top of page

ముఖ్యమంత్రినే మెప్పించినఆ కలెక్టర్‌ ‘ముస్తాబు’

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 23, 2025
  • 2 min read
  • గిరి విద్యార్థుల పరిశుభ్రతకు మన్యం జిల్లాలో కొత్త కార్యక్రమం

  • చంద్రబాబు ప్రశంసలు అందుకున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

  • దాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశాలు

  • ప్రాథమిక నుంచి ఇంటర్‌ వరకు విద్యాసంస్థలకు వర్తింపు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఉన్నతాధికారులు ఎందరో వస్తుంటారు.. వెళ్లిపోతుంటారు. కానీ వారిలో కొద్దిమంది మాత్రమే తాము పనిచేసిన ప్రాంతాలు, అక్కడి ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేయగలుగుతారు. వారు చేపట్టిన కార్యక్రమాలే వారు బదిలీపై వెళ్లిపోయినా కలకాలం గుర్తుండిపోయేలా చేస్తాయి. అలా తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకోగలిగిన అధికారి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి. ఆయన చేపట్టిన ఒక కార్యక్రమం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రశంసలకు పాత్రమైంది. సాధారణంగా చంద్రబాబును మెప్పించడం చాలా కష్టం. ఎంత బాగా చేసినా.. ఇంకా ఇంకా బాగా చేయాలంటూ గరిష్టంగా ఫలితాలు రప్పించేతత్వం ఆయనిది. కానీ ఆయనే ఏకంగా మన్యం జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని తోటి కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులందరి సమక్షంలో ప్రశింసించారంటే ఆయన చేసిన పని ఎంతగా ఆకట్టుకుందో.. ఎంత మంచిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అదే రాష్ట్ర ప్రభుత్వం మూడురోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘ముస్తాబు’ కార్యక్రమం. ఇటీవల అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి కలెక్టర్ల సమావేశంలోనే చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ పథకానికి అంకురార్పణ చేసిన అక్కడి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని అందరి సమక్షంలో ప్రశంసిస్తూ.. దాన్ని అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలని అక్కడికక్కడే ఆదేశించారు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలంటేనే అపరిశుభ్ర వాతావరణంలో ఉంటాయన్న భావన ఉంది. ఇక ఏజెన్సీ పాఠశాలల పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. అలాంటి పాఠశాలలను పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా ఉంచి పిల్లలను ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యాబుద్ధులు చెప్పేలే ‘ముస్తాబు’ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి జిల్లాలో దీన్ని ప్రారంభించారు.

మానసిక, శారీరక వికాసానికి

పిల్లల భవిష్యత్తు మాటల్లో కాకుండా చేసే పనుల్లో కనిపించాలన్న ఆలోచన నుంచే ముస్తాబు కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అంగన్వాడీ స్థాయి నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, ఆరోగ్యం, చదువుపై ఆసక్తి పెంచాలన్నదే దీని లక్ష్యం. పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలన్న ఆలోచనతో పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో ముస్తాబు కార్యక్రమానికి ఆ జిల్లా కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి మొదట శ్రీకారం చుట్టారు. మూడు నెలల క్రితమే కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటించి గిరిజన బాలల జీవన పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలు, ఎస్టీ హాస్టళ్లను కూడా సందర్శించారు. వారిలో సరైన దుస్తులు కూడా లేని చిన్నారులు కొందరు ఉంటే, తల దువ్వుకోవడం కూడా తెలియని అభాగ్యులు మరికొందరు. చాలామంది చిన్నారులకు పరిశుభ్రత విషయంలో కనీస అవగాహన కూడా లేదన్న విషయాన్ని గమనించారు. వారిని దుస్థితిని చూసిన ఆయన వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించి వారి జీవితాలను అందంగా ముస్తాబు చేయాలని నడుం బిగించారు. అనుకున్నదే తడవు కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. భారీ ఖర్చుతో చేపట్టే పెద్ద ప్రాజెక్టులకంటే తక్షణ ఫలితాలనిచ్చే చిన్న చిన్న పనులే నిజమైన విప్లవాన్ని తీసుకొస్తాయన్న నమ్మకంతో ముస్తాబు పథకాన్ని గిరి పాఠశాలల్లో చేపట్టారు. జుట్టు, గోళ్ల శుభ్రత నుంచి పిల్లల ఆత్మవిశ్వాసం వరకు ప్రతిదాన్ని ఈ కార్యక్రమంలో భాగం చేశారు.

చిన్న కార్యక్రమం.. పెద్ద ఫలితం

దీన్ని చేపట్టిన కొద్ది రోజుల్లోనే పిల్లల్లో విశేషమైన మార్పు కనిపించింది. కార్యక్రమం అమలు చేసిన అంగన్వాడీ కేంద్రాల పరిస్థితే మారిపోయింది. ఆటలతో కూడిన విద్య, కథలు, పాటల ద్వారా పిల్లలను చదువులో మమేకం చేశారు. చదువుకోవడానికి ఇష్టపడని విద్యార్థులు సైతం ఆటపాటల కోసం పాఠశాలకు రావడం ప్రారంభించారు. పౌష్టికాహారం, ఆరోగ్య పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇచ్చి, తల్లిదండ్రులను కూడా భాగస్వాములును చేశారు. పిల్లల రోజువారీ అలవాట్లలో క్రమంగా వచ్చిన మార్పులు ఈ పథకానికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమం వల్ల అంగన్వాడీ కేంద్రాలకు హాజరు పెరిగింది. పిల్లల పరిశుభ్రత అలవాట్లు మెరుగుపడ్డాయి. చదువుపై ఆసక్తి పెరిగింది. చిన్న స్థాయిలో మొదలైన ఈ ప్రయోగం ప్రభావవంతమైన మోడల్‌గా మారి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించింది.

అన్ని జిల్లాలకు వర్తింపు

గిరిజన విద్యార్థుల్లో తెచ్చిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయి ప్రాజెక్టుగా ప్రకటించి అమలు చేయడం ప్రారంభించారు. అంగన్వాడీ నుంచి ఇంటర్‌ స్థాయి వరకు ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలోనూ ముస్తాబు కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, విద్యార్థులకు చేతులు కడుక్కునే పద్ధతులు తెలిపి అలవాటు చేయడం, విద్యాసంస్థలో సబ్బు, హ్యాండ్‌వాష్‌ వంటివి అందుబాటులో అంచనా వేయడం. క్రమశిక్షణ అలవర్చడం, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోది చేయడం వంటి అంశాలను ముస్తాబు కార్యాచరణ మార్గదర్శకాల్లో చేర్చారు. ఒక జిల్లాలో చేపట్టిన కార్యక్రమం అందరినీ మెప్పించి రాష్ట్ర కార్యక్రమంగా మారడం విశేషం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page