top of page

ముడుపు కట్టు.. సరుకు పట్టు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Dec 20, 2025
  • 3 min read
  • ఎచ్చెర్ల ప్రభుత్వ మద్యం గొడౌన్‌లో దందా

  • మాజీ ఉద్యోగి మంత్రాంగంతో వసూళ్ల పర్వం

  • కేసుకు రూ.10 అదనంగా ఇస్తే కావలసినంత సరుకు

  • ఇండెంట్ విడిపించుకున్న ప్రతిసారీ రూ.350 కట్టాల్సిందే

(file photo)
(file photo)
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారన్న సామెత ఉంది. ఇది వాస్తవమేనని నిరూపించే కథనమిది. ఒక అధికారి తన సర్వీసులో మూడొంతుల కాలాన్ని నాన్‌ఫోకల్‌ ఏరియాల్లోనే పని చేశారు. ఫోకల్‌ ఏరియాల్లో పని చేసే అవకాశాలు రాక కాదు.. అవినీతికి మారుపేరైన తన శాఖలో దండటం, పంచడం ఇష్టంలేక తెర వెనుకే విధులే నిర్వహించారు. అందులో భాగంగా బీరు, లిక్కర్‌ ఫ్యాక్టరీల్లో తనిఖీ అధికారిగానే ఎక్కువ కాలం పని చేశారు. సొమ్ములు తీసుకుంటారన్న ఆరోపణలు ఇంతవరకు ఎదుర్కోలేదు. ఆ కారణంతోనే ఎచ్చెర్ల ఏపీబీసీఎల్‌కు ఆయన్ను ప్రభుత్వం మేనేజర్‌గా నియమించింది. సాధారణంగా వైన్‌షాపుల నుంచి స్టాక్‌ కోసం ఇండెంట్‌ వచ్చినప్పుడు ప్రతి ఇండెంట్‌కు రూ.350 చొప్పున అక్కడ ఉండే సిబ్బంది అందరి తరఫున వసూలు చేయడం ఆనవాయితీగా మారింది. ఈ మొత్తాలు ఇవ్వడానికి, తీసుకోడానికి ఇరుపక్షాలవారు అలవాటు పడిపోయారు. గతంలో డిపో మేనేజర్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుల్లో ఒక్కరే ఉండేవారు. వీరి తరఫున అక్కడి కంప్యూటర్‌ సిబ్బంది, అసిస్టెంట్‌ మేనేజర్‌, ఎక్సైజ్‌ సీఐ స్థాయి వ్యక్తులు వసూలు చేసి ఎవరి వాటా వారికి పంచేవారు. ఏపీబీసీఎల్‌కు కొత్త మేనేజర్‌ వచ్చిన తర్వాత కూడా అవే పద్ధతులు కొనసాగుతాయని అందరూ భావించారు. కలెక్షన్లు, వాటాలు యథాప్రకారం సాగిపోయాయి. ఏపీబీసీఎల్‌కు ఒకసారి స్టాకు విడిపించుకోడానికి వెళ్తే ఎంత వసూలు చేస్తున్నారని ఎవరినైనా ప్రశ్నిస్తే అవన్నీ ఎప్పుడూ ఉండేవే లెండి అనే జవాబు వినిపించేది. కొత్తగా వచ్చిన డిపో మేనేజర్‌ దేనికీ పెద్దగా పీడిరచడంలేదని, లిబరల్‌గానే ఉన్నారని చెప్పేవారు. కానీ ఇటీవల ఇదే డిపో మేనేజర్‌ మీద లిక్కర్‌ షాపు ఓనర్లు కొందరు గుర్రుగా ఉన్నారు.

కేసుకు రూ.10 అదనపు వసూలు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతోపాటు మద్యం రేట్లను కూడా కొంతమేరకు తగ్గించింది. ముఖ్యంగా చీప్‌ లిక్కర్‌ను 99 రూపాయలకే అందజేసే అనధికార పథకాన్ని చేపట్టింది. సాధారణంగా చీప్‌లిక్కర్‌కు డిమాండ్‌ ఉంటుంది. అందులోనూ రూ.120 నుంచి రూ.99కి తగ్గిపోయిందంటే చీప్‌ మందుప్రియులు ఎగబడటం సహజం. అయితే పెరిగిన డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేదు. దాంతో అందుబాటులో ఉన్న సరుకునే అన్ని జిల్లాలకు సర్దుతున్నారు. ఫలితంగా ఒక్కో షాపునకు ఐదు కేసుల చీప్‌లిక్కర్‌ మాత్రమే సరఫరా అవుతోంది. వచ్చిన అరగంటలోపే ఇవన్నీ అమ్ముడుపోతుండటంతో తర్వాత వచ్చిన వారికి షాపు నిర్వాహకులు సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే ఈ కొరతనే ఇప్పుడు డిపో సిబ్బంది క్యాష్‌ చేసుకుంటున్నారు. డిపోకు రూ.99 క్వార్టర్‌ బాటిళ్ల స్టాకు ఎంత వస్తుందనేది డిపో సిబ్బందికి తప్ప బయటివారికి తెలియదు. వస్తున్న కొద్దిపాటి సరుకునే షాపునకు ఐదు కేసులు చొప్పున సర్దుబాటు చేస్తున్నామని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. కానీ లోపాయికారీగా కేసుకు రూ.10 చొప్పున అదనంగా చెల్లించేవారికి ఎక్కువ సరుకు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సాధారణంగా వైన్‌షాపులు తమకు అవసరమైన స్టాకు కోసం ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పెట్టుకోవాలి. ఆ మేరకు సొమ్ము చెల్లించాక ఆ రసీదు చూపించి వ్యాన్‌లో సరుకు లోడ్‌ చేయించుకోవాలి. ఈ ప్రక్రియ కోసం ప్రతి వైన్‌షాపునకు ఒక కోడ్‌ నెంబరు కేటాయించారు. ఆ నెంబరుతోనే ఆన్‌లౌన్‌లో లావాదేవీలు జరగాలి. అయితే ఐదేసి కేస్‌లు ఇచ్చేసిన తర్వాత.. కేస్‌కు రూ.10 అదనంగా చెల్లించడానికి ముందుకొచ్చిన వారికి ఇండెంట్‌తో పని లేకుండా వీరే వారి లాగిన్‌లోకి వెళ్లి చీప్‌లిక్కర్‌ కేస్‌లు డంప్‌ చేస్తున్నారు. అలా వేల కేస్‌లు రూ.10 అదనానికి వెళ్లిపోతున్నాయి.

అంత ఆయన మాయే

వాస్తవానికి డిపో మేనేజర్‌కు అన్ని తెలివితేటలు లేవు. అక్కడ పని చేస్తున్న సిబ్బందికి అంత ధైర్యం లేదు. కానీ ఒక రిటైర్డ్‌ ఉద్యోగి ఈ అక్రమ వసూళ్లకు సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఏపీబీసీఎల్‌లోనే సుదీర్ఘ కాలం పని చేసి అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో రిటైరైన ఆయన డిపో మేనేజర్‌ పోస్టు ఖాళీగా ఉన్నా అది భర్తీకాకుండా చేశాడు. ఆ బాధ్యతను తనే చాలా రోజులు వెలగబెట్టి బాట్లింగ్‌ గొడౌన్‌ నుంచి అక్రమంగా సొమ్ము సంపాదించడంలో పీహెచ్‌డీ చేసిన ఈయన డిపో మేనేజర్‌తో గత కొన్నాళ్లుగా జత కట్టినట్టు ఆరోపణలున్నాయి. ఈయనకు వైన్‌షాపులతో పాటు కొన్ని మద్యం బ్రాండ్ల డిస్ట్రిబ్యూషన్‌ కూడా ఉంది. జిల్లా వ్యాప్తంగా తన బ్రాండ్‌లు ప్రమోట్‌ చేసుకోవడానికి తన పాత హోదాతో డీఎంకు చేరువైన ఈయన చీప్‌లిక్కర్‌పై ఎంత దండుకోవచ్చో, ఎవరికి అదనంగా సరుకు ఇవ్వాలి, బయటకు పొక్కకుండా సొమ్ములు వచ్చే విధానం వంటి సూక్ష్మాలు చెప్పడం ద్వారా ఆ మేరకు డిపోలో వసూళ్లుసాగిస్తున్నట్టు తెలిసింది. ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వరకు ఒకే డిపో ఉండటం వల్ల వారానికోసారి సుదూర ప్రాంతాల వారు ఇండెంట్‌ పెట్టుకొని సరుకును పట్టుకెళ్తుంటారు. ఆ సమయంలో రూ.350 మామూళ్లుగా ఇస్తుంటారు. వారంలో ఎన్నిసార్లు వచ్చినా గతంలో రూ.350 మాత్రమే వసూలు చేసేవారు. కానీ ఈసారి ఎన్నిసార్లు వస్తే అన్ని రూ.350 అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. దాంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు మద్యం షాపుల యాజమాన్యాల పరిస్థితి తయారైంది.

లెక్కాపత్రంలేని పాత సరుకు

గతంలో ప్రభుత్వమే వైన్‌షాపులు నడిపినప్పుడు షాపుల్లో మిగిలిపోయిన స్టాకును కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత సంబంధిత సూపర్‌వైజర్లు ఎచ్చెర్ల ఏపీబీసీఎల్‌కు అప్పగించేశారు. ఇవన్నీ గొడౌన్‌లో చిందరవందరగా పడి ఉన్నాయని తెలిసింది. షాపులవారు ఎన్ని బాటిళ్లు అప్పజెప్పారు? ఎన్ని ఉన్నాయి? ఎన్ని బ్రాండ్లు మాయమయ్యాయి? అనే లెక్కలు తేల్చే నాధుడు అక్కడ లేడు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదు అందడంతో విశాఖపట్నం నుంచి ఈఎస్‌ స్థాయి అధికారిని పరిశీలనకు పంపారు. డిపోలో లెక్కాపత్రం లేకుండా పడి ఉన్న పాత సరుకును చూసి వారం రోజుల్లో లెక్కలు తేల్చాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page