భారత సైన్యానికి ‘భైరవ’ కవచం
- DV RAMANA

- 9 hours ago
- 2 min read
మన పదాతిదళంలో కొత్త బెటాలియన్లు
ఆరు నెలల్లో 25 యూనిట్ల ఏర్పాటకు చర్యలు
డికేడ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో భాగంగా సైన్యం ఆధునికీకరణ
త్వరలో రుద్ర, శక్తిబాణ్, దివ్యాస్త్ర దళాల ఏర్పాటు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
పహల్గాం ఉగ్రదాడి.. తదనంతరం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మనదేశ రక్షణ విధానాల్లో కేంద్ర ప్రభుత్వ అనేక సంస్కరణలు చేపడుతోంది. మన త్రివిధ దళాలకు ఆధునిక ఆయుధ సంపత్తి సమకూర్చడంతోపాటు వ్యూహాత్మకంగా సరికొత్త మానవ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా పదాతిదళం(ఆర్మీ)లో ఉన్న ఒకానొక గ్యాప్‌ను పూరించడానికి భైరవ్ బెటాలియన్లను సిద్ధం చేస్తోంది. రక్షణ రంగానికి సంబంధించి ఆయుధ సంపత్తి, సాంకేతికత విషయంలో నిన్నమొన్నటి వరకు ఇతర దేశాలపై ఆధారపడేది. కానీ ఇటీవలి కాలంలో నూతన ఆవిష్కరణలు, ఇతరత్రా చర్యలతో స్వయం సమృద్ధి సాధిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన త్రివిధ దళాలు ప్రదర్శించిన ఆయుధ పటుత్వాన్ని, వ్యూహ నిపుణతను చూసి అభివృద్ధి చెందిన దేశాలు సైతం అచ్చెరవొందాయి. బ్రహ్మోస్ వంటి భారతీయ క్షిపణి వ్యవస్థల కోసం భారత్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మరోవైపు సైన్యంలో కొత్త బెటాలియన్స్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో భైరవ్ పేరుతో కొత్త బెటాలియన్లకు సంబంధించి కొన్ని వివరాలు బయటకొచ్చాయి. ఆర్మీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్‌కుమార్ వెల్లడిరచిన వివరాల ప్రకారం సంప్రదాయ పదాతిదళం, ప్రత్యేక దళాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా సైన్యంలో ‘భైరవ్’ బెటాలియన్లను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటైన భైరవ్ బటాలియన్లను తేలికపాటి కమాండో బలగాలుగా సైనిక ఉన్నతాధికారులు అభివర్ణిస్తున్నారు. ఒక్కో యూనిట్‌లో సుమారు 250 మంది సైనికులు ఉంటారు. ఇవి సాధారణ ఇన్‌ఫాంట్రీ దళాల కంటే చిన్నవిగా.. స్పెషల్ ఫోర్స్‌ల కంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి. అవసర సమయాల్లో వేగంగా స్పందించటం, ఆకస్మిక దాడులు చేయటం, టెక్నాలజీని ఉపయోగించి శత్రువును అణచివేయటం ఈ బలగాల ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. సైన్యంలో ఇప్పటికే ఐదు భైరవ్ బటాలియన్లను ఏర్పాటు చేశారు. ఒక బెటాలియన్‌కు నెలరోజులపాటు కఠిన శిక్షణ కూడా ఇచ్చారు. అవి పూర్తిస్థాయి విధుల్లో చేరాయి. వచ్చే ఆరునెలల్లో మరో 20 బటాలియన్లు సిద్ధమవుతాయని చెబుతున్నారు.
ఈ బలగాల ప్రత్యేకత ఏంటి?
ఈ బలగాలు కొత్త రకం తేలికపాటి ఆయుధాలు, డ్రోన్లు, సర్వేలెన్స్ పరికరాలతో నిరంతరం సంసిద్ధంగా ఉంటాయి. అత్యంత క్లిష్టమైన పర్వతాలు, అడవులు, సరిహద్దు ప్రాంతాల్లో కూడా భైరవ్ ప్రతినిధులు స్వతంత్రంగా పనిచేయగలరు. ఈ బెటాలియన్లకు గగనతల రక్షణ కోసం యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైళ్లు, లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల ఆర్టిలరీ సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రతి యూనిట్‌లో ఉండే 250 మంది సైనికులకు ఏడెనిమిది మంది అధికారులు నేతృత్వం వహిస్తారు. భైరవులకు మొదట రెండు మూడు నెలలు రీజిమెంటల్ సెంటర్లలో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత స్పెషల్ ఫోర్స్‌లతో కలిసి ఒక నెల ఇంటెన్సివ్ శిక్షణ ఉంటుంది. శత్రువుల కదలికలను గమనించడం, ఆకస్మిక దాడులు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రత, తక్షణ స్పందన అవసరమైన పరిస్థితుల్లో సహాయం చేయటం వంటి అంశాలు వీరి శిక్షణలో ఉంటాయి. వీటివల్ల సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ దిశగా త్వరగా ప్రతిస్పందించగల సామర్థ్యం పెరుగుతుంది. సైన్యంలో జరుగుతున్న డెకేడ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (దశాబ్ద మార్పు) ప్రణాళికలో భాగంగా వీటిని రూపొందించారు. ఇవే కాకుండా రుద్రా బ్రిగేడ్, శక్తిబాణ్, దివ్యాస్త్ర వంటి కొత్త యూనిట్లు కూడా త్వరలో సైన్యంలో చేరనున్నాయి. ఈ విషయాలపై ఆర్మీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ వివరిస్తూ సంఖ్యాపరంగా భైరవ్ యూనిట్స్ చిన్నగా ఉన్నప్పటికీ చాలా శక్తిమంతమని అభివర్ణించారు. సాధారణ పదాతిదళ బెటాలియన్లు చేపట్టలేని, ప్రత్యేక బలగాల అవసరం లేని ఆపరేషన్లను భైరవ్ యూనిట్లు చేపడతాయని అంటున్నారు. అంటే ఒకవిధంగా ఆ రెండు దళాల మధ్య గ్యాప్‌ను భైరవ్ దళాలు భర్తీ చేస్తాయని ఆయన చెప్పారు. భారత సైన్యం తన పదాతిదళ బెటాలియన్లలో అష్ని ప్లాటూన్లను కూడా ఏర్పాటు చేస్తోందని చెప్పారు. డ్రోన్ కార్యకలాపాల్లో ఇవి సహాయపడతాయన్నారు. 380 ఏ.ఎస్.ఎన్.ఐ. ప్లాటూన్లు ఇప్పటికే పనిచేస్తున్నందున భారత సైన్యం తన డ్రోన్ యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉందని వెల్లడిరచారు. అష్ని ప్లాటూన్ల ఏర్పాటుతో పాటు భారత సైన్యం తన ఫిరంగి దళాన్ని కూడా ఆధునికీకరిస్తోందని ఆయన వెల్లడిరచారు.










Comments