top of page

భారత్‌పై యూనస్‌ కోపం.. బంగ్లాకు శాపం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 2 min read

ree

మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు అక్కడి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ ఉరిశిక్ష విధించడంపై ఒకవైపు బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగి దేశం అగ్నికాష్ఠంలా రగులుతుంటే.. అదేమీ పట్టని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్‌ యూనస్‌ తన సొంత అజెండాను అమలు చేస్తున్నారు. దేశం అవతరించినప్పటినుంచీ భారత్‌తో పటిష్టంగా కొనసాగిస్తున్న స్నూహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలకు తూట్లు పొడిచి చైనా అనుకూల విధానాలు అవలంభిస్తున్నారు. 2024లో యువజనుల రిజర్వేషన్‌ ఉద్యమం కాస్త ప్రభుత్వంపై తిరుగుబాటుగా మారడంతో అప్పటి ప్రభుత్వాధినేత, ప్రధానమంత్రి షేక్‌హసీనా పదవిని, దేశాన్ని వీడి వెళ్లిపోయారు. ఫలితంగా నోబెల్‌ అవార్డు గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ను ఏరికోరి తీసుకొచ్చి ఆయన నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచీ భారత్‌లో శరణార్థిగా ఉన్న హసీనాను తమ దేశానికి అప్పగించాలని కోర్టు తీర్పు నేపథ్యంలో యూనస్‌ ప్రభుత్వం భారత్‌ను కోరింది. దానికి సానుకూల స్పందన రాకపోవడం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ సాకుతో యూనస్‌ సర్కారు భారత్‌ శత్రువులైన పాకిస్తాన్‌, చైనా దేశాలకు మరింత దగ్గరవుతోంది. ఈ పరిస్థితిని ‘రెండో స్వాతంత్య్రం’గా అభివర్ణిస్తోంది. యూనస్‌ తన బీజింగ్‌ పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్‌ను ‘చైనా ఆర్థిక వ్యవస్థకు పొడిగింపు’ (ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ చైనీస్‌ ఎకానమీ)గా అభివర్ణించడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలతోపాటు నేపాల్‌ భూటాన్‌లకు బంగ్లాదేశ్‌ ఒక సముద్ర ద్వారంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఆ బాధ్యతను చైనాకు అప్పగిస్తే.. అది భారతదేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది. ముఖ్యంగా తీస్తా నది నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా ప్రమేయం భారత్‌కు రెడ్‌ లైన్‌ లాంటిదే. ఈ ప్రాజెక్టు సిలిగురి కారిడార్‌ (చికెన్‌ నెక్‌)కు అతి సమీపంలో ఉంది. ఇక్కడ చైనా ఇంజనీర్లు డ్రెడ్జింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తే యుద్ధ సమయాల్లో భారతదేశ రవాణా వ్యవస్థకు ముప్పు కలిగించవచ్చని భారత రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. హసీనా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో భారత్‌, చైనాల మధ్య సమతుల్యత పాటించగా ప్రస్తుత యూనస్‌ ప్రభుత్వం చైనా వైపు మొగ్గు చూపుతోంది. 1971 యుద్ధం తర్వాత దశాబ్దాలుగా పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్‌ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ యూనస్‌ ప్రభుత్వం ఈ చరిత్రను పక్కనబెట్టి ఇస్లామాబాద్‌తో సంబంధాలను పునరుద్ధరిస్తోంది. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌కు బంగ్లాదేశ్‌ మ్యాప్‌తో కూడిన కళాఖండాన్ని యూనస్‌ బహుమతిగా ఇవ్వడం, అందులో భారతీయ భూభాగాలు ఉన్నాయనే అనుమానాలు రావడం తీవ్ర దుమారం రేపింది. దౌత్యపరమైన మార్గాల ద్వారా కాకుండా, రక్షణ ఇంటెలిజెన్స్‌ సహకారం పెంచుకోవడం భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాదేశ్‌లో మళ్లీ స్థానం కల్పించే ప్రమాదాన్ని సూచిస్తోంది. హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల పరిస్థితిపై ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిరసనల ముసుగులో హిందువుల ఇళ్లు, ఆలయాలపై దాడులు జరిగినట్లు అనేక నివేదికలు పేర్కొన్నా యూనస్‌ ప్రభుత్వం వాటిని ‘భారతీయ మీడియా సృష్టి’గా అభివర్ణిస్తూ కొట్టిపారేస్తోంది. యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కొన్ని నెలల్లోనే బంగ్లాదేశ్‌ దిశను పూర్తిగా మార్చేసింది. భారతదేశంతో ఉన్న చారిత్రక ఆర్థిక బంధాలను తెంచుకుని కొత్త మిత్రుల వెంట పడుతోంది. అయితే దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇంధన సంక్షోభం, నిత్యావసరాల ధరల పెరుగుదల, పెట్టుబడుల నిలిపివేత వంటి రూపాల్లో ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోంది. హసీనా హయాంలో భారత్‌తో కుదిరిన ఒప్పందాలను యూనస్‌ సర్కారు అనుమానంతో చూస్తోంది. భారత్‌ నుంచి కరెంట్‌ సరఫరా చేసే అదానీ పవర్‌ కంపెనీతో గొడవ పెట్టుకుంది. బంగ్లా ప్రభుత్వం అదానీ కంపెనీకి భారీగా విద్యుత్‌ బిల్లులు బాకీ పడిరది. ఈ నెలారంభం నాటికి ఈ బకాయిలు 500 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 4,100 కోట్లు) వరకు ఉన్నాయి. బకాయిలు చెల్లించకపోతే నవంబర్‌ 11 నుంచి కరెంట్‌ నిలిపేస్తామని ఆ సంస్థ హెచ్చరించడంతో చివరి నిమిషంలో కొంత డబ్బు చెల్లించి సరఫరా నిలిపివేతను బంగ్లాదేశ్‌ ఆపగలిగింది. హసీనా హయాంలో జరిగిన ఈ విద్యుత్‌ ఒప్పందాలపై విచారణ జరపాలని యూనస్‌ సర్కారు నిర్ణయించడం దీని పర్యవసానమే. రాజకీయ విభేదాలు, ఉద్యమాలు, అల్లర్ల ప్రభావం సామాన్యులపై పడిరది. దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం 11 శాతం దాటేసింది. బియ్యం, కూరగాయలు, నూనెల ధరలు అందనంత ఎత్తుకు చేరాయి. భారత్‌ నుంచి సరుకుల దిగుమతులు తగ్గిపోవడమే దీనికి కారణం. మరోవైపు గత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నారనే కారణంతో దేశంలోని పెద్ద వ్యాపార సంస్థలను యూనస్‌ సర్కారు టార్గెట్‌ చేసింది. ఎస్‌ ఆలం, బెక్సిమ్కో వంటి బడా కంపెనీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. వీరి ఆస్తులను జప్తు చేశారు. దీనివల్ల బ్యాంకుల్లో డబ్బుల కొరత ఏర్పడిరది. కొత్తగా అప్పులు పుట్టడం లేదు. ఈ పరిణామాలు పెట్టుబడిదారులను భయపెడుతున్నాయి. దాంతో అక్కడ ఉన్న భారతీయ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. వీసా కేంద్రాలు సరిగా పనిచేయడం లేదు. దీంతో భారతీయ ఉద్యోగులు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. వస్త్ర పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు భారత్‌ నుంచి వెళ్లడం లేదు. దీనివల్ల గార్మెంట్‌ పరిశ్రమ సంక్షోభంలో పడిరది. పొరుగు దేశంతో గొడవలు సామాన్యుడి కడుపు కొడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యూనస్‌ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగడం బంగ్లా భవిష్యత్తుకు ప్రమాదమే!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page