బధిరుల జై లంబోధరం!
- DV RAMANA

- Sep 2
- 2 min read
జిల్లా సంఘం అధ్యక్షుడి ఆధ్వరంలో గణపతి ఉత్సవాలు
వాట్సప్ గ్రూప్ సభ్యుల సహకారంతోనే కార్యక్రమాలు
ఇదే సమూహం ద్వారా అనేక ఇతర కార్యక్రమాలు
తాము ఎందులోనూ తక్కువ కాదంటున్న దివ్యాంగులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
వైకల్యం శారీరకంగానే కాకుండా మానసికంగానూ కుంగదీస్తుంది. తన పనులను సైతం స్వయంగా చేసుకోలేని దుస్థితిలో ఇతరులపై ఆధారపడటం.. ఆ క్రమంలో ఛీత్కారాలు ఎదురుకావడం వల్ల వికలాంగులు మానసికంగానూ ఒంటరులైపోతారు. ఏమీ చేయలేని నిస్సహాయులమన్న ఆత్మన్యూనతాభావంతో కొట్టుమిట్టాడుతుంటారు. కానీ ఆత్మబలం, గుండె నిబ్బరం ఎంతటి బలహీనులనైనా బాహుబలులుగా మార్చేస్తుంది. వైకల్యం ఓడిపోయి వెన్ను చూపుతుంది. తాము సైతం.. అంటూ అన్నింట్లోనూ ముందడుగు వేయిస్తుంది. నగరంలోని కొందరు బధిరుల విషయంలో అదే జరిగింది. సొంతంగా ఒక చిన్న పూజాకార్యక్రమం కూడా చేయలేనివారు ఏకంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇతర మండపాలకు ధీటుగా ఐదురోజులపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి జై లంబోధరా.. అని నినదించడమే కాకుండా ఔరా.. అని అందరితో అనిపించుకున్నారు. అంతేకాకుండా వ్యక్తులుగా బలహీనులైన వీరు సంఘంగా, సామూహికంగా శక్తిసంపన్నులమని నిరూపించుకుంటున్నారు.
ఎవరికీ తీసిపోని రీతిలో..
వారంతా బధిరులు.. అంటే వారి నోట మాటరాదు, ఇతరుల మాట వినిపించదు. ఇంకో మాటలో చెప్పాలంటే చెవిటి, మూగవారు. వారికో జిల్లా సంఘం ఉంది. జిల్లావ్యాప్తంగా ఉన్న వందలాది మంది బధిరులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఉంగటి సురేష్ ఆధ్వర్యంలో తమ సమస్యలపై పోరాడుతుంటారు. పోరాటమే కాకుండా ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో వినాయక చవితి ఉత్సవాలపై ఆసక్తి పెరిగింది. వినాయక నవరాత్రులు జరపడం చిన్న విషయం కాదు. అయినా ప్రతి ఏటా పోటాపోటీగా ప్రతి వీధిలోనూ మండపాలు పెట్టి నిర్వహిస్తుంటారు. అటువంటి ఉత్సవాలను తామెందకు నిర్వహించలేమన్న పట్టుదల, గణపతిపై భక్తిభావం పొంగిపొర్లింది. అనుకున్నదే తడవుగా సంఘం అధ్యక్షుడు ఉంగటి సురేష్ దానికి గత ఏడాది శ్రీకారం చుట్టారు. పెదపాడు రోడ్డులోని హోండా షోరూం సమీపంలో ఉన్న తన సొంత టీ స్టాల్(అరుణోదయ టీ స్టాల్) పక్కన ఉన్న తన సొంత ఖాళీస్థలంలో వినాయక మండపం పెట్టి సంఘంలోని ఇతర సభ్యుల సహాయ సహకారాలతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అదే ఉత్సాహం, స్ఫూర్తితో ఈ ఏడాది కూడా యథాశక్తి ఉత్సవాలు జరిపించారు.
అంతా సంఘ సభ్యుల సహకారమే
సాధారణంగా గణపతి నవరాత్రులు నిర్వహించేవారు ఇంటింటికీ వెళ్లి చందాలు నిర్ణయించి వసూలు చేస్తుంటారు. అలాగే తమ ప్రాంతాల్లోని సంపన్నులు, ప్రముఖుల నుంచి భారీగా విరాళాలు వసూలు చేసి ఆ సొమ్ముతో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ బధిరుల సంక్షేమ సంఘం అలా కాదు.. వారు తమ సొంత శక్తితోపాటు, సొంత వనరులతోనే రెండేళ్లుగా ఉత్సవాలు జరుపుతున్నారు. డెఫ్ ఫ్రెండ్స్ క్లబ్ పేరుతో మూడేళ్ల క్రితమే ఏర్పాటు చేసిన ఒక వాట్సప్ గ్రూప్‌లో సభ్యులుగా ఉన్న సుమారు 60 మంది సభ్యులు తమలో తామే విరాళాలు వేసుకుని కార్యక్రమాలు నిర్వహించారు. మండపం అలంకరణ, విగ్రహం ఏర్పాటుతోపాటు ఐదురోజులు నిత్యపూజలతోపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఇతర ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తొలిరోజు విగ్రహ ప్రతిష్టాపన అనంతరం మూడోరోజు సామూహిక కుంకుమ పూజలు, దీపారాధన చేశారు. నాలుగోరోజు ముగ్గులు, క్రీడల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఐదోరోజు వైభవంగా నిమజ్జనం జరిపారు. ఆ సందర్భంగా దేవుడి ప్రసాదమైన లడ్డూ వేలం నిర్వహించారు. రూ.6100కు ఉత్సవాల నిర్వాహకుడైన ఉంగటి సురేషే లడ్డూను పాడుకోవడం విశేషం. రెండేళ్లు వరుసగా నిర్వహించిన ఈ ఉత్సవాలు తమలో స్ఫూర్తి, ఉత్సాహం నింపాయని.. వచ్చే ఏడాది కూడా ఉత్సవాలను నిర్వహిస్తామని సురేష్ చెప్పారు.
ఇతర కార్యక్రమాల్లోనూ
డెఫ్ ఫ్రెండ్స్ క్లబ్ పేరుతో ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపు ద్వారా మూడేళ్లుగా పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో తరచూ గెట్ టుగెదర్స్ ఏర్పాటు చేస్తున్నారు. బధిరుల దినోత్సవాలు, సైన్ లాంగ్వేజ్ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ప్రతినెలా మూడో శుక్రవారం కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ‘స్వాభిమాన్’ పేరుతో ప్రత్యేకంగా నిర్వహించే గ్రీవెన్స్‌లో పాల్గొని జిల్లావ్యాప్తంగా బధిరులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంతోపాటు.. వాటి పరిష్కారానికి పోరాటాలు, ఉద్యమాలు కూడా చేస్తున్నారని బధిరుల సంఘానికి సహాయకారిగా ఉంటున్న సామాజిక ఉద్యమకారిణి నర్మజ ‘సత్యం’తో మాట్లాడుతూ చెప్పారు. వీటికి అదనంగా గణపతి నవరాత్రుల నిర్వహణకు పూనుకోవడం ముదావహమని ఆమె అన్నారు.
```````````










Comments