భారత్‌పై చైనా వాటర్ బాంబ్!
- DV RAMANA

- Jul 24, 2025
- 3 min read
బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు
హిమాలయ ప్రాంతంలో జీవవైవిధ్యానికి ముప్పు
సరిహద్దు రాష్ట్రాల్లో వరదలు, కరువు సృష్టించే ఆయుధం
ఈశాన్య భారతం, బంగ్లాదేశ్‌లో లక్షలాదిమంది జీవనానికి దెబ్బ
ద్వైపాక్షిక ఒప్పందాలు లేకపోవడంతో ఇష్టారాజ్యం

‘యుద్ధంలో గెలవడమంటే.. ప్రత్యర్థిని చంపడం కాదు’ అని అంటారు. దాన్నే మరోవిధంగా ఆచరణలో చూపిస్తోంది మన పొరుగు దేశం చైనా. యుద్ధమంటే విమానాలతో బాంబులు, క్షిపణులు వేయడం.. శత్రు భూభూగాల్లోకి చొరబడి విధ్వంసం, వినాశనం సృష్టించడం, ఆక్రమించుకోవడం సంప్రదాయ పద్ధతి. కానీ ఇవేవీ చేయకుండానే శత్రువును ప్రమాదం అంచుల్లోకి నెట్టేయడం, అతని వనరులన్నీ నాశనం చేసి కకావికలం చేయడం ఆధునిక యుద్ధరీతి అని చైనా భావిస్తోంది. దాన్నే ఆచరణలో పెడుతోంది. భారత సరిహద్దుల్లో నిరంతరం చొరబాట్లు ప్రోత్సహించి ఉద్రిక్తతలు రేపడం.. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం వంటి భారత రాష్ట్రాల్లోని ప్రాంతాలను పేర్లను మార్చేసి, వాటిని తమ ప్రాంతాలుగా మ్యాపుల్లో చూపించడం, మానవ రహిత ప్రాంతాలు(నో మ్యాన్ ల్యాండ్స్)గా ఇరుదేశాలు గుర్తించి చేసుకున్న ఒప్పందాలను మీరి సైనిక శిబిరాలు ఏర్పాటు వంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం ద్వారా భారత్‌పై అతిప్రమాదకరమైన వాటర్ బాంబ్ ప్రయోగానికి సిద్ధమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్ ప్రాజెక్టును వాటర్ బాంబ్‌గా ఎందుకు అభివర్ణిస్తున్నారు? దానివల్ల జరిగే నష్టం ఏమిటి?? ఒక పరిశీలనాత్మకం కథనం.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
పొరుగునే ఉంటూ నిరంతరం భారత్‌కు పక్కలో బల్లెంలా వ్యవహరిస్తున్న చైనా మరోసారి అటువంటి చర్యలతో ఆందోళనకు గురిచేస్తోంది. తన కుయుక్తులను కొనసాగిస్తోంది. ఎవరూ ఎత్తిచూపలేని విధంగా అప్రకటిత యుద్ధం చేస్తూ భారత సరిహద్దు రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగించే దుశ్చర్యలకు తెరతీసింది. చైనా చర్యలు ఒక్క భారతదేశాన్నే కాకుండా బంగ్లాదేశ్‌కు సైతం తీవ్రం నష్టం కలిగిస్తాయి. హిమాలయాల్లో పుట్టి మూడు దేశాల గుండా ప్రవహిస్తూ కొన్ని లక్షలమందికి జీవనాధారంగా ఉన్న బ్రహ్మపుత్ర నదిపై ఏకపక్షంగా హైడ్రో ఎలక్ట్రిక్(జలవిద్యుత్) ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా పాలకులు తలపెట్టారు. ఈ పనులకు ఇటీవలే అంకురార్పణ కూడా చేసేశారు. ఇదే ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్‌లకు ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ ప్రాజెక్టును భారత్‌పై చైనా ప్రయోగిస్తున్న వాటర్ బాంబ్‌గా అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండూ అభివర్ణించారంటేనే.. ఈశ్యాన్య భారతంలోని చైనా సరిహద్దు రాష్ట్రాలపై అది ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించడం భారత్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టడమేనని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ఏఎస్‌పీ) కూడా హెచ్చరించింది. ఈ సూపర్ డ్యామ్ భారత్‌కు అన్ని విధాల ముప్పుగా పరిణమిస్తుందని పేర్కొంది. ఆ నది భారత్‌లోకి ప్రవేశించే ముందు వంపు తిరిగి 300 మీటర్ల దిగువన ఉన్న లోయ వంటి ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. సరిగ్గా అదే ప్రదేశంలో చైనా వ్యూహాత్మకంగా ఈ సూపర్ డామ్‌ను నిర్మిస్తోంది. దీనివల్ల నిర్మిస్తే ఖర్చు తగ్గడమే కాకుండా వ్యూహాత్మకంగా పొరుగు దేశాలను కష్టాల్లోకి నెట్టవచ్చన్నది చైనా కుటిల యోచన.
ఒప్పందం మాటేమిటి?
చైనా ఆధిపత్యం కింద ఉన్న టిబెట్ పరిధిలోని హిమాలయ సానువుల్లో హిమానినదం నుంచి ఐదువేల మీటర్ల ఎత్తున పుట్టిన బ్రహ్మపుత్ర నది అక్కడి నుంచి భారత్, బంగ్లాదేశ్ మీదుగా 2900 కి.మీ. దూరం ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. చైనాలో దీన్ని యార్లాంగ్ సాంగ్పో నదిగా, భారత్‌లో బ్రహ్మపుత్రగా, బంగ్లాదేశ్‌లో జమునా నది పేరుతో ప్రాచుర్యం పొందింది. ఈ నదీజలాల వినియోగంపై తొలిసారి భారత్, చైనా మధ్య ఒప్పందం కుదిరింది. 2008, 2013, 2018లలో దాన్ని పునరుద్ధరించారు. చివరిసారిగా చేసుకున్న ఒప్పందం కాలపరిమితి 2023లో ముగిసింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల వల్ల ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. దాంతో ఎగువ దేశం హోదాలో చైనా దిగువ దేశాలైన భారత్, బంగ్లాదేశ్‌లతో సంప్రదించకుండానే బ్రహ్మపుత్రపై ఏకపక్షంగా ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. సుమారు 1.2 ట్రిలియన్ యువాన్లు అంటే.. భారత కరెన్సీలో రూ.14.50 లక్షల కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఐదు జలవిద్యుత్ కేంద్రాలు నిర్మిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టు గతంలో చైనాలోనే యాంగ్ త్సే నదిపై రికార్డు స్థాయిలో నిర్మించిన త్రీగోర్జెస్ డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ కంటే మూడురెట్లు అధిక విద్యుత్‌ను బ్రహ్మపుత్ర సూపర్ డ్యామ్ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేస్తారు. దీని ద్వారా 300 బిలియన్ కిలోవాట్ల (60 గిగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి కానుంది. 2060 నాటికి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలన్న లక్ష్యాన్ని సాధించే రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో దీన్నో భాగంగా చైనా తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా టిబెట్ స్వయంపాలిత ప్రాంతానికి మూడు బిలియన్ డాలర్ల వార్షికాదాయం సంపాదించిపెట్టడం కూడా చైనా మరో లక్ష్యం.
భూకంపాలకు ఆస్కారం
ఈ ప్రాజెక్టు ద్వారా ఏ లక్ష్యాలను చైనా సాధించాలనుకుంటుందన్నది పక్కన పెడితే.. దీని వల్ల భౌగోళికంగా, వ్యవసాయకంగా, జీవవైవిధ్యపరంగా వాటిల్లే నష్టాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల నదీపరివాహక దేశాలైన భారత్, బంగ్లాదేశ్‌తోపాటు ప్రాజెక్టు నిర్మిస్తున్న టిబెట్‌కు కూడా పెను నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతమైన టిబెట్ పీఠభూమి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉంది. హిమవత్పర్వత ప్రాంతాలన్నీ సిస్మిక్ జోన్‌లో ఉన్నాయన్నది ఎప్పుడో నిపుణులు తేల్చిన విషయం. అంటే ఈ జోన్‌లో భూమి పొరల్లో ఉంటే టెక్టానిక్ ప్లేట్లు తరచూ కదలికలకు గురవుతుండటం వల్ల భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. వీటి ప్రభావంతో హిమాలయాల్లో పుట్టి ప్రవహించే హిమాని నదాలు, బ్రహ్మపుత్ర, సింధూ లాంటి నదుల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉంటుంది. అలాంటి చోట అతిభారీ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తే ఆ ప్రభావం భూమిపై చాలా తీవ్రంగా ఉండి పెను విధ్వంసం జరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్లే టిబెట్ ప్రజలు కూడా ఈ హైడ్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.
వరదలు సృష్టించే అవకాశం
ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌లో ఆకస్మిక వరదలు, అలాగే అనావృష్టి పరిస్థితులు సృష్టించే అవకాశం చైనాకు లభిస్తుంది. భారత సరిహద్దుకు కేవలం 30 కి.మీ దూరంలోనే నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా దిగువకు నీటిని నిలిపివేస్తే మన దేశంలోని అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర నీటికొరత ఏర్పడుతుంది. దానివల్ల తాగునీటి ఇబ్బందులతోపాటు వ్యవసాయం కూడా కష్టాల్లో పడుతుంది. మరోవైపు వర్షాకాలంలో నది వరద నీటితో ఉప్పొంగుతుంది. అలాంటి సమయాల్లో ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఈ డ్యామ్ నుంచి ప నీటిని దిగువకు వదిలేస్తే అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం లాంటి భారత రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌లో కూడా జల ప్రళయం సంభవిస్తుంది. ప్రస్తుతం బ్రహ్మపుత్ర నదికి సంబంధించి ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందం అమల్లో లేనందున వరద నీటి విడుదల వంటి సమాచార మార్పిడి జరగదు. అధిక నీటిని విడుదల చేస్తున్నట్లు ఎందుకు చెప్పలేదని చైనాను అడిగే హక్కు మనదేశానికి ఉండదు. అలాగే చైనా దుష్ట పన్నాగాలను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టే అవకాశం కూడా భారత్‌కు ఉండదు.
మరెన్నో నష్టాలు
హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న డ్యాములు ఎగువ నుంచి వచ్చే మట్టి దిగువకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. దాంతో దిగువ పరీవాహక ప్రాంతాల్లోని భూములు కొంతకాలానికి నిస్సారంగా మారి వ్యవసాయ దిగుబడులను దెబ్బతీస్తాయి.
అద్భుతమైన పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఉన్న హిమాలయన్ రీజియన్‌లో అవన్నీ దెబ్బతింటాయి. పరీవాహక ప్రాంతాల్లో అడవుల నాశనం, భూమి కోత, వాతావరణ మార్పులు వంటి అనర్థాలు పెరుగుతాయి.
డెల్టా ప్రాంతాల్లో నదీ ప్రవాహం ఒక క్రమపద్ధతి లేకుండా పెరిగి సముద్ర మట్టాన్ని దాటే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.










Comments