భగవద్గీత నైతికశాస్త్రం!
- DV RAMANA

- Dec 27, 2025
- 2 min read

మన సనాతన ధర్మాలు, సంప్రదాయాలు, పురాణాలు.. తరచూ వివాదాలకు కారణమై విస్తృత చర్చలకు తావిస్తుంటాయి. వీటిని హిందువులు పాటిస్తారు కనుక ఇవి హిందూ మతానికి మాత్రమే పరిమితమన్న వాదనలు వినిపిస్తుంటాయి. వాటిలో చాలావరకు మానవ జీవన విధానాన్ని ప్రకాశవంతం చేసే గ్రంథాలని అనేక సందర్భాల్లో రుజువైనా ఇతర మతాలకు చెందినవారు ఒక పట్టాన దానికి అంగీకరించారు. మత ముద్ర వేసి వాటిని పక్కన పడేస్తుంటారు. అలా మతం ముద్ర పడిన వాటిలో శ్రీమద్భగవద్గీత ఒకటి. ఇది మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామ ఘట్టంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం కనుక హిందువులకు చెందిన గ్రంథమనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలను పరిశీలిస్తే అవి మానవ జీవనాన్ని పరిశుద్ధం చేసే ప్రవర్తనా నియమావళిగా అర్థమవుతుంది. సమాజంలో మనిషి ఎలా జీవించాలో.. ఎలా ఉండకూడదో చెప్పే జీవనశాస్త్రంగా కనిపిస్తుంది. అంతెందుకు ఆ మధ్య వచ్చిన ఓపెన్‌హైమర్ అనే ఆంగ్ల సినిమాలో అణుబాంబు పితామహుడిగా పేరొందిన జాలియస్ రాబర్ట్ అనే శాస్త్రవేత తాను తయారు చేసిన మొదటి అణుబాంబును 1945 జూలైలో న్యూమెక్సికో ఎడారిలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దానికి ముందే ఆయన భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని పఠించారు. దానికి కొన్నేళ్ల ముందు నుంచే భగవద్గీతను పటించడం అలవరచుకున్న ఆయన నేటి అణుబాంబుకు మూలం కురుక్షేత్ర కాలం నుంచి ఆయుధాలేనని స్పష్టం చేయడం విశేషం. ఇదే సినిమాలో సెక్స్ తర్వాత భగవద్గీత శ్లోకాన్ని ఆలపించడం వివాదం రేపిన విషయం పక్కనపెడితే నాటి అణు శాస్త్రవేత్తతోపాటు ఎందరో భగవద్గీతను కేవలం ఒక మతానికి పరిమితం చేయకూడదని చెప్పారు. కానీ విచిత్రంగా మన కేంద్ర ప్రభుత్వమే దాన్ని మతగ్రంథంగా పరిగణించడాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. భగవద్గీత, వేదాంతం, యోగాలను ఒక మతానికే పరిమితం చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అది భారతీయ సంస్కృతికి చిహ్నమని, ఇంకా చెప్పాలంటే సార్వజనీనమైనదని పేర్కొంది. వీటిలోని అంశాలను బోధిస్తున్నారన్న ఆరోపణతో ఒక సంస్థను లేదా వ్యక్తిని మతపరమైనవారుగా ముద్ర వేయలేమని స్పష్టం చేసింది. ఒక కేసు విచారణ అనంతరం జస్టిస్ జి.ఆర్.స్వామినాథన్ సింగిల్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది భగవద్గీత గ్రంథం ఒక కాలాతీత, సార్వత్రిక సందేశం. విశ్వంలోని జ్ఞానమంతా భగవద్గీతలో ఇమిడి ఉందని ఆధ్యాత్మిక వాదులు చెబుతారు. అలాంటి భగవద్గీతపై హైకోర్టు ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భగవద్గీత మత గ్రంథం కాదని పేర్కొంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద ఒక ట్రస్ట్ చేసుకున్న దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువరించారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన అర్ష విద్య పరంపర ట్రస్ట్ అనే సంస్థ వేదాంతం, సంస్కృతం, హఠయోగం లాంటి అంశాలను బోధిస్తుండటంతోపాటు ప్రాచీన గ్రంథాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియ నిర్వహిస్తోంది. ఈ కార్యకలాపాల కోసం విదేశీ నిధులు స్వీకరించేందుకు వీలు కల్పించే ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) రిజిస్ట్రేషన్ కోసం 2021లో దరఖాస్తు చేసుకుంది. అయితే కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ దరఖాస్తును తిరస్కరించింది. ట్రస్ట్ కార్యకలాపాలు మతపరమైనవిగా కనిపిస్తుండటం, ముందస్తు అనుమతి లేకుండా అప్పటికే రూ.9 లక్షల విదేశీ విరాళాలను సదరు సంస్థ స్వీకరించిందనే అభియోగాలు మోపుతూ ఆ కారణాలతోనే దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు హోంశాఖ పేర్కొంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అర్ష విద్య పరంపర ట్రస్ట్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారణకు స్వీకరించిన జస్టిస్ జీఆర్ స్వామినాథన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ కేంద్ర ప్రభుత్వం తరఫున చేసిన వాదనలను తప్పుపట్టారు. భగవద్గీత ఒక మతానికి పరిమితమైన గ్రంథం కాదని.. అది మానవాళికి జీవన విలువలు నేర్పే మోరల్ సైన్స్(నైతిక శాస్త్రం) అని అభివర్ణించింది. భారతీయ నాగరికతలో అదొక భాగమని స్పష్టం చేసింది. అంతేగాక యోగాను మతపరమైన కోణంలో చూడటం అమానుషమని కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. యోగా అనేది విశ్వవ్యాప్తమైనదని పేర్కొంది. ఇక వేదాంతం అనేది మన పూర్వీకులు అందించిన స్వచ్ఛమైన తత్వశాస్త్రమని పేర్కొంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రకారం ఒక సంస్థ మతపరమైనదా కాదా అన్నది నిర్థారించాల్సి వచ్చినప్పుడు అధికారుల వద్ద కచ్చితమైన ఆధారాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా కేవలం ‘అలా కనిపిస్తోంది’ అనే అనుమానంతో రిజిస్ట్రేషన్ దరఖాస్తును తిరస్కరించడం సరికాదని పేర్కొంది. 2021లో ఆర్ష విద్యాసంస్థ దరఖాస్తు చేసకుంటే దానిపై 2024 అక్టోబర్‌లో చర్యలు తీసుకోవడం ఏమిటని కూడా కేంద్ర హోంశాఖను న్యాయస్థానం ప్రశ్నించింది. త్వరితగతిన స్పందించడం, పారదర్శకంగా వ్యవహరించడం సుపరిపాలనలో ప్రాథమిక సూత్రమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తిరస్కరణ ఉత్తర్వులను కొట్టివేసింది. గతంలో రూ. 9 లక్షల విరాళానికి సంబంధించి) ట్రస్ట్ ఇప్పటికే జరిమానా కట్టినందున దరఖాస్తు తిరస్కరణకు దాన్నే కారణంగా చూపించడం చెల్లదని స్పష్టం చేసింది. దరఖాస్తును మళ్లీ పరిశీలించి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో మన సనాతన ధర్మానికి, యోగా వంటి సంప్రదాయాలకు విలువనిస్తూ ప్రోత్సహిస్తోంది. మన యోగ విద్యకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చామని చాటుకుంటోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు, విదేశీ నేతలు మన దేశానికి వచ్చిన ప్పుడు భారత్ తరపున భగవద్గీతను బహుమతిగా ఇస్తోంది. కానీ అదే ప్రభుత్వంలో భాగమైన హోంశాఖ భగవద్గీతను మతపరమైన గ్రంథంగా పేర్కొనడం దురదృష్టకరం.










Comments