భారత్ నిశ్శబ్ద ప్రతీకారం!
- DV RAMANA

- Nov 24
- 2 min read

బంగ్లాదేశ్‌తో తలెత్తిన విభేదాలు భారత్‌కు ఆ దేశాన్ని మరింత దూరం చేస్తున్నాయి. పాకిస్తాన్‌లో అంతర్భాగంగా ఉంటూ తీవ్ర వివక్ష, అణచివేతకు గురవుతున్న ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ స్వేచ్ఛ కోసం అర్రులు చాస్తున్న సమయంలో బెంగాలీలు మెజారిటీ సంఖ్యలో ఉన్న తూర్పు పాకిస్తాన్ ఆకాంక్షను సాకారం చేసేందుకు భారత్ చేయూతనిచ్చి.. వారు చేస్తున్న విముక్తి పోరాటంలో సైనికంగా కూడా పాల్గొని పాకిస్తాన్ పీచమణిచి బంగ్లాదేశ్ అవతరణకు బాటలు వేసింది. అలా 1971లో పాకిస్తాన్ కబంధహస్తాల నుంచి బయటపడి స్వతంత్ర దేశమైన బంగ్లా అప్పటి నుంచీ భారత్‌తో కొనసాగిస్తున్న స్నేహ సంబంధాలకు ఏడాది క్రితం తూట్లు పడ్డాయి. అక్కడ జరిగిన తిరుగుబాటు నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవిని కోల్పోయి భారత్‌లో రాజకీయ ఆశ్రయం పొందడం, మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక తటస్థ ప్రభుత్వం భారత్ పట్ల శత్రుభావంతో వ్యవహరిస్తుంచడమే కాకుండా చైనా, పాక్‌లతో అంటకాగుతుండటంతో దశాబ్దాలుగా భారత్`బంగ్లా మధ్య పెనవేసుకున్న సాంస్కృతిక, వాణిజ్య, ఇతర ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తత్ఫలితంగా బంగ్లాదేశ్‌లో భారత్ సాయంతో జరుగుతున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టులు, ఒప్పందాలకు బ్రేకులు పడుతున్నాయి. బంగ్లాలోని యూనిస్ ప్రభుత్వ అనుచిత, వ్యతిరేక వైఖరికి భారత ప్రభుత్వం సైలెంట్‌గా ప్రతీకారం తీర్చుకుంటోంది. ముఖ్యంగా ఆర్థిక, దైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే చర్యలు తీసుకుంటున్నది. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేదిలేదని, ఎవరి కోసమో వెనక్కి తగ్గాల్సిన అవసరం తనకు లేదన్నట్లు భారత్ తన చర్యలతో బలమైన సంకేతాలు ఇస్తోంది. భారత్`బంగ్లా సంబంధాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న తుపాను ముందు ప్రశాంతత వెనుక భారత ప్రభుత్వం ఒక అసాధారణ వ్యూహం అమలు చేస్తోందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బంగ్లాదేశ్ ఆర్థిక పునాదులను కదిలించే అత్యంత తీవ్రమైనదని అభివర్ణిస్తున్నారు. ఈ చర్యలను బంగ్లాపై ప్రతీకార చర్యలుగా భావించరాదు. చికెన్ నెక్, ఇతర సున్నితమైన సరిహద్దు సమస్యలపై యూనస్ ప్రభుత్వం చైనా, పాక్‌లతో మంతనాలు జరుపుతున్న పరిస్థితుల్లో మనదేశ అంతర్గత భద్రత, స్వావలంబన, భవిష్యత్తు అభివృద్ధిని నిర్ధారించే దీర్ఘకాలిక ప్రణాళికగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని బంగ్లా ప్రభుత్వం భారత్ వ్యతిరేక ప్రసంగాలు చేస్తుండటం, చైనా, టర్కీ దేశాలతో సాన్నిహిత్యం పెంచుకోవడం, బంగ్లాదేశ్‌లోని హిందూ ప్రజలు వారి ఆస్తుంలపై హింసాత్మక దాడులకు పాల్పడటం, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం వంటి చర్యలు పాల్పడుతుండటం భారత్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక లాంటివి. బంగ్లాదేశ్ ఇకపై నమ్మదగిన సరిహద్దు దేశం కాదన్న నిర్థారణకు వచ్చిన భారత ప్రభుత్వం మాటలతో కాకుండా నిర్ణయాత్మక చర్యలతో స్పందించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నిర్ణయంలో భాగంగానే రెండు దేశాల స్నేహ సంబంధాలను అనుసంధానిస్తున్న రైలు మార్గాలను, రైల్వే ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా తెంచేయడం ప్రారంభించింది. బంగ్లాదేశ్ ఆర్థిక, వాణిజ్య రంగాలకు వెన్నెముకగా భావిస్తున్న.. భారత సహాయంతో అమలు చేస్తున్న వేల కోట్ల విలువైన పలు ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులను నిలిపివేసింది. ఈ నిర్ణయాలు భవిష్యత్తులో ఆసియా ఖండం పరిధిలో భౌగోళిక రాజకీయాలను మార్చే ఒక దీర్ఘకాలిక దృష్టితో తీసుకున్నవిగా భావిస్తున్నారు. అఖారా - అగర్తల రైల్వే అనుసంధాన మార్గం వీటిలో ఒకటి. 12.24 కి.మీ. పొడవు కలిగిన ఈ ప్రాజెక్ట్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల వారధిలా పనిచేస్తుంది. రూ.3400 కోట్ల పెట్టుబడితో సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌ను భారత్ నిలిపివేసింది. దీనివల్ల బంగ్లాదేశ్ రవాణా చెయిన్ తీవ్రంగా ప్రభావితమవుతుంది. రూప్‌సా - ఖుల్నా మోంగ్లా పోర్ట్ రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన కీలక ప్రాజెక్టు కూడా నిలిచిపోయింది. బంగ్లాదేశ్‌కు చెందిన సముద్ర వాణిజ్యానికి వెన్నెముకగా ఉన్న మోంగ్లా ఓడరేవును అనుసంధానించే ఈ ప్రాజెక్ట్ స్తంభించిపోవడం ఆ దేశానికి పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు. అలాగే రూ.14,100 కోట్ల అంచనాతో భారత్ సహాయంతో ఢాకా - డోనీ - జైదేవ్‌పూర్ రైల్వేమార్గం విస్తరణ పనులు కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. ఇవి కాకుండా మరో ఐదు కొత్త రైల్వే అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధించి సర్వేలు పూర్తయినప్పటికీ ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. మొత్తం మీద బంగ్లాలో చేపడుతున్న ఎనిమిది అతి కీలకమైన రైల్వే ప్రాజెక్టులను భారతదేశం నిలిపివేసింది. మరోవైపు బంగ్లాదేశ్‌పై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకునేందుకు భారతదేశం కొత్త స్వావలంబన వ్యూహాన్ని అనుసరించడం ప్రారంభించింది. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపురలను అనుసంధానించే కొత్త రైల్ మరియు రోడ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. సిక్కిం రాష్ట్రం గుండా భూటాన్, నేపాల్ దేశాల మీదుగా కొత్త రైలు, రోడ్డు ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా ‘చికెన్ నెక్’ (సిలిగురి కారిడార్)పై ఉన్న సైనిక, రవాణా ఒత్తిడిని తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. కొత్త మార్గాలు, భారత భద్రతను బలోపేతం చేసి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ వాణిజ్యం, సైనిక కదలికలను ఎవరూ అడ్డుకోలేరనే దృఢమైన రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సంబంధాలను పూర్తిగా పతనావస్థకు చేర్చుతున్నాయి. భారతదేశం తన ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఇకపై ఎవరి దయాదాక్షిణ్యాల కోసమే ఎదురుచూడదని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.










Comments