భారత్‌కు కొత్త సవాల్.. త్రీ బ్రదర్స్!
- DV RAMANA

- May 23, 2025
- 2 min read

ఇప్పటికే ఇటు పాకిస్తాన్, అటు చైనా.. కొత్తగా బంగ్లాదేశ్ నుంచి సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్‌కు ఇప్పుడు త్రీ బ్రదర్స్ అలయన్స్ రూపంలో మరో ప్రమాదకరమైన ముప్పు ఎదురవుతోంది. త్రీ బ్రదర్స్ అంటే పైన పేర్కొన మూడు దేశాలు కాదు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో పాటు ఇటీవలి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు త్రీ బ్రదర్స్ అలయన్స్ పేరుతో జట్టు కట్టాయి. ఆపరేషన్ సింధూరు సమయంలో వీరి సహకార పర్వం బయటపడినా వాస్తవానికి నాలుగేళ్లుగా ఈ మూడు దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయి. 2021లో అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరిగిన సమావేశంలో పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్ అధినేతలు పరస్పర సహకారంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో ‘త్రీ బ్రదర్స్ అలయన్స్’ పేరుతో అనధికార కూటమి ఏర్పాటు చేశారు. ఈ మూడు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు తురుష్క వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. పైగా ఈ మూడూ ముస్లిం జనాభా అధికంగా కలిగిన దేశాలు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ ఈ కూటమి వెనుక ప్రధాన శక్తిగా ఉన్నారు. టర్కీ ప్రభావాన్ని ప్రపంచంలో మరింత విస్తరించడమే లక్ష్యంగా ఆయన ఈ కూటమికి ఊపిరి పోశారు. ఉదాహరణకు 2020 నాగోర్నో-కరబాఖ్ సంఘర్షణలో అజర్‌బైజాన్‌కు టర్కీ సైనిక మద్దతు అందించడం ద్వారా ఆర్మేనియాపై అజర్‌బైజాన్ విజయానికి దోహదపడిరది. అదేవిధంగా 1950 నుంచి టర్కీతో పాకిస్తాన్ సన్నిహిత రక్షణ సంబంధాలను కలిగి ఉంది. ఆ విధంగా క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్లు, ఇతర ముఖ్యమైన సైనిక సాంకేతికతను అందుకుంది. సైనిక సహకారాన్ని ప్రస్ఫుటం చేస్తూ 2021లో ఈ మూడు దేశాలు సైనిక విన్యాసాలు ప్రారంభించాయి. ఈ కూటమి దేశాలు ప్రాదేశిక వివాదాల్లో పరస్పరం మద్దతు ఇచ్చుకుంటాయి. అంటే.. కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ విధానానికి టర్కీ, అజర్‌బైజాన్ మద్దతు ఇస్తాయన్నమాట. అందుకే టర్కీ ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై కశ్మీర్ సమస్యను పదేపదే లేవనెత్తింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్`పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగ్గా అజర్‌బైజాన్, టర్కీ రాజకీయంగా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చాయి. భారతదేశంపై దాడుల్లో టర్కీ అందజేసిన డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించింది. ఇది ఈ కూటమి సైనిక సహకార తీవ్రతను సూచిస్తుంది. ఈ కూటమి విసిరే సవాలును ఎదుర్కోవడానికి భారతదేశం ఇరాన్, ఆర్మేనియాలతో సన్నిహితంగా ఉంటోంది. ఆర్మేనియాకు అజర్‌బైజాన్‌తో దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఇరాన్ కూడా అజర్‌బైజాన్‌తో ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఇరాన్‌లో నివసిస్తున్న లక్షలాది అజారీలు అజర్‌బైజాన్‌తో సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నారు. వీటిని ఉపయోగించుకుని తమ దేశంలో అజర్‌బైజాన్ విభజన ఉద్యమాలను ప్రోత్సహించవచ్చన్నది ఇరాన్ ఆందోళన. మరోవైపు భారతదేశం ఆర్మేనియాకు వెపన్ లొకేటింగ్ రాడార్లు, ఆర్టిలరీ సిస్టమ్స్, రాకెట్ లాంచర్లను విక్రయించింది. గత ఏడాది ఆస్ట్రా మిసైల్స్ కొనుగోలు, ఆర్మేనియా ఎస్‌యు30 ఫైటర్‌జెట్‌లను అప్‌గ్రేడ్ చేయడంపై చర్చలు కూడా జరిగాయి. ఇవి అజర్‌బైజాన్‌ను కలవరపరిచాయి. అదేవిధంగా టర్కీతో ప్రాదేశిక వివాదంలో ఉన్న సైప్రస్‌తో సంబంధాలను భారత్ బలోపేతం చేసి రాజకీయ మద్దతు ఇస్తే సైప్రస్ భారత రాజకీయ ప్రాధాన్యతలకు అండగా నిలిచింది. ఇది టర్కీని అసహనానికి గురిచేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢల్లీిలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఒక టర్కీ విశ్వవిద్యాలయంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే.. భారతీయ పర్యాటకులు టర్కీ, అజర్‌బైజాన్‌లను బహిష్కరించాలని సామాజిక మాధ్యమాల్లో పిలుపునివ్వడంతో పాటు ఆ దేశాలకు వెళ్లేందుకు చేసుకున్న టూర్ ప్యాకేజీలను రద్దు చేసుకుంటున్నారు. త్రీ బ్రదర్స్ అలయన్స్ సవాలును ఎదుర్కోవడానికి భారతదేశం గ్రీస్, సైప్రస్, ఆర్మేనియా, ఇరాన్ వంటి దేశాలతో సన్నిహితంగా వ్యవహరిస్తూ.. సహకారాన్ని కొనసాగించే అవకాశం ఉంది. టర్కీ, అజర్‌బైజాన్‌తో భారతదేశ సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్నాయి కానీ పూర్తిగా శత్రుత్వంగా మారలేదు. అయితే రానున్న కాలంలో ఇవి మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కూటమి పెను సవాలుగా మారకుండా దాని ప్రభావాన్ని తగ్గించడానికి భారతదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.










Comments