మిగులు జలాలపై హక్కు దిగువ రాష్ట్రాలదే
- DV RAMANA

- Jun 20, 2025
- 2 min read

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాజా వివాదానికి బనకచర్ల ప్రాజెక్టుతో తెర లేచింది. చాలాకాలంగా ప్రతిపాదనల్లోనే ఉన్న నదుల అనుసంధానంతో పాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్య శ్యామలం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో తాగునీటి కొరత తీర్చేందుకు రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీని ద్వారా గోదావరి నుంచి పోలవరం ప్రాజెక్టు కాలువ ద్వారా 200 టీఎంసీల జలాలను కృష్ణాలోకి, అక్కడి నుంచి పెన్నా నదిలోకి మళ్లించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే ఈ ప్రాజెక్టుపై ఎగువన ఉన్న మన దాయాది తెలంగాణ రాష్ట్రం అభ్యంతరాలు లేవనెత్తుతోంది. గోదావరి జలాలను తరలిస్తే ఆ నదిపై తమ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు వట్టిపోయి, తాము నష్టపోతామన్న రీతిలో వాదిస్తోంది. బనకచర్లను ఆమోదించవద్దని కేంద్ర జలసంఘాన్ని, జలవనరుల మంత్రిత్వశాఖను డిమాండ్ చేస్తోంది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏకంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఏకాభిప్రాయంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆంధ్రప్రదేశ్ వాదన మరోలా ఉంది. సముద్రంలో వృథాగా కలుస్తున్న 3వేల టీఎంసీల జలాల్లో 200 టీఎంసీలను తాము బనకచర్లకు తరలించాలని భావిస్తున్నామని చెబుతోంది. గత 50 ఏళ్ల గోదావరి నదీ ప్రవాహ రికార్డులు పరిశీలిస్తే.. దాదాపు ప్రతి ఏటా సగటున 3వేల టీఎంసీల గోదావరి వరదనీరు బంగాళాఖాతంలో కలుస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక అంతర్ రాష్ట్ర నదీ జలాల పంపిణీ, వివాదాలను పరిశీలిస్తే.. దేశంలో ఏర్పాటైన అన్ని నదీ జలాల ట్రిబ్యునళ్లు పరీవాహక రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో నీటి కేటాయింపులు చేస్తుంటారు. ఆయా నదుల్లో సగటున లభించే నికర జలాలను లెక్కగట్టి దాని ఆధారంగా రాష్ట్రాలకు వాటాలు నిర్ణయిస్తారు. ఇక నికర జలాలు పోను వర్షాకాలంలో అదనంగా పారే వరద నీటిని (మిగులు జలాలు) వినియోగించుకునే హక్కును దిగువ రాష్ట్రాలకే కల్పిస్తున్నాయి. ఆ విధంగా గోదావరి నదీ ప్రవహించే మహారాష్ట్ర, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య నికర జలాల పంపిణీ జరిగింది. ఏపీ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణకు ఏపీ వాటా నుంచి నికర జలాలు కేటాయించారు. ఇక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడూ, ఇప్పుడూ దిగువ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మిగిలు జలాలను వినియోగించుకునే హక్కు కట్టబెట్టారు. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఆ మిగులు జలాల నుంచే 200 టీఎంసీలను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలకు వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ భావి స్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 80 లక్షలమందికి సురక్షిత తాగునీరు అందుతుంది. అలాగే సుమారు 12 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. ఆంధ్రకు ఇంత భారీ ప్రయోజనం చేకూర్చే ఈ ప్రాజక్టు తమకు నష్టదాయకమని తెలంగాణ వాదిస్తోంది. దీనికి కేంద్ర జలవనరుల శాఖకు చెందిన అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేదని, అలాగే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఆమోదం కూడా లేదని వంకలు పెడు తోంది. అయితే ఈ వాదనను ఏపీ తప్పుపడుతోంది. ప్రాజెక్టు ప్రతిపాదనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రీ ఫీజిబులిటీ రిపోర్టును మే 22న ఏపీ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్‌కు సమర్పించింది. కేంద్ర పర్యావరణ నిపుణులు కమిటీ ఈ నెల 17న చర్చించింది. మరోవైపు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) సమర్పించడానికి ఏపీ నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. మూడు దశల్లో చేపట్టే ఈ ప్రాజెక్టు విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో చేస్తున్నదేమిటని ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేకుండానే గోదావరి జలాలపై కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు`రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజీలను నిర్మిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దిగువ రాష్రంగా మిగులు జలాలను వినియోగించుకునే హక్కు ఆంధ్రకు ఉందని తెలిసి కూడా అభ్యంతరం చెప్పడానికి తప్పు పడుతున్నారు. ప్రతి ఏటా వర్షాలు, వరదల సమయంలో అదనంగా దిగువకు పారే జలాలను రోజుకు రెండు టీఎంసీలు చొప్పున వంద రోజుల్లో 200 టీఎంసీలు తీసుకుని బనకచర్లకు వాడుకుంటామని, దీని వల్ల తెలంగాణకు ఏవిధంగా నష్టం జరుగుతుందన్నది మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతున్నదని అంటున్నారు. పోలవరం`బనకచర్ల అనుసంధాన పథకం ప్రతిపాదన లను కేంద్ర జలవనరుల శాఖకు పంపాం. దానిపై అభిప్రాయాలు కోరుతూ కేంద్రం పరీవాహక రాష్ట్రాలను కోరింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే అక్కడ చెప్పుకొనే అవకాశం ఉన్నా తెలంగాణ నేతలు, ప్రభుత్వం రాజకీయ కారణాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రచ్చ చేయడం తగదు.










Comments