భూ సమస్యల జాతర
- BAGADI NARAYANARAO

- Dec 26, 2025
- 1 min read
సమగ్ర కథనం కామెంట్ సెక్షన్‌లో..
భూ సమస్యల జాతర
30 మండలాల నుంచి పోటెత్తిన బాధితులు
22ఎ భూస్వేచ్ఛకు కలగని మోక్షం
ఇతర సమస్యలతో వచ్చినవారే అధికం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా వ్యాప్త్తంగా ఒకే రోజు శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ పరిధిలో ఉన్న 22ఏ నిషేదిత జాబితాలో చేరిన జిరాయితీ భూమలకు విముక్తి కల్పిస్తామని ప్రకటించడంతో జిల్లాలోని 30 మండలాల నుంచి వేల సంఖ్యలో బాధితులు జెడ్పీ సమావేశ మందిరం వద్దకు చేరుకున్నారు. వేలాది మంది భూసమస్యలపై అర్జీలు సమర్పించడానికి జెడ్పీకీ చేరడంతో గందరగోళంగా మారింది. 22ఏ బాధితులతో పాటు ఇతర రెవెన్యూ సంబంధిత వివాదాస్పద భూములు పైనా అర్జీలు ఇవ్వడానికి దరఖాస్తుదారులు చేరుకున్నారు. దీంతో 22ఏపై అభ్యంతరాలు ఉన్నవారిని పక్కకు పెట్టాల్సివచ్చింది. 22ఏ సమస్యకు పరిష్కారం చూపించడానికి మూడు డివిజన్ల పరిధిలోని 30 మండలాల నుంచి ఆర్డీవోలు, తహసీల్ధారుతో పాటు రెవెన్యూ యంత్రాంగాన్ని జిల్లా కేంద్రానికి పిలిపించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే బాధితుల అభ్యంతరాల పరిశీలించి రైతుల భూములకు పూర్తి స్వేచ్ఛ కల్పించి రికార్డుల్లో పారదర్శకత పెంచడానికి ప్రయత్నించారు. దీనిపై మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి డివిజన్ వారీగా కార్యక్రమాన్ని చేపట్టి ఉంటే ప్రభుత్వ లక్ష్యం నెరవేరేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
జిల్లాలో గత మూడేళ్లగా 22ఏ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చిన 181 దరఖాస్తులు కలెక్టరేట్‌లో పెండిరగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తులకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తి చేసి 22ఏ నిషేదిత జాబితా నుంచి తొలగించాలనే సిఫార్సు ఆయా మండలాల నుంచి డివిజన్ కార్యాలయాలకు, అక్కడి నుంచి కలెక్టరేట్‌కు చేరాయి. క్యాబినెట్‌లో 22ఏపై నిర్ణయం తీసుకోవడంతో పెండిరగ్‌లో ఉన్న 181 అర్జీలకు పరిష్కారం చూపించాలని మీ చేతికి.. మీ భూమి కార్యక్రమం శుక్రవారం ఏర్పాటు చేశారు. అయితే దీంతో పాటు భూములకు సంబంధించి అనేక క్షేత్రస్థాయి సమస్యలు ఉండటంతో, వారంతా ఈ కార్యక్రమానికి పోటెత్తడం వల్ల ఎవరికీ న్యాయం చేయలేకపోయారు.
వైకాపా హయాంలో మాత్రం రాజకీయ సిఫార్సులకు పెద్ద పీట వేసి కొన్ని విదాదాస్పద భూములను 22ఏ నిషేదిత జాబితా నుంచి తప్పించారు. సాధారణ అర్జీల జోలికి వెళ్లలేదు. కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి 22ఏ భూస్వేచ్ఛ ప్రత్యేక డ్రైవ్‌ను బహిరంగంగా నిర్వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అయితే కార్యక్రమం డివిజన్లు వారీగా నిర్వహించి ఉంటే బాధితులందరికీ ప్రయోజనం కలిగివుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ కార్యక్రమానికి అర్జీలు తీసుకు వచ్చినవారంతా దశాబ్ధాలుగా 22ఏ జాబితా నుంచి రైతువారీ పట్టా భూమికి విముక్తి కలిగించాలని ఉన్నతాధికారులు గ్రావెన్స్‌లో అర్జీలు ఇచ్చినవారే.










Comments