బలగ రజకులకు అండగా ఉంటాం: గేదెల
- NVS PRASAD
- May 24
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నాలుగు తరాలుగా నాగావళి నదిని, దాని ఒడ్డును నమ్ముకొని జీవనం సాగిస్తున్న బలగ ప్రాంతంలో రజకులకు వైకాపా తరఫున అండగా ఉంటామని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం పేర్కొన్నారు. ఈమేరకు శనివారం బలగ శాంతినగర్ కాలనీ వద్ద ఉన్న దోబీఘాట్‌ను ఆయన నగర పార్టీ అధ్యక్షుడు సాధు వైకుంఠంతో కలిసి పరిశీలించారు. నాలుగు తరాలుగా 80 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయని తెలుసుకున్న అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు వీరి కోసం ప్రత్యేకంగా దోబీఘాట్‌లు నిర్మించారని, దాన్ని అభివృద్ధి చేయాల్సిన కూటమి ప్రభుత్వం కూల్చేసి పార్క్‌ను కడతామనడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పురుషోత్తం తెలిపారు. 1976లోనే ఇక్కడ రజకుల కోసం ఒక నేలబావిని, బండలను ఏర్పాటు చేశారని, నదీ గమనం మారిన తర్వాత నేరుగా నది ఒడ్డునే షెడ్డులు నిర్మించి దోబీఘాట్‌లను ధర్మాన ఏర్పాటు చేయించారన్నారు. ఇప్పుడు వీటిని తొలగించి పార్క్‌ను నిర్మిస్తే ఈ కుటుంబాలు రోడ్డున పడతాయని, అదే జరిగితే వైకాపా రోడ్డెక్కడం ఖాయమని గేదెల పురుషోత్తం హెచ్చరించారు. స్థానికులు ఎమ్మెల్యేను కలిసి వారి అభ్యర్ధన వ్యక్తం చేస్తే సగం భూమిని వదిలేయాలని బేరసారాలకు దిగడం సరికాదని, బలగ, రిమ్స్ ప్రాంతానికి ఉన్న ఏకైక దోబీఘాట్‌ను తొలగిస్తే ఉద్యమిస్తామన్నారు. సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు ఇస్తామని, పాలకులు పార్క్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే రజకుల తరఫున పోరాడతామన్నారు. వీరితో పాటు బాణ్ణ పవన్, బట్ట సీతన్న తదితరులు పాల్గొన్నారు.
Comments