భూముల స్వాహాపై సామాన్యుడి సమరం
- DV RAMANA
- May 16
- 2 min read
కొండాపురంలో గ్రామ కంఠం, శ్మశానం ఆక్రమణ
రూ.లక్షలకు చేతులు మారుతున్న భూములు
గ్రామస్తులతో కలిసి స్థానికుడి పోరాటం
పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
అతనొక సామాన్యుడు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉపాధి పొందుతూ పొట్టపోసుకుంటున్న అతను స్వగ్రామంలో జరుగుతున్న భూ ఆక్రమణల తంతు గురించి తెలిసి తనకెందుకులే.. అని ఊరుకోకుండా సొంత ఊరి కోసం పోరాటం మొదలుపెట్టాడు. గ్రామస్తులను కూడగట్టి అధికారులకు వినతిపత్రాలు అందించినా ఫలితంగా లేకపోవడంతో.. ఇక లాభం లేదనుకుని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. ఇంతకూ కారణం ఆ యువకుడి స్వగ్రామమైన పాలకొండ మండలం కొండాపురంలో ఏం జరిగిందో చూద్దాం.
పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండకు అనుకుని ఉన్న కొండాపురం గ్రామంలో మెజారిటీ ప్రజలు దళితులు, బీసీ వర్గాలకు చెందినవారే. వీరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని గత కాలంనాటి కరణం, మునసబులకు చెందిన వారసులు గ్రామ కంఠం(సర్వే నెం. 18/2)తో పాటు శ్మశాన భూమి(సర్వే నెం. 20/4)ని ఆక్రమించి తెగనమ్ముకున్నారు. వారి ద్వారా ఈ భూమిని పాలకొండకు చెందిన ఒక విలేకరి, మరో లాయర్ కొనుగోలు చేశారు. గ్రామ ప్రజలు వినియోగించే రెండు రహదారులను కూడా ఆ భూముల్లో కలిపి అమ్మేయడం వల్ల గ్రామస్తులకు రహదారి సౌకర్యం కూడా లేకుండాపోయింది.
ఫిర్యాదులు మూసివేత
వీటిపై కొండాపురానికి చెందిన కరణం మురళీ జనవరి నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం దక్కలేదు. జిల్లా కలెక్టర్, సబ్‌కలెక్టర్, తహసీల్దార్, డీఎల్‌పీవోలకు ఇచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండానే వాటిని పరిష్కరించినట్లు నమోదు చేసి మూసివేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన స్వమిత్వ పథకం ద్వారా ఆక్రమిత భూముల సమస్య పరిష్కరించినట్లు చెబుతున్నారు. అయితే డ్రోన్ల సాయంతో కొలతలు తీసి హద్దులను నిర్ణయించే స్వమిత్వ పథకం ఇళ్లు, భవనాలకు తప్ప ఖాళీ భూములకు వర్తించదన్న విషయాన్ని అధికారులు పట్టించుకోవడంలేదని కరణం మురళీ, ఇతర గ్రామస్తులు విమర్శిస్తున్నారు. మరోవైపు స్వగ్రామంలో భూ ఆక్రమణల గురించి తెలుసుకున్న మురళీ కొన్ని నెలలుగా గ్రామంలోనే ఉంటూ పోరాటం చేస్తున్నారు. గ్రామస్తులందరి సంతకాలతో వినతిపత్రాలు, ఫిర్యాదులు రూపొందించి, ఆక్రమిత భూముల శాటిలైట్ ఫోటోలతో సహా సీసీఎల్‌ఏ తదితర ఉన్నతాధికారులకు పంపారు. అయినా స్పందన లేకపోవడంతో మురళీ ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ఈ నెల 15(గురువారం) నుంచి పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు మద్దతుగా కొండాపురం వాసులు తరలివచ్చి సంఫీుభావం తెలుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే జయకృష్ణ దీక్షా శిబిరాన్ని సందర్శించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. దీక్ష విరమించాలని కోరినా ఆక్రమణలపై నిర్ధిష్ట చర్యలు తీసుకునేవరకు ఆందోళన కొనసాగిస్తామని మురళీ చెప్పారు.
Comments