top of page

యుద్ధం ఛిద్రం చేసింది.. దుబాయ్ దిబ్బయ్యింది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 11 hours ago
  • 3 min read
  • అమెరికా సైనిక శిబిరాలకు భూమి ఇచ్చినందుకు ఫలితం

  • ఇరాన్ దాడుల్లో పర్యాటక, వ్యాపార కేంద్రాలన్నీ నేలమట్టం

  • అభద్రతాభావంతో దేశం వీడిన పెట్టుబడిదారులు

  • ఆర్థిక పునరుద్దీపనకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం

  • ఇంతలోనే మళ్లీ మొదలైన యుద్ధం.. గల్ఫ్‌పై దాడులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఎటుచూసినా తలెత్తుకునేలా చేసే ఆకాశహార్మ్యాలు.. అందుకు తగినట్లే ఆకాశంలో విహరింపజేసే కలల లోగిళ్లు.. అపారమైన ఉద్యోగావకాశాలు.. విలాసవంతమైన జీవితాలు.. విస్తారమైన చమురు క్షేత్రాలు.. అంతకుమించిన వ్యాపార సామ్రాజ్యాలు.. వీటన్నింటికీ చిరునామా ఏదంటే దుబాయ్ అని ఠక్కున సమాధానం వస్తుంది. దోహా, ఖతార్, జెడ్డా, మస్కట్, అబుదాబి వంటి ఇతర UAE దేశాలను కూడా కలల సామ్రాజ్యాలు గానే చెప్పవచ్చు. కానీ వీటిన్నింటిలో దుబాయ్ నెంబర్ వన్‌గా నిలుస్తుంది. ఒకప్పుడు ఇసుక తిన్నెలు, ఎడారి భూములు తప్ప ఏమీ లేని దుబాయ్ స్వయంకృషితో నిర్మించుకున్న కలల సామ్రాజ్యం ఇప్పుడు కళ్లెదుటే కుప్పకూలిపోతున్నది. దీనికి ఇరాన్ దాడులే కారణంగా బయటకు కనిపిస్తున్నా.. పరోక్షంగా అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసేందుకు దుబాయ్ భూభాగాన్ని ఇవ్వడమే పరోక్ష కారణమన్నది బహిరంగ రహస్యం. ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయెల్ దాడులకు దిగడంతో పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు అలుముకున్నాయి. తమపై జరుగుతున్న దాడులకు ప్రతిగా గల్ఫ్‌లో ఉన్న అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దాంతో సైనిక స్థావరాలతోపాటు జనావాసాలు, వ్యాపార సముదాయలు, పర్యాటక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజాగా సీజ్ ఫైర్ ఒప్పందం ముగిసిందంటూ ఇరుదేశాలు మళ్లీ పరస్పరం దాడులు చేసుకుంటుండటంతో గల్ఫ్ మొత్తం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. నాలుగు నెలల యుద్ధానికి సీజ్‌ఫైర్ రూపంలో విరామం లభించడంతో దేశం నుంచి వెళ్లిపోయిన పర్యాటకులు, పెట్టుబడిదారులను తిరిగి రప్పించేందుకు దుబాయ్ ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. ఈ నాలుగు నెలల కాలంలో కోల్పోయిన దానిని త్వరగా పూడ్చుకునేందుకు దుబాయ్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది. ఈ తరుణంలో మళ్లీ దాడులు మొదలుకావడం దుబాయ్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. మార్చిలో యూఏఈ అంతటా ఇరాన్ వరుస దాడులకు పాల్పడింది. ఇవి గల్ఫ్ టూరిజంతో పాటు ఆర్థిక కేంద్రమైన దుబాయ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. భౌతికంగా వాటిల్లిన ఆస్తినష్టం కంటే అక్కడికి వచ్చే వ్యాపారులు, పెట్టుబడిదారుల్లో భద్రతపై విశ్వాసం సన్నగిల్లడం దుబాయ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నది. పశ్చిమాసియాలో ప్రశాంతమైన, సురక్షితమైన ప్రాంతంగా పేరున్న దుబాయ్‌కి ఇది ఊహించని విఘాతం. పరిస్థితి పూర్తిగా చేజారిపోకముందే అప్రమత్తమైన ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. వందలాది మంది వ్యాపార దిగ్గజాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశం నుంచి ఉన్నపళంగా మూలధనం తరలిపోకుండా, బహుళజాతి వ్యాపార సంస్థలు వెళ్లిపోకుండా ఆపేందుకు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. సెంట్రల్ బ్యాంక్ లిక్విడిటీ ప్యాకేజీ సహా పలు ఆర్థిక ఉద్దీపన చర్యలకు బీజం వేశారు. రాబోయే విపత్తును ముందే పసిగట్టి అడ్డుకునే దిశగా అడుగులు వేశారు.

ఆర్థిక ఉద్దీపన చర్యలు

ఇరాన్ దాడుల దెబ్బకు ఎక్కువగా నష్టపోయింది పర్యాటక, రిటైల్ రంగాలే. ఏటా కోట్ల మంది పర్యాటకులతో కళకళలాడే దుబాయ్ వీధులు నాలుగు నెలలకు పైగా వెలవెలబోయాయి. ఈ రంగాలకు తక్షణ ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ఓ భారీ ప్యాకేజీ ప్రకటించింది. సుమారు 2.5 బిలియన్ దిర్హామ్స్.. అంటే సుమారు 681 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఉన్నతాధికారులు సైతం అక్కడి వ్యాపారులకు భరోసా కల్పించారు. సంస్థలకు అవసరమైన ఆర్థికపరమైన మద్దతు కచ్చితంగా లభిస్తుందని హామీ ఇచ్చారు. వస్తువుల సరఫరా చెయిన్‌లో సమస్యలు తలెత్తకుండా రాత్రింబవళ్లు పనిచేసేలా చేశారు. జేపీ మోర్గాన్, సిటీ బ్యాంక్ లాంటి దిగ్గజ ఆర్థిక సంస్థల ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లతో వరుస కాల్స్ నిర్వహించి వారిలో కొత్త ధైర్యం నింపారు. దాడుల భయంతో వెనక్కి వెళ్లిపోయిన పెట్టుబడిదారులను తిరిగి ఆకర్షించేందుకు, ప్రాజెక్టులు ఆగిపోకుండా చూసేందుకు అన్ని రకాల దౌత్యపరమైన, ఆర్థికపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దుబాయ్ ఆర్థిక శాఖ ఈ సంక్షోభ నివారణ కోసం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ స్వయంగా హాజరైన ఈ సమావేశంలో ప్రధానంగా మూడు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పర్యాటకులను తిరిగి దేశానికి ఎలా రప్పించాలి? వెనక్కి వెళ్లిపోతున్న పెట్టుబడిదారులను మళ్లీ ఎలా ఆకర్షించాలి? నష్టాల్లో ఉన్న వ్యాపారాలకు ప్రభుత్వం తరఫున ఎలా మద్దతు ఇవ్వాలి? అనే అంశాలపై వ్యాపారవేత్తల సలహాలు, సూచనలు అడిగారు. క్రౌన్ ప్రిన్స్ స్వయంగా వ్యాపారుల టేబుల్స్ వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా ఇంకా కొంత సమయం పడుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బయట ప్రపంచానికి దుబాయ్ ఎప్పటిలాగే సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు కనిపిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఆర్థిక పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అత్యంత కీలకమైన హోటల్ ఆక్యుపెన్సీ రేటు దారుణంగా పడిపోయింది. ఈ సంక్షోభం కారణంగా దిగ్గజ ఆర్థిక సంస్థలు గల్ఫ్ దేశాల వృద్ధి అంచనాలను తగ్గించేశాయి. 2026 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటులో ఏకంగా ఐదు శాతం మేర కోత విధించారు. ముఖ్యంగా దుబాయ్, అబుదాబిలలో నాన్-ఆయిల్ (చమురేతర రంగాలు) గ్రోత్ రేటు ఏడాదికి ఎనిమిది శాతం మేర పడిపోవచ్చని అంచనా వేశారు. ఆయిల్ మీద ఆధారపడకుండా రియల్ ఎస్టేట్, టూరిజం మీద ఆధారపడిన దుబాయ్ లాంటి నగరానికి ప్రస్తుత సంక్షోభం అతిపెద్ద సవాల్‌గా మారింది.

మళ్లీ ఉరుముతున్న యుద్ధం

ఇలాంటి కష్టకాలంలో దుబాయ్ తన గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. నగరంలోని రోడ్ల వెంబడి కొత్తగా దుబాయ్-ఇట్ అనే ఆకర్షణీయమైన హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. పనులు వేగంగా పూర్తి చేయడం, రాబోయే మంచి రోజులపై భరోసా కల్పించడం ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశం. గల్ఫ్ సంపద, పెట్టుబడిదారులకు అనుకూలమైన పన్ను విధానాలు, సమయపాలన ఎప్పుడూ అంతర్జాతీయ మూలధనాన్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. అయితే యుద్ధ వాతావరణం, తాజా పరిస్థితుల నేపథ్యంలో వాణిజ్య రవాణా మార్గాలు గణనీయంగా మారుతున్నాయి. సాధారణంగా హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించాల్సిన కార్గో నౌకలు, భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ పోర్టులను బైపాస్ చేస్తూ ఓమన్, సౌదీ అరేబియా మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఇది ఆ దేశ నౌకా వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. గల్ఫ్ దేశాల్లో ఏర్పడే ఆర్థిక, భౌగోళిక సంక్షోభాలను ఎదుర్కొని నిలబడటంలో దుబాయ్ ఎప్పుడూ సత్తా చాటుతుంటుంది. కానీ తాజాగా మళ్లీ దాడులు ప్రారంభం కావడం, ఉద్రిక్తతలు పెరిగిన పరిస్థితుల్లో దుబాయ్ ఆర్థిక పునరుజ్జీవ నిర్ణయాలు, చర్యలు మట్టికొట్టుకుపోయినట్లే. తాజా ఉద్రిక్తతలు ఉపశమించి.. మళ్లీ గత వైభవాన్ని సంతరించుకోవడం ఎప్పటికి సాధ్యమవుతుందన్నది ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నే!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page