భవిష్యత్తు ‘బెంగ’..ళూరు!
- DV RAMANA

- Jul 5, 2025
- 3 min read
ఈ నగరం మమ్మల్ని చంపేస్తోంది!
బెంగళూరును వీడుతూ ఓ యువజంట ఆవేదన
వాయు కాలుష్యంతో ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని ఆరోపణ
పెరుగుతున్న జనాబా.. విచ్చలవిడిగా గృహనిర్మాణాలు
అడుగంటుతున్న భూగర్భజలాలు.. నీటి పథకాలు
వేసవిలో తాగునీటి కొరతతో అల్లాడిన జనం
సామాన్యులకు అందుబాటులో లేని ఇళ్ల అద్దెలు

ప్రపంచంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) బూమ్ వస్తే.. అది మన దేశంలో బెంగళూరుకు వరంగా మారింది. ప్రశాంతమైన, ఆహ్లాదకర, ఆరోగ్యవంతమైన వాతావరణం కలిగిన ఈ మహానగరం ఐటీ ఇండస్రీని విపరీతంగా ఆకర్షించింది. ఫలితంగా సిలికాన్ సిటీగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. దాంతో ఒక్క కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు బెంగళూరు స్వర్గంలా.. కలల నగరంలా మారింది. ఐటీతోపాటు అనేక రంగాలు అభివృద్ధి చెందాయి. అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది. నగరం మహానగరంగా మారి జనసంఖ్య విపరీతంగా పెరిగింది. లక్షలాది ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నా.. అద్దెకు ఇళ్లు దొరకని పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నిన్నటి వరకు స్వర్గంలా కనిపించిన ఆ మహానగరం.. నేడు చాలామందికి మరుభూమిలా కనిపిస్తోంది. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, నానాటికీ తీవ్రమవుతున్న తాగునీటి సమస్య, వికేంద్రీకరణ కారణంగా ఐటీ పరిశ్రమలు కొత్తగా ఏర్పడకపోవడం వంటి కారణాలు.. ఇంతకాలం యువజనుల డెస్టినేషన్‌గా ఉన్న బెంగళూరును పక్కకు తప్పించేస్తున్నాయి. ఇదే దుస్థితిని వివరిస్తూ నగరాన్ని విడిచి వెళ్లిన ఒక యువజంట పోస్టు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దానిపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ఇంతకూ ఆ జంట తమ వీడియోలో ఏం చెప్పింది.. బెంగళూరు వాస్తవ పరిస్థితి ఏమిటి? ఒకసారి చూద్దాం.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
బెంగళూరు మమ్మల్ని చావుకు చేరువ చేస్తోంది.. అందుకే ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాం.. అని నగరాన్ని వీడి వెళ్తూ ఓ జంట ఒక పోస్టును సామాజిక మాధ్యమాల్లో వదిలింది. నగరంలోని కాలుష్యం పెరుగుతుండటంతో తరచూ అనారోగ్యం పాలవుతున్నామని, ఇక్కడ ఉండలేమని నిర్ణయించుకున్న ఆ జంట దానికి కారణాలను ఒక వీడియో ద్వారా వివరించింది. ఆశ్విన్, అపర్ణ అనే యువ దంపతులు వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతూ బెంగళూరులో రెండేళ్లు నివసించారు. నగరంలో పెరుగుతున్న కాలుష్యం వల్ల తమ ఆరోగ్యం క్షీణిస్తోందని వారు తెలిపారు. దీని కారణంగా యుక్తవయసులోనే అనారోగ్యం పాలవుతుండటం తమను బాధిస్తోందన్నారు. వాస్తవానికి ఈ నగర వాతావరణం, ఇక్కడి ప్రజలంటే ఎంతో ఇష్టమని, కానీ అనూహ్యంగా పెరుగుతున్న కాలుష్యం, పెరుగుతున్న నీటి సమస్య తమను చంపేస్తాయేమోనన్న భయంతోనే నగరాన్ని విడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదనతో వెల్లడిరచారు.
మా మాటలు నచ్చకపోవచ్చు
బెంగళూరు మమ్మల్ని నెమ్మదిగా చంపేస్తోంది. ఈ మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. మమ్మల్ని ద్వేషించవచ్చు. కానీ వాస్తవం ఇదే అని కుండబద్దలు కొట్టారు. కొంతకాలంగా తాము తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని పేర్కొన్నారు. బెంగళూరుకు వచ్చాక తనకు శ్వాస సంబంధిత సమస్యలు, అలర్జీలు వచ్చాయని అశ్విన్ పేర్కొన్నారు. తాను సాధారణంగా అనారోగ్యం బారిన పడనని, కనీసం జలుబు కూడా చేయదని, కానీ బెంగళూరు వచ్చిన తర్వాత దగ్గు, తుమ్ములు పట్టుకున్నాయని అపర్ణ చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులు చేసినప్పటికీ వారి ఆరోగ్యం మెరుగుపడలేదు.
నగరంలో పెరుగుతున్న సమస్యలు
ఈ జంట చేస్తున్న ఆరోపణల్లో కొంత వాస్తవం లేకపోలేదు. పౌర జీవనానికి కనీస అవసరాలైన గాలి, నీరు, ఇళ్లు.. అన్నీ కొరతగా మారుతున్నాయి. ఒకప్పుడు మండు వేసవిలోనూ చల్లదనాన్నిచ్చే ఆహ్లాదకర వాతావరణం, ఉద్యానవనాలు, తోటలతో బెంగళూరు అందరినీ ఆకట్టుకునేది. అందువల్ల దీన్ని గార్డెన్ సిటీ అని పిలిచేవారు. కానీ ఐటీతోపాటు ఇతర రంగాలు భారీగా విస్తరించడం, వాతావరణాన్ని కాపాడే చర్యలు లేకపోవడంతో పరిస్థితి దిగజారిపోయింది. అభివృద్ధితోపాటు జనసంఖ్య, వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో గాలి నాణ్యత క్షీణించింది. స్వచ్ఛమైన గాలి గగనమైపోయినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా గాలి నాణ్యత 34`66 పాయింట్ల మధ్య ఉండాలి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో సేకరించిన ఏక్యూఐ లెక్కల ప్రకారం గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయి అయిన 200 పాయింట్లను దాటి 297గా నమోదైంది. దాదాపుగా ఇదే స్థాయిలో గాలి కాలుష్యం పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
`పారిశ్రామికాభివృద్ధి కారణంగా నగరం విస్తరించి మహా నగరంగా మారింది. జనాభా ఎన్నో రెట్లు పెరిగిపోయింది. జనావాసాలు పెరగడం, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు అపరిమితంగా జరగడం, వాటి నీటి అవసరాల కోసం విచ్చలవిడిగా బోర్లు తవ్వి మోటార్లతో తోడేయడం వల్ల భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. దాని ఫలితం గత ఏడాది నగరం జీవనంపై స్పష్టంగా కనిపించింది. గత ఏడాది వర్షాభావం నెలకొనడంతో నగరానికి నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు, భూగర్బ జలాలు అడుగంటాయి. దాంతో మొన్న వేసవిలో బెంగళూరు నగరంలో దాహం కేకలు మిన్నంటాయి. గతంలో ఎప్పుడూ ఇంత తీవ్రమైన నీటి సమస్య తలెత్తలేదని తరతరాలుగా నగరంలో ఉంటున్నవారు చెబుతున్నారు. దీనికితోడు పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి పథకాలను విస్తరించడం లేదా కొత్త పథకాలు నిర్మించడంపై ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించకపోవడం ఈ దుస్థితికి కారణం.
`దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పెద్దసంఖ్యలో వలస వస్తున్న వారితో నగరం కిక్కిరిసిపోయింది. దీనికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు గణనీనయంగా పెరిగాయి. ఇది నగరాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చేసింది. అయినా ఇంకా ప్రజల అవసరాలు తీరడం లేదు. అద్దె ఇల్లు లభించడమే గగనంగా మారింది. ఫలితంగా ఇళ్ల యజమానులు కొండెక్కి కూర్చున్నారు. అద్దెలు భారీగా పెంచడంతోపాటు సింగిల్ బెడ్‌రూం ఇళ్లకు కూడా రూ.లక్షల్లో అడ్వాన్సులు డిమాండ్ చేసేవారు. అయితే ఈ పరిస్థితి కొద్దిరోజులుగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానమైన ఐటీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుండటంతో చాలామంది టెకీలు బెంగళూరును వీడి హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లోని ఐటీ కంపెనీల్లో చేరేందుకు తరలిపోతున్నారు. దాంతో చేరేవారు లేక అద్దె ఇళ్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. ఈ పరిణామంతో ఇళ్ల యజమానులు మెల్లగా దిగివస్తున్నారు.
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఈ నేపథ్యంలో అశ్విన్, అపర్ణ దంపతులు పోస్టు చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ జంట వీడియోలో పేర్కొన్న అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ఆ జంట వాదనను సమర్థిస్తుండగా మరికొందరు విభేదిస్తున్నారు. బెంగళూరు జనాభా విపరీతంగా పెరగడానికి, ఇక్కడి వాతావరణం కాలుష్యమయం కావడానికి స్థానికేతరులే కారణమని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ‘మీరు వెళ్లిపోయినందుకు ధన్యవాదాలు. మాకు కాస్త పరిశుభ్ర గాలి లభిస్తుందని మరో యూజర్ బదులిచ్చాడు. మరోవైపు చాలామంది ఆ జంట అభిప్రాయాలతో ఏకీభవించారు. ‘బెంగళూరులో నివసించే వారు అపర్ణ, అశ్విన్‌ల వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోకుండా నగరంలో పెరుగుతున్న కాలుష్యం గురించి ఆలోచించాలని సూచించారు. మన నగరాన్ని సురక్షితంగా మార్చడానికి ప్రయత్నిద్దామంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. కాలుష్యం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి వారిని ద్వేషించడం సరికాదని చెప్పాడు.










Comments