భారత్ కేవలం జనసమూహం కారాదు!
- DV RAMANA

- 1 day ago
- 3 min read

‘ఇండియా అంటే దేశం కాదు.. అది కేవలం జనసమూహం మాత్రమే’.. ఈ వ్యాఖ్యలు 1931లో అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్ చేసినవి. మనదేశం బ్రిటీషర్ల పాలనలో మగ్గిపోతూ.. వారి దాస్యశంఖలాల నుంచి విముక్తి కోసం స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న రోజులవి. ఆ క్రమంలో జాత్యాహంకార ధోరణితో, భారత్ పట్ల చిన్నచూపుతో చర్చిల్ చేసిన ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారతీయుల్లో స్వాతంత్య్ర పిపాసను మరింత రగిలించి తీవ్రంగా ఉద్యమించేందుకు దోహదం చేశాయి. కట్ చేస్తే.. దాదాపు శతాబ్దం క్రితంనాటి చర్చిల్ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా ఒక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రతిధ్వనించడం విస్మయం కలిగిస్తోంది. ఎందుకు ఆ వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయా? అన్న ఆలోచన కూడా రేకెత్తిస్తోంది. ఒక కేసులో తీర్పు వెలువరించే క్రమంలో ఒడిశా హైకోర్టు బెంచ్ నాటి వలస పాలకుడి అవమానకర వ్యాఖ్యలను ప్రస్తావించింది. అయితే అప్పటి చర్చిల్ వ్యాఖ్యల వెనుక, ఇప్పటి హైకోర్టు ప్రస్తావన వెనుక ఉన్న ఉద్దేశాలు పూర్తిగా విరుద్ధం. నాడు చర్చిల్ తాము పాలిస్తున్న భారత్‌ను ఒక దేశంగా గుర్తించేందుకు ఇష్టపడలేదు. భిన్న జాతుల, మతాల, సంస్కతుల సమూహంగానే దాన్ని పరిగణిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ధ్వనించాయి. స్వాతంత్య్ర ఉద్యమాన్ని తక్కువ చేసే ప్రయత్నంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. కానీ ఒడిశా హైకోర్టు అవే వ్యాఖ్యలను మన దేశజనాభాకు వర్తింపజేస్తూ రాబోయే ముప్పునకు ముందస్తు హెచ్చరికలా ప్రస్తావించింది. ఒక గ్రామపంచాయతీ సభ్యుడి అర్హత రద్దు కేసులో తీర్పు ఇస్తున్న సందర్భంలో పెరుగుతున్న జనాభా దేశాన్ని ప్రమాదకరమైన దశలోకి తీసుకెళ్తుందన్న గట్టి హెచ్చరిక చేసింది. జనాభా అంటే సంఖ్య మాత్రమే కాదు.. అది దేశ శ్వాస. ఆ శ్వాస అదుపు తప్పితే ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి ఆడకుండా చేస్తుంది. చివరికి ముప్పుగా కూడా పరిణమిస్తుంది. ఈ కఠిన వాస్తవాన్ని గుర్తు చేసేందుకు ఒడిశా హైకోర్టు ఒక అసాధారణమైన అంశాన్ని ఎంచుకుంది. నాటి బ్రిటిష్ పాలకుడి పరుష వ్యాఖ్యలతో పాటు శతాబ్దాల క్రితమే తత్వవేత్తలు చేసిన హెచ్చరికలు, కరోనా వంటి మహమ్మారి రోజుల్లో మనం అనుభవించిన భయానక అనుభవాలు.. అన్నింటినీ ఒకే తీర్పులో ప్రస్తావించింది. జనాభా పేలుడు హైడ్రోజన్ బాంబుకంటే ప్రమాదకరమని బెర్ట్రాండ్ రస్సెల్ చేసిన హెచ్చరికను, మాల్థస్ శతాబ్దాల క్రితమే చెప్పిన అంచనాలను న్యాయస్థానం తన తీర్పులో ప్రస్తావించింది. ఓవైపు వేగంగా అభివృద్ధి చెందుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న దేశం.. మరోవైపు పెరుగుతున్న జనాభా భారం కారణంగా తనకు తానే శత్రువుగా మారుతోందా అన్న ఆలోచనను ఈ తీర్పు బలంగా దేశప్రజల ముందుకు తెచ్చింది. జనాభా పెరుగుదలపై హైకోర్టు ఇంత తీవ్రంగా స్పందించడానికి, జనాభా ముప్పు గురించి గట్టి హెచ్చరికలు చేయడానికి కారణం జనాభా పెరుగుదల కారణమవుతున్న సంతానానికి సంబంధించిందే. అందుకే న్యాయస్థానం పెరుగుతున్న జనాభా ముప్పుపై ప్రభుత్వాలను, ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ తీర్పును ఒక మాధ్యంగా గౌరవ న్యాయస్థానం వినియోగించుకుంది. ఈ కేసు ఒక గ్రామపంచాయతీ సభ్యుడి అర్హత రద్దుకు సంబంధించినది. ఒడిశా గ్రామపంచాయతీ చట్టం ప్రకారం ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రజాప్రతినిధులుగా కొనసాగే అర్హత కోల్పోతారు. ఈ నిబంధనను సవాల్ చేస్తూ ఒక ఛోటా నాయకుడు కోర్టును ఆశ్రయించాడు. కానీ కోర్టు ఈ అంశాన్ని కేవలం చట్టపరమైన సాంకేతికాంశంగా చూడటంతో సరిపెట్టలేదు. దాని వెనుక ఉన్న విస్తత సామాజిక ప్రమాదాన్ని గుర్తించి.. ఒక సందేశంలాంటి తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం.. జనాభా నియంత్రణ అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పెను సమస్య. కరోనా మహమ్మారి సమయంలో దేశం ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను కోర్టు గుర్తు చేసింది. ఆస్పత్రుల్లో బెడ్లు లేని పరిస్థితి, శ్వాస తీసుకునేందుకు ఆక్సిజన్ దొరకని దుస్థితి, రెండు అడుగుల దూరం పాటించాలన్న సూచనలను పాటించడానికి కూడా స్థలం లేక ప్రజలు ఎదుర్కొన్న కష్టాలన్నీ జనాభా పెరుగుదల పర్యవసానాలేనని కోర్టు వ్యాఖ్యానించింది. కేసును విచారించిన జస్టిస్ కృష్ణ శ్రీపాద దీక్షిత్, చిత్తరంజన్‌దాస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తమ తీర్పునకు అంతర్జాతీయ గణాంకాలను కూడా ఆధారంగా తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారత్ జనాభా ఇప్పటికే 143 కోట్లు దాటింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి 170 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కావని.. పెరుగుతున్న ప్రతి కొత్త పౌరుడి ద్వారా నీరు, ఆహారం, వైద్యం, విద్య, ఉపాధి అవకాశాలపై ఒత్తిడి పెంచుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఒడిశా రాష్ట్రం దేశ జనాభాలో సుమారు 3.3 శాతం వాటా కలిగి ఉందంటూ యూఎన్ పాపులేషన్ ఫండ్ నివేదికను ఉటంకించింది. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతో పాటు ఒడిశాను కూడా జనాభా నియంత్రణ విషయంలో ప్రాధాన్య రాష్ట్రంగా గుర్తించిన విషయాన్ని గుర్తుచేసింది. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలవ్వకపోవడానికి జనాభా భారమే కారణమని అభిప్రాయపడింది. జనాభా పెరుగుదల ఆర్థిక సమస్య మాత్రమే కాదని.. ఇది మానవ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తుందని చెప్పింది. పౌరుడికి దక్కాల్సిన వనరులు తగ్గిపోతే వ్యవస్థలో అతని విలువ కూడా తగ్గిపోతుందని పేర్కొంది. జనాభా అడ్డూఅదుపు లేకుండా పెరిగితే విపత్తు తప్పదన్న హెచ్చరికను నేటి పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. జనాభా సమస్యను పట్టించుకోకపోతే అభివృద్ధి అన్న మాట పుస్తకాల్లోనే మిగిలిపోతుంది. నాటి చర్చిల్ మాటలనే నిజం చేసినట్లు అవుతుంది. దేశం ముందుకు వెళ్లాలంటే జనాభాను అదుపు చేస్తూ మనుషుల జీవన నాణ్యతను పెంచాలన్న సందేశమే ఈ తీర్పు సారాంశంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తం కావాలి.










Comments