బస్సు టైరు కింద పడి నిండు ప్రాణం బలి
- Prasad Satyam
- Oct 18, 2025
- 2 min read
అంబేద్కర్ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుకింద దూరిపోయిన టూవీలర్
సంఘటన స్థలంలోనే వాహనదారుడు మృతి
ఇది ముమ్మాటికీ ప్రభుత్వం తప్పే
జంక్షన్లను వెడల్పు చేయాలి
జిల్లా ప్రజా సమస్యల వేదిక కన్వీనర్ బీవీ రవిశంకర్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన వంకదార సత్యనారాయణ(63) అక్కడికక్కడే మృతిచెందారు. పీఎస్‌ఎన్‌ఎం స్కూల్ ఎదురుగా రాధాకృష్ణనగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణ శనివారం ఉదయం 7.20 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఆర్ట్స్ కళాశాల రోడ్డు నుంచి అంబేద్కర్ కూడలి రోడ్డు మీదకు తన ద్విచక్ర వాహనం యాక్టివా మీద వచ్చారు. అదే సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న బస్సు ఢీకొనడంతో తల నుజ్జయిపోయి అక్కడికక్కడే మరణించారు. ఆర్ట్స్ కళాశాల రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు మీదకు అంబేద్కర్ సర్కిల్‌ను చుట్టి రావాల్సి ఉండగా, నేరుగా రావడంతో క్రాస్‌లో వస్తున్న బస్సు డ్రైవర్‌కు సత్యనారాయణ కనిపించలేదు. దీంతో బస్సు వెనుక చక్రాల కింద పడి నలిగిపోయాడు. అంబేద్కర్ విగ్రహం ఎత్తు, వెడల్పుగా ఉండటం వల్ల దాని చాటు నుంచి మెయిన్‌రోడ్డు మీదకు వస్తున్న సత్యనారాయణ ఆర్టీసీ టైర్లకు బలైపోయారు. సమాచారం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేవాన్ని రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
సత్యనారాయణకు స్థానిక ఆర్ట్స్ కళాశాల రోడ్డులో వాకర్స్ కోసం ఏర్పాటైన రాగిజావ బళ్ల వద్ద రోజూ అంబలి తాగే అలవాటు ఉంది. ఎప్పటిలాగానే ఇందిరానగర్ కాలనీ ప్రారంభంలో ఉన్న ఆయన ఇంటి నుంచి యాక్టివా వాహనంపై ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు వెళ్లారు. మార్నింగ్‌వాక్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
సత్యనారాయణ భార్య చాలా ఏళ్ల క్రితం మరణించారు. ఇద్దరు కుమారులు వేరుగా ఉంటున్నారు. వృద్ధాప్యంలో తోడు కోసం మొన్నటి పెళ్లి ముహూర్తాల్లో సత్యనారాయణ మరొకామెను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండు నెలలకే సత్యనారాయణ దుర్మరణంపాలయ్యారు. తిరుపతి నుంచి శ్రీకాకుళం కట్టుబట్టలతో వచ్చిన సత్యనారాయణ నెమ్మదిగా వ్యాపారాన్ని ప్రారంభించి ఎదిగారు. ఆయన మొదలుపెట్టిన కన్‌స్ట్రక్షన్ వ్యాపారాలను ఆయన కుమారులు చూస్తున్నారు. వారు వేరుగా ఉండటంతో తోడు కోసం వివాహం చేసుకున్నారు.

ఈ ప్రమాదం కేవలం డ్రైవర్ల తప్పిదం కాదు, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ యంత్రాంగం చేసిన తప్పిదమే. నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ‘ఫ్రీ లెఫ్ట్’ (ఎడమ వైపు మలుపు) కోసం కనీస నిబంధనలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. వాహనచోదకులు ఎడమ వైపునకు తిరగడానికి సరైన ఖాళీ (మార్జిన్) లేకపోవడంతో, వేగంగా వచ్చే ఇతర వాహనాలతో కలిసి ప్రయాణించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఏమరుపాటుగా ఉన్నా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గతంలో కూడా పాలకొండ రోడ్డు వినాయకుని ఆలయం జంక్షన్ వద్ద వాహన నడుపుతున్నా ఒక అమ్మాయి మృతిచెందింది. అలాగే పెద్దపాడు రోడ్డు ట్రాఫిక్ అనుగుణంగా రోడ్లు లేకపోవడం నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజా సమస్యల వేదిక కన్వీనర్ బీవీ రవిశంకర్ కోరారు.
అరసవల్లి జంక్షన్ మినహా, నగరంలోని డై అండ్ నైట్, సరస్వతీ థియేటర్, రామలక్ష్మణ్, ఏడు రోడ్ల జంక్షన్ వంటి ఏ కూడలిలోనూ ఫ్రీ లెఫ్ట్ కోసం పది అడుగులకు మించి మార్జిన్ లేదు. ఇది అత్యంత ప్రమాదకరం. జంక్షన్ల విస్తరణ, ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు గురించి ప్రజా సమస్యల వేదిక ద్వారా గతంలో ఎన్నోసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా, వారిలో ఎలాంటి చలనం లేదని, నాయకులు ఓట్ల రాజకీయాలకే పరిమితమై, ప్రజా ప్రాణాలను గాలికి వదిలేశారని ఆయన అన్నారు. ఈ అశాస్త్రీయ నిర్మాణాల వల్లే నగరంలో పదేపదే ప్రమాదాలు జరుగుతున్నాయని, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వంకదార సత్యనారాయణ మృతికి కారణమైన ఈ సంఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని, నష్టపరిహారం అందించాలని, నగరంలోని అన్ని ప్రధాన జంక్షన్ల వద్ద యుద్ధప్రాతిపదికన ఫ్రీ లెఫ్ట్ మార్జిన్లను ఏర్పాటు చేసి, రోడ్లను విస్తరించాలని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా శాస్త్రీయ పద్ధతిలో చర్యలు చేపట్టాలని, అధికారులు, పాలకులు కళ్లు తెరిచి ప్రజల ప్రాణాలకు విలువ ఇచ్చి తక్షణమే చర్యలు చేపట్టాలని రవిశంకర్ డిమాండ్ చేశారు.










Comments