఏడీఈఎన్) కార్యాలయంతో పాటు ఇంజినీరింగ్ వర్క్స్ విభాగ కార్యాలయాన్ని పలాసకు తరలించనున్నారు. ఇప్పటికే ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించి అంతర్గత ఏర్పాట్లు ప్రారంభమైనట్లు సమాచారం.
56 ఏళ్ల చరిత్రకు ముగింపు
1971 నుంచి అముదాలవలస రైల్వే ఇంజినీరింగ్ పరిపాలనా కేంద్రంగా కొనసాగుతోంది. దాదాపు 56 ఏళ్లుగా జిల్లా పరిధిలోని రైల్వే ట్రాక్‌ల నిర్వహణ, భవనాల నిర్మాణం, మరమ్మతులు, ఇంజినీరింగ్ పర్యవేక్షణ వంటి కీలక కార్యకలాపాలు ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. సహాయక మండల ఇంజినీర్ కార్యాలయంలో సుమారు 15 మంది, ఇంజినీరింగ్ వర్క్స్ విభాగంలో మరో 30 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కార్యాలయాలు పలాసకు మారితే ఈ సిబ్బంది కూడా అక్కడికి బదిలీ కానున్నారు. ఇంజినీరింగ్ వర్క్స్ విభాగానికి చెందిన అముదాలవలస రైల్వే క్వార్టర్ల నిర్వహణకు అవసరమైన దిగువ స్థాయి సిబ్బందిని మాత్రమే అక్కడ ఉంచి, మిగిలిన అధికారులు, సిబ్బంది, కార్యాలయాలను పలాసకు తరలించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.
స్టేషన్ అభివృద్ధి ఒకవైపు... తరలింపు మరోవైపు
అముదాలవలస రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించేందుకు కేంద్రం కోట్ల రూపాయలు వెచ్చిస్తూ అభివృద్ధి పనులు చేపడుతోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా స్టేషన్ రూపురేఖలు మారుతున్న సమయంలోనే ఇక్కడి కీలక పరిపాలనా కార్యాలయాలను తరలించే నిర్ణయం ఉద్యోగులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్టేషన్‌ను అభివృద్ధి చేస్తూనే పరిపాలనా వ్యవస్థను ఇతర ప్రాంతానికి తరలించడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్న ఉద్యోగుల్లో వినిపిస్తోంది.
ప్రజాప్రతినిధుల వద్దకు ఉద్యోగులు
ఉత్తర్వులు వెలువడిన వెంటనే కొందరు ఉద్యోగులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్లను కలిసి సమస్యను వివరించినట్లు సమాచారం. ఈ అంశం తన దృష్టికి రాలేదని కేంద్ర మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అముదాలవలస నుంచి కార్యాలయాలను ఎందుకు తరలిస్తున్నారనే విషయాన్ని రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి తెలుసుకుంటానని ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా రైల్వే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఉద్యోగులకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
రిటైర్డ్ ఉద్యోగులకు ఇబ్బందులు
జిల్లాలో వందలాది మంది పదవీ విరమణ పొందిన రైల్వే ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం వారు రైల్వే పాస్‌లు, వైద్య సదుపాయాలు, ఇతర పరిపాలనా సేవల కోసం అముదాలవలస కార్యాలయాన్నే ఆశ్రయి స్తున్నారు. కార్యాలయాలు పలాసకు మారితే ఈ సేవల కోసం అదనపు దూరం ప్రయాణించాల్సి వస్తుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
కార్మిక సంఘాల మౌనం
ఇంత కీలకమైన పరిపాలనా మార్పు జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ రైల్వే కార్మిక సంఘం, ఉద్యోగ సంఘం అధికారికంగా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల సమస్యలపై పోరాడే సంఘాలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కేంద్ర మంత్రి జోక్యంపై ఆశలు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ అంశంలో జోక్యం చేసుకుని రైల్వే బోర్డు, విశాఖ జోన్ అధికారులతో చర్చించి నిర్ణయాన్ని పునఃసమీక్షింపజేస్తారనే ఆశతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు అముదాలవలస రైల్వే పరిపాలనా ప్రాధాన్యాన్ని కాపాడాలని స్థానికులు కూడా కోరుతున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు తర్వాత శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న తొలి ప్రధాన పరిపాలనా మార్పుగా ఈ నిర్ణయం నిలవనుండటంతో, రాబోయే రోజుల్లో దీనిపై రైల్వే శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.






Comments