బయో టెర్రర్‌కు తెర లేపారా?
- DV RAMANA

- Nov 11, 2025
- 3 min read
ఢల్లీి కారుబాంబు నిందితుల వద్ద భారీగా రిసిన్ విషం
దీన్ని సహజ జీవాయుధంగా అభివర్ణిస్తున్న నిపుణులు
రంగు, రుచి, వాసన లేని దీన్ని గుర్తించడం దుర్లభం
తెల్లకోట్ల మదిలో సామూహిక మారణకాండ కుట్రలు
`ఉగ్రమూకల చేతిలో భయంకర ఆయుధంతో అనర్థాలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
వారంతా తెల్లకోట్లు వేసుకున్న డాక్టర్లు. రోగులకు చికిత్సలతో ప్రాణాలు పోయాల్సిన వారి మనసుల నిండా నల్ల ఆలోచనలే. దాడులకు తెగబడి, విష ప్రయోగాలు చేసి సామూహిక మారణకాండకు తెగబడి దేశంలో భయానక వాతావరణం సృష్టించాలన్న కుట్రలే. ఈ కుట్రను అమలు చేయకముందే నిఘావర్గాలు, పోలీసులు దాన్ని భగ్నం చేశారు. అయితే తమ కుట్ర భగ్నం అయ్యిందన్న ఆందోళనతో కంగారుపడి కుట్రదారుల్లో ఒకరు కారు బాంబు పేలుడుకు పాల్పడటంతో దేశ రాజధాని ఢల్లీి నగరం వణికిపోయింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోగా అతన్ని కుట్రదారుల్లో ఒకరైన డాక్టర్ ఉమర్ అహ్మద్‌గా గుర్తించారు. కారు బ్లాస్ట్‌ను ఉగ్రదాడిగా ప్రాథమికంగా దర్యాప్తు అధికారులు భావించి ఆ కోణంలో దర్యాప్తు జరిపినా.. ఇది ఆత్మాహుతి దాడి అని నిఘా అధికారులు అనుమానిస్తున్నారు. యావత్తు దేశాన్ని కుదిపేసి 12 ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన వెనుక ఉన్నవారందరూ ప్రాణాలు కాపాడే పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్నవారే కావడం దురదృష్టకరం. ఈ పేలుడు హర్యానాలోని ఫరీదాబాద్, కశ్మీర్‌లోని పుల్వామాల్లో బయటపడిన ఉగ్ర మాడ్యూల్‌కు కొనసాగింపేనని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. రాజస్తాన్‌లో తనఖీల సందర్భంగా పోలీసు అధికారులకు ఒక ఉగ్ర తీగ పట్టుబడిరది. దాన్ని పట్టుకుని లాగితే ఈ డొంకంతా కదిలింది. దాని ఆధారంగా నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్‌లో నలుగురు వైద్యులు పట్టుబడగా, కారు బాంబును పేల్చిన ఆగంతకుడు కూడా డాక్టరేనని నిర్థారణ అయ్యింది. వీరంతా వైద్యం ముసుగులో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ జైష్ ఏ మొహమ్మద్, అన్సార్ ఘజ్వతుల్ హింద్ సంబంధాలు కొనసాగిస్తున్నారని దర్యాప్తు అధికారులు నిర్థారించారు. కుట్రదారుల్లో ఒక మహిళా వైద్యురాలు కూడా ఉన్నారు. వీరి వద్ద 2900 కిలోల పేలుడు పదార్థాలు, రైఫిళ్లు, పిస్టల్స్‌తోపాటు రాజస్తాన్‌లో మొదట పట్టుకున్న డాక్టర్ కారులో పెద్ద పరిమాణంలో ఆముదపు నూనె దొరకడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. నిందితుడిని ఇంటరాగేట్ చేస్తే దాని వెనుక ఉన్న భయంకరమైన కుట్ర బయటపడిరది. అదే రిసిన్ అనే విష పదార్థంతో సామూహిక మారణకాండకు పాల్పడటం అని తేలింది. దేవాలయాల్లో తీర్థ ప్రసాదాలు, తాగునీటి రిజర్వాయర్లు వంటి వాటిలో రిసిన్‌కు కలిపడం ద్వారా తమ కుట్రను అమలు చేయాలన్న ఉగ్రమూకల ప్లాన్.
విరుగుడే లేని రిసిన్
రిసిన్ అనేది చాలా ప్రాణాంతకమైన విషపదార్థం. శరీరంలోకి ప్రవేశించిన కొద్ది గంటల్లోనే ప్రాణాలను హరిస్తుంది. దానివల్ల చికిత్స చేసే అవకాశం కూడా లభించదు. ఉగ్ర మాడ్యూల్‌ను విచ్ఛిన్నం చేయడంతో వెలుగులోకి వచ్చిన రిసిన్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సహజ విషంగా పరిగణిస్తున్నారు. ఇది సైనైడ్ కంటే ఆరువేల రెట్లు అధిక విషపూరితం. కేవలం ఉప్పు గింజంత రిసిన్ (ఔన్స్‌లో రెండు మిలియన్ల వంతు) కూడా ఒక మనిషి ప్రాణం తీయగలదు. ఈ ప్రొటీన్ ఆధారిత విషం, ఆముదం విత్తనాల నుంచి లభిస్తుంది. విత్తనంలో కేవలం ఒకటి నుంచి ఐదు శాతం పరిమాణంలో ఉంటుంది. సాధారణంగా ఆముదపు విత్తనాలను అలంకరణకు, ఆయిల్ తయారీకి ఉపయోగిస్తారు. ఇవే విత్తనాలను పొడి చేసి సెంట్రిఫ్యూజ్ చేస్తే ప్రాణాంతక రిసిన్ తయారవుతుంది. దీన్ని ఇంట్లో కూడా సులభంగా తయారు చేయవచ్చు. అయితే ఈ ప్రక్రియ కూడా చాలా ప్రమాదకరమైనదే. శ్వాస ద్వారా, ఆహారం ద్వారా లేదా ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి వెళితే కణాల్లో సహజంగా జరిగే ప్రొటీన్ల తయారీ ప్రక్రియను అడ్డుకుంటుంది. దీనికి ఎటువంటి రంగు, రుచి, వాసన లేకపోవడం వల్ల రిసిన్ కలిపిన విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా గుర్తించలేడు. శరీరంలో ప్రవేశించిన నాలుగు నుంచి ఆరు గంటల్లో మనిషి శరీరంలో దీని లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, అవయవాలు పనిచేయకపోవడం వంటి పరిణామాలు మొదలై 36 నుంచి 72 గంటల్లో మరణం సంభవిస్తుంది. ఎందుకంటే దీనికి విరుగుడు మందును ఇంతవరకు కనుగొనలేదు. ప్రారంభ లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించి ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీ నోసియా వంటివి అందించడం ద్వారా కొంతవరకు ప్రాణాలు కాపాడవచ్చు. మనదేశంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం`1985 ప్రకారం రిసిన్ తయారీ, రవాణా, ఉపయోగం పూర్తి నిషేధం, చట్టవిరుద్ధం. తయారు చేయడం కూడా సులభమైన దీన్ని ఇది బయోటెర్రర్‌కు చౌకైన ఆయుధమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన దేశంలో ఇదే మొదటిసారి
రిసిన్ పట్టుబడిన ఘటనలు మనదేశంలో గతంలో ఉన్నాయో లేదో గానీ.. రిసిన్‌తో ఉగ్రవాదులు పట్టుబడటం, రిసిన్‌ను తమ విధ్వంసక కుట్రల్లో వినియోగించాలని ప్లాన్ చేయడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. కానీ చరిత్రను తరచి చూస్తే మొదటి ప్రపంచ యుద్ధం కాలం నుంచే రిసిన్ వినియోగం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ ఆముదపు విత్తనాలను సహజ పద్ధతుల్లో ప్రాణాంతక రిసిన్‌గా మార్చే విధానాన్ని తొలుత పీటర్ హెర్మన్ స్టిల్ మార్క్ అనే వ్యక్తి 1888లో కనుగొన్నారు. మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ దీన్ని ఆయుధంగా ఉపయోగించడానికి ప్రయత్నించింది. 1978లో బల్గేరియన్ అసమ్మతి నేత జార్జ్ మార్కోవ్‌కు గొడుగుతో రిసిన్‌ను ఇంజెక్ట్ చేసి హతమార్చారు. 2003లో అమెరికాకు రిసిన్ ఉన్న లేఖలు పంపబడ్డాయి. 2013లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా రిసిన్ కలిపిన లేఖ అందింది. ఢల్లీి, బెంగళూరు, హైదరాబాద్ తదితర పెద్ద నగరాల్లో మంచినీళ్లు, ప్రసాదాల్లో రిసిన్ కలపడం ద్వారా మారణ హోమం సృష్టించాలన్నది ఉగ్రవాదుల పన్నాగం. ప్రస్తుతానికి ఈ భయంకర కుట్ర బయటపడి పెను ప్రమాదం తప్పినా.. భవిష్యత్తులోనూ ఉగ్రవాదులు రిసిన్‌తో బయోకుట్రలకు తెగబడి భారీ ప్రాణనష్టం కలిగించే ప్రమాదం పొంచి ఉంది.










Comments