భాషలకు తల్లి మూలద్రవిడం
- DV RAMANA

- Jun 6, 2025
- 2 min read

ద్రావిడ భాషలన్నిటి మూల భాష ‘‘ మూలద్రావిడం’’. అందులో మూడు ఉపకుటుంబాలు. దక్షిణ మూలద్రావిడ ఉపకుటుంబం నుంచి తమిళం, కన్నడ తదితర భాషలు పుట్టాయి. ఒక ఉపకుటుంబంలో ఆ రెండు సోదరభాషలు. అంతే తప్ప, తమిళం నుంచి కన్నడ పుట్టింది అనడం తప్పు. యథాలాపంగానో, సుహృద్భావం నుంచో కమల్‌హాసన్ అటువంటి వ్యాఖ్య చేసుండవచ్చు. కానీ, రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాల దగ్గర నుంచి అనేక ఉద్రిక్తతలు ఉన్నప్పుడు కమల్ బాధ్యతగా మాట్లాడాల్సింది. ఆధునిక భాషాశాస్త్రం ప్రకారం మూల ద్రావిడ భాష (ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్) నుంచి పుట్టుకొచ్చాయి (పరిణమించాయి) దక్షిణాది భాషలు. వాటిలో తమిళ్, మలయాళం సోదరభాషలు కాగా, కన్నడ, తెలుగు సిస్టర్ లాంగ్వేజెస్. దక్షిణాది భాషలు అంటే నాలుగే కాదు. మూలద్రావిడ భాష నుంచి మొత్తం 27 భాషలు పుట్టుకొచ్చాయని భాషా శాస్త్రం పేర్కొంది. తుళు, కొళగు, కొడబు వంటి భాషలన్నీ మూల ద్రావిడ కుదురు నుంచి పుట్టినవే. బ్రాహుయీ అనే ఒక భాష మాట్లాడే వారు పాకిస్తాన్లో ఉంటున్నారు. అది కూడ మూలద్రావిడ భాష కుదురులోంచే వచ్చిందని తేల్చారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న భాషా శాస్త్రంపై 600 పేజీల పుస్తకం గతంలోనే రాశారు. ద్రావిడ భాషల పుట్టు పూర్వోత్తరాలపై పాపులర్ శైలిలో రాసిన ప్రామాణిక పుస్తకం అది. భద్రిరాజు కృష్ణమూర్తి, జీఎన్ రెడ్డి వంటి భాషా శాస్త్రజ్ఞులు ద్రావిడ భాషల విశిష్టతపై మంచి విశ్లేషణాత్మక రచనలు చేశారు. అవి ఏవీ సామాన్యులకు అందుబాటులో లేకపోవడం విషాదకరం. మానవ జాతి మొత్తంగా ఆఫ్రికన్ కుదురు నుంచే విస్తరించిందనే విషయం సరిగా అర్థమైతే మా భాష గొప్పది, మా భాష ప్రాచీనమైనది అనే అజ్ఞానపు భావనలు పేలిపోతాయి. కమల్‌హాసన్ దేశం గర్వించదగినంత మేటి నటుడు. పతితులార భ్రష్టులార,. అంటూ థగ్ లైఫ్ సినిమా ప్రచార సభలో ఆయన పాడిన శ్రీశ్రీ గేయం మనం వినొచ్చు. కానీ తమిళం నుండి కన్నడ పుట్టిందనడంలో కమల్‌తో పాటు పక్కనే ఉన్న శివరాజ్‌కుమార్ కూడా ఒకే భాషా కుదురు నుండి వచ్చిన వాళ్లమనే అర్ధంలో భావోద్వేగ వ్యాఖ్య చేశారనే భావించాలి. కమల్ ఉద్దేశ పూర్వకంగా మా తమిళ్ గొప్పది అని మాట్లాడలేదు కానీ ఆయన నోటిలోంచి అంత మాట వచ్చాక దాని అర్థాలు రకరకాల రూపాలు తీసుకున్నాయి. అనుద్దేశంగా అయినా సరే బెంగళూరులో సినిమా ప్రచార సభలో కమల్ అలా అని ఉండకపోయి ఉండే బాగుండేది. పైగా వ్యాపారం కోసం తీసిన సినిమా విషయంలో అంత మొండి వైఖరితో ‘నేను కర్నాటకలో థగ్ లైఫ్ సినిమా రిలీజ్ చేయను’ అనేంత భీషణ ప్రతిజ్ఞలకు ఎందుకెళ్లారు అనేది ప్రశ్న. నేను తప్పు చేయలేదు అని కమల్ అన్నారు. నిజమే కావచ్చు. ఒక భాషా రాష్ట్రాన్ని ఆయన మాట మండిరచింది కదా. కమల్ హాసన్ తన సినిమా ప్రమోషన్ ఈవెంట్లో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నాడు.. అతని అభిప్రాయం అతనిది!.. ఈ విషయంలో అతనిది అహంకారంగా భావించక్కర్లేదు. 6వేల సంవత్సరాలకు పూర్వం లిపి లేదు.. భాషా స్వరూపం లేదు.. ప్రాచీన కాలంలో ఈ దేశంలో ఉన్నవి ద్రావిడ భాషలే. లిపిలో తమిళం, మలయాళం పోలికలు ఉన్నాయి. తెలుగు, కన్నడ లిపికి అనుబంధం ఉంది. కమల్ హాసన్ బహుళ భాషల్లో నటించినందువల్ల అతను బహు భాషావేత్త కాగలిగాడు. మాతృభాష అయిన తమిళం మాత్రమే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ కూడా స్వచ్ఛంగా, ధారాళంగా మాట్లాడగలడు. తాను నటించే ఇతర భాషా సినిమాలల్లోని తన పాత్రలకి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటాడు. అది అతను ఇతర భాషల పట్ల చూపించే గౌరవానికి తార్కాణం. అతని భాషా ఆసక్తి, నిబద్ధత చూస్తుంటే అతని పట్ల గౌరవం ఏర్పడుతుంది. తెలుగులో మాట్లాడటమే కాదు ఆయన తెలుగుని చదవగలడు కూడా! శ్రీశ్రీ కవిత్వాన్ని తమిళ వేదికల మీద చదివి వినిపించాడాయన. అలాంటి కమల్ ఇతర భాషల పట్ల చులకనగా వ్యవహరిస్తారనడం సరికాదేమో? రాజకీయ నాయకులు ప్రతిదీ తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నట్లే ఈ వ్యాఖ్యకీ వక్రార్ధాలు తీశారు. దాంతో కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ ‘థగ్ లైఫ్’ కర్నాటకలో విడుదల కాకూడదని హైకోర్ట్‌కి వెళ్లింది. ‘‘మీరేమైనా భాషావేత్తా లేక చరిత్రకారులా? క్షమాపణ చెబితే ఇంత దూరం వచ్చేది కాదుగా?’’ అంటూ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఓ భాష కోసం మాట్లాడాలంటే భాషావేత్త చరిత్రకారుడే అయివుండాలా? లేదూ తమిళం కంటే ముందే కన్నడంలో శాసనాలు ఉన్నాయని ఎవరైనా చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా. తమిళానికి మాత్రమే ప్రాచీన భాష హోదా ఇచ్చినప్పుడు తెలుగు, కన్నడీయులు ఎందుకు మిన్నకున్నారు?










Comments