top of page

మంచు కొండల్లో దాగిన అణు ముప్పు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Aug 6, 2025
  • 2 min read
  • నందాదేవి పర్వతంపై దశాబ్దాలుగా రహస్య పరికరం

  • చైనాపై నిఘాకు భారత్‌-అమెరికా రహస్య మిషన్‌

  • మంచు తుపానుతో దాని ఏర్పాటులో విఫలం

  • అక్కడే మంచుపొరల్లో సమాధి.. దశాబ్దాలుగా లభించని ఆనవాళ్లు

  • ఎప్పటికైనా దానితో ప్రమాదమేనని శాస్త్రవేత్తల ఆందోళన

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

పౌర అవాసాలపై మొదటి అణుబాంబు ప్రయోగం జరిగి సరిగ్గా 80 ఏళ్లు అయ్యింది. చరిత్ర పుటల్లోకి వెళితే.. రెండో ప్రపంచ యుద్ధం ముగింపునకు ముందు 1945లో ఇదే రోజు.. అంటే ఆగస్టు ఆరో తేదీన జపాన్‌లోని హిరోషీమా, తొమ్మిదో తేదీన నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు ప్రయోగించి తీవ్ర విధ్వంసం, వినాశనం సృష్టించింది. అప్పటినుంచీ అణుముప్పు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంది. ఎన్ని ఒప్పందాలు కుదిరినా, ఎన్ని ఆంక్షలు ఉన్నా.. అమెరికాతో సహా అభివృద్ధి చెందిన దేశాలు మొదలుకొని పాకిస్తాన్‌లాంటి చిన్న దేశాలు సైతం అణుబాంబులు తయారుచేసి.. అవసరమైతే వాటిని శత్రు దేశాలపై ప్రయోగిస్తామని బెదిరిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో పాక్‌ నేతలు, సైన్యాధికారులు ఇటువంటి బెదిరింపులకే పాల్పడ్డారు. మరోవైపు అణుబాంబులు కలిగి ఉన్న ఇరాన్‌, రష్యాలపై ఆంక్షలు విధిస్తున్న అమెరికా పెద్దస్థాయిలో అణుబాంబులు తయారు చేస్తోంది. ఫలితంగా ప్రపంచం మొత్తం ప్రస్తుతం అణుకుంపటిపై ఉంది. మరోవైపు దేశానికి పెట్టని కోటలా ఉన్న హిమాలయాలు తమ గర్భంలో ఒక ప్రమాదకరమైన అణుపరికరాన్ని సుమారు ఆరు దశాబ్ధాల నుంచి దాచుకున్నాయని ఇప్పటి తరానికే కాదు.. అప్పటి తరంలోని మెజారిటీ ప్రజలకు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే.. ఒక రహస్య ఆపరేషన్‌లో భాగంగా నాడు హిమాలయాల్లో భారత్‌`అమెరికా కలిసి ఆ పరికరాన్ని ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ రహస్య ఆపరేషన్‌ ముందుకు సాగలేదు.. ఆ అణు పరికరం కూడా లభించలేదు. దాని వల్ల ఎప్పటికైనా హిమాలయాలకు తద్వారా భారత్‌తో సహా హిమాలయ దేశాలకు ప్రమాదం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

చైనాపై నిఘా లక్ష్యంగా..

సుమారు 60 ఏళ్ల క్రితం 1965లో.. మనదేశం, అమెరికా సంయుక్తంగా ఓ రహస్య మిషన్‌ చేపట్టాయి. హిమాలయాల్లోని నందాదేవి పర్వతంపై అణుశక్తితో పనిచేసే ఒక పరికరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. చైనా దేశంపై నిఘా పెట్టడమే ఈ పరికరం ఏర్పాటు వెనుక లక్ష్యం. అప్పటికే చైనా తన మొదటి అణుబాంబును తయారు చేసి పరీక్షించింది. ఇది అగ్ర దేశమైన అమెరికాను ఆందోళనకు గురిచేసింది. చైనా అణు కార్యక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుసుకోవాలని అమెరికా భావించింది. కానీ ఆ రోజుల్లో సాంకేతిక ఇంకా అభివృద్ధి చెందలేదు. ఆకాశవీధుల నుంచి నిఘా పెట్టే శాటిలైట్‌ వ్యవస్థలు అందుబాటులోకి రాలేదు. దాంతో చైనా, భారత్‌ సరిహద్దుల్లో ఉన్న హిమాలయ పర్వతాల నుంచే చైనా అణు కార్యకలాపాలపై నిరంతరం నిఘా వేసే స్థావరం ఏర్పాటు చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ఈ పని చేయాలంటే భారత సహకారం తప్పనిసరి. ఆ మేరకు భారత్‌ను అమెరికా సంప్రదించింది. చైనాను తనకు పక్కలో బల్లెంలా భావిస్తున్న భారత్‌ కూడా ఈ రహస్య ఆపరేషన్‌కు అంగీకరించింది.

సంయుక్త బృందం ఆధ్వర్యంలో..

భారత్‌ అంగీకరించడంతో ఇరుదేశాలు సంయుక్త కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. ప్రసిద్ధ పర్వతారోహకుడు, ఇండియన్‌ నేవీ అధికారి అయిన కెప్టెన్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో భారత్‌, అమెరికా నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. దేశ విభజన సమయంలో 15 ఏళ్ల వయస్సులో రిఫ్యూజీగా భారతదేశానికి వచ్చేసిన కోహ్లీ తర్వాత నౌకాదళంలో చేరి ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించడంలో నిపుణుడయ్యాడు. ప్రపంచంలో ఎత్తయిన ఎవరెస్టుపై తొలిసారి జెండా ఎగురవేసిన టెన్సింగ్‌ నార్కే వద్ద పర్వతారోహణలో శిక్షణ పొందారు. అందువల్లే రహస్య మిషన్‌కు కెప్టెన్‌ కోహ్లిని నాయకుడిగా నియమించారు. నిఘా పరికరం ఏర్పాటుకు హిమాలయాల్లోని ప్రసిద్ధ నందాదేవి పర్వతం అనువుగా ఉంటుందని భావించారు. అక్కడినుంచైతే చైనా అణు స్థావరాలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టవచ్చన్న ఉద్దేశంతో దాన్నే ఖరారు చేశారు. ఆ మేరకు ఏర్పాట్లు ప్రారంభించారు. నిఘా పరికరాన్ని పర్వతంపైకి తీసుకెళ్లారు. అయితే అదే సమయంలో భీకరమైన మంచు తుపాను దండెత్తడంతో బృందం సభ్యులు నిఘా పరికరాన్ని తాళ్లు కట్టి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తుపాను తగ్గిన తర్వాత వెళ్లి చూస్తే ఆ పరికరం కనిపించలేదు. ఎంత వెతికినా దాని ఆనవాళ్లు కూడా లభించలేదు. దాంతో ఆ రహస్య ఆపరేషన్‌ అసంపూర్తిగా మంచు కొండల్లో కలిసిపోయింది.

ఆందోళన ఎందుకంటే..

చైనాపై నిఘా కోసం రూపొందించిన ప్రత్యేక పరికరం ప్లూటోనియంతో పని చేస్తుంది. ఇది అతి ప్రమాదకరమైన రేడియోధార్మిక శక్తిని విడుదల చేస్తుంది. ఆ పరికంలో ఉండే ఫ్లూటోనియమే ఇప్పుడు శాస్త్రవేత్తలను భయపెడుతోంది. హిమాలయాల్లో నిరంతరం మంచు కరగుతూ ఆ నీరు గంగా, తదితర నదుల్లో కలుస్తుంటుంది. దశాబ్దాల నాటి ఆ రహస్య పరికరం లోని ప్లూటోనియం బయటకువస్తే.. అది నదుల్లో చేరి నీరు విషపూరితమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. దశాబ్దాలు గడిచినా ఆ పరికరం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఇప్పటికీ నందాదేవి ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికల బోర్డులు పెట్టలేదు. టూరిస్టులు, ట్రెక్కర్లు నడిచే గడ్డి మైదానాల కిందే ప్లూటోనియం పరికరం ఉండే అవకాశముంది. హిమాని నదాలు నెమ్మదిగా కరుగుతుంటాయి కనుక వాటి కింద చిక్కుకుపోయిన ఆ పరికరం ఎప్పటికైనా బయటపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా ఆ పరికరాన్ని అప్పట్లో పర్వతంపైకి మోసుకెళ్లిన కొందరు పోర్టర్లు ఆ తర్వాత కొన్ని రోజులకే అనారోగ్యం పాలై మరణించారని, దీనికి ఆ పరికరంలో ఉన్న ప్లూటోనియంలోని అణు ధార్మికతే కారణమని భావిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page