భారత్‌పై సుంకాలు.. నాటో చీఫ్ వాచాలత!
- DV RAMANA

- Jul 18, 2025
- 2 min read

సర్వసత్తాక సార్వభౌమాధికార దేశాన్ని ఎటువంటి అధికారాలు, అర్హతలు లేని ఒక అధికారి సుంకాల సుత్తితో మోదుతానని, ఆర్థిక ఆంక్షలు విధిస్తానని హెచ్చరించడాన్ని మితిమీరిన అహంకారం గానే పరిగణించాల్సి ఉంటుంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్‌పై అక్కసుతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వత్తాసో లేక ధనిక దేశాల కూటమికి అధిపతినన్న మిడిసిపాటుతోనో గానీ నార్త్ అట్లాంటిక్ ట్రియటీ ఆర్గనైజేషన్ (నాటో) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే రెచ్చిపోయారు. రష్యాతో ముడిచమురు కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకోకపోతే భారత్‌పై వంద శాతం సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తూ అన్ని దేశాలతో మైత్రి కొనసాగిస్తున్న అతిపెద్ద ప్రజా స్వామ్య దేశమైన భారత్‌ను ఈ విధంగా హెచ్చరించడం విస్మయం కలిగిస్తోంది. కొన్ని దేశాలకే పరిమిత మైన ఒక సైనిక కూటమికి ఒక సార్వభౌమ, గణతంత్ర దేశాన్ని హెచ్చరించే ధైర్యం అయనకు ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న వినిపిస్తోంది. నాటో సభ్య దేశాలతో భారత దౌత్య సంబంధాలు దెబ్బతీసేంత దుస్సాహసానికి నాటో చీఫ్ తెగించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. భారత వాణిజ్య విధానాలను ప్రశ్నించే అధికారం నాటోకు గానీ, దానికి చీఫ్‌కు గానీ అస్సలు లేదని అంతర్జాతీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తర అట్లాంటిక్ ఖండంలోని కొన్ని దేశాల సైనిక కూటమి మాత్రమే అయిన ఈ సంస్థకు అంతర్జాతీయ వాణిజ్య సమీక్ష అధికారం కూడా లేదని అంటున్నారు. సార్వభౌమాధికార, స్వతంత్ర దేశంగా తాను ఎవరితో వాణిజ్య చేయాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ, హక్కు భారత్‌కు ఉంది. ఇందులో వేలు పెట్టే అర్హత నాటోతో సహా ఎవరికీ ఉండదు. కానీ నాటో తన పరిధి దాటి ప్రవర్తిస్తోం దన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ విధానాలకు నాటో తలొగ్గిందనేది బహిరంగ రహస్యం. మరోవైపు చైనా, భారత్ సారథ్యంలో పటిష్టమవుతున్న బ్రిక్స్ కూటమి అంతర్జాతీయ మారక మైన డాలర్ ఆధిపత్యానికి గండికొట్టి ప్రత్యామ్నాయ కరెన్సీని ముందుకు తేవొచ్చనే భయాందోళనలు అమెరికాను వెంటాడుతున్నాయి. అందుకే నాటోతో హెచ్చరికలు చేయిస్తోందని భావిస్తున్నారు. అంత ర్జాతీయ వాణిజ్య విభేదాలు తలెత్తితే పరిష్కరించేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఉండనే ఉంది. ఇప్పుడు దాని విధుల్లోకి నాటో తలదూర్చడం ఏమిటన్న విమర్శలు మొదలయ్యాయి. శాంతి కాముక దేశంగా పేరొందిన భారత్‌కు ఉక్రెయిన్`రష్యా యుద్ధం విషయంలో నాటో వంటి సైనిక కూటమి నుంచి శాంతి ప్రభోదాలు వినాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ దౌత్య నిపుణులు చెబు తున్నారు. ఏ దేశమైనా తమ ఇంధన అవసరాలకు తగ్గట్లు విదేశాంగ, వాణిజ్య విధానాలు అవలం భిస్తుంది. అటువంటప్పుడు రష్యా లేదా ఫలానా దేశం నుంచి ముడిచమురు, సహజవాయువు కొనడా నికి వీల్లేదని భారత్‌తో సహా ఏ దేశాన్నయినా అడ్డుచెప్పే అధికారం నాటోకు లేదు. మరి నాటో చీఫ్ ఇలా ఎందుకు చేశారన్న ప్రశ్నకు నాటో సభ్య దేశాల నుంచి సమాధానం లేదు. రష్యా, అమెరికా సహా పశ్చిమాసియా, ఆఫ్రికా వరకు వేర్వేరు ఖండాల్లోని దేశాల నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. భారత ఇంధన భద్రత విషయంలో వేలుపెట్టే అధికారం ఏ దేశానికీ లేదు. భారత్ గనక నాటో హెచ్చరికలను సీరియస్‌గా తీసుకుంటే ఆ కూటమి సభ్య దేశాలతో, అలాగే అమెరికాతో దౌత్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇవేవీ ఆలోచించకుండా అమెరికా ప్రయోజనాలను కాపాడే డమ్మీ వాణిజ్య విభాగం స్థాయికి నాటో పడిపోయింది. పలు యూరోపియన్ దేశాలు కూడా ఇప్పటికీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నప్పటికీ, వాటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై భారత్ ఇంకా పూర్తిస్థాయిలో స్పందించనప్పటికీ.. భారత అంతర్గత వ్యవహారాల్లో నాటో చీఫ్ జోక్యం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. నాటో ఏ విధంగా భారత్‌పై ఆంక్షలు, సుంకాలు విధిస్తుందని ప్రశ్నిస్తూ.. దానికి ఆస్కారమే లేదంటన్నారు. రష్యాతో చమురు బంధం రద్దు చేసుకోకపోతే భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇది జరిగిన రెండు రోజులకే నాటో సెక్రటరీ జనరల్ వంద శాతం సుంకాలు అంటూ రెచ్చిపోయారు. దీన్ని భారత్ తీవ్రంగా పరిగణించాలని పలువురు సూచిస్తున్నారు.










Comments