top of page

మూడు పార్టీలు.. నాలుగు ప్రభుత్వాలైనా.. దారి చూపింది ధర్మానే!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Aug 11
  • 3 min read
  • తుదిరూపునకు కలెక్టరేట్‌

  • ఉమ్మడి రాష్ట్రంలో పట్టాలెక్కిన ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్ట్‌

  • మంత్రిగా ప్రసాదరావు ముందుచూపునకు సాక్ష్యం

  • 2011లో మొదటి శంకుస్థాపన

  • 2016లో చంద్రబాబు పేరిట శిలాఫలకం



ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

శిల శిల్పం కావాలంటే వందలాది ఉలి దెబ్బలు పడాల్సిందే. చివరిలో పడిన దెబ్బకే రాయి బద్దలయిందని భావిస్తే అంతకు మించిన తెలివితక్కువ తనం మరొకటి ఉండదు. అంతకు ముందు పడిన ప్రతీ దెబ్బ విలువైనదే.. అవసరమైనదే. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తిచేసుకొని కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధపడుతోంది. కూటమి ప్రభుత్వంలో దీని ప్రారంభోత్సవం జరుగుతున్నా, అసలు ఈ ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కాన్సెప్ట్‌ను తెచ్చింది మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇటువంటి సమగ్ర కలెక్టరేట్‌లు ఆరుచోట్ల నిర్మించాలని భావించినా, ఒక్క శ్రీకాకుళానికి మాత్రమే నిధులు తెచ్చుకోగలిగారంటే అందుకు కారణం.. ధర్మాన ప్రసాదరావే. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా మారిన ధర్మాన ప్రసాదరావు శాఖకు అప్పటి వరకు జీరో బడ్జెట్‌ ఉంది. నిధులు లేని శాఖకు ధర్మానను మంత్రిని చేశారని విమర్శించినవారూ లేకపోలేదు. కానీ నిబద్ధత ఉంటే నిధులు ఆటోమేటిక్‌గా సమకూరుతాయని ధర్మాన ప్రసాదరావు నిరూపించారు. ఆరు ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్లలో ఒక్కటి మాత్రమే నిలిచిందంటే.. అందుకు కారణం ఆయన దూరదృష్టే. శ్రీకాకుళం నగరం నలుమూలల్లో సందుగొందుల్లో కూడా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్‌ అండ్‌ బీ విధించిన రేట్ల మేరకు అద్దెలు ఉండటం వల్ల ప్రధాన మార్గాల్లో భవనాలేవీ ఇవ్వరు. అందుకే కొన్ని కార్యాలయాలు ఏ సందులో ఉన్నాయో కూడా చాలామందికి తెలియదు. అటువంటి కార్యాలయాలన్నింటినీ ఒకచోటకు తీసుకురావాలని ధర్మాన భావించారు. ఆ మేరకు అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్‌ చేసే రిజిస్ట్రేషన్‌, ఎక్సైజ్‌ శాఖలే అద్దె కొంపల్లో ఉన్నాయని ఉదహరించి నిధులు తెచ్చుకోగలిగారు. ఇప్పుడు దాని ఫలితమే పాత కలెక్టరేట్‌ ఆవరణలోనే కొత్త ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తిచేసుకుంది.

జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ ఉండాలని 2011లో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపాదనతో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 64 ప్రభుత్వ శాఖలు ఒకేచోట పని చేసేలా కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి 2011 జూన్‌ 8న శంకుస్థాపన చేశారు. 2011 నవంబర్‌లో నాగావళి నదికి అభిముఖంగా నూతన కలెక్టరేట్‌ నిర్మాణానికి పూణెకు చెందిన ఆర్కిటెక్ట్‌ సంస్థ ఇచ్చిన డిజైన్‌ ప్రకారం రూ.116 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ తయారుచేశారు. దాన్ని ఆమోదించిన ప్రభుత్వం 2012 బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో రోడ్లు, భవనాల శాఖ ద్వారా టెండర్లకు పిలిచారు. కడపకు చెందిన బీఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ టెండర్‌ దక్కించుకుంది కానీ, రాష్ట్ర విభజన కారణంగా పనులు పట్టాలెక్కలేదు.

2014 ఎన్నికల సమయంలో టీడీపీ కలెక్టరేట్‌ను ఎన్నికల హామీగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా 2016 నవంబరు 12న అప్పటి సీఎం చంద్రబాబు రెండోసారి శంకుస్థాపన చేసి శిలాఫలకం వేసి డీపీఆర్‌లో కొన్ని మార్పులు చేసి 20 నెలల్లోనే పనులు పూర్తి చేసి, కొత్త భవనాలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 2012లో కాంగ్రెస్‌ హయాంలో కేటాయించిన రూ.116.5 కోట్ల బడ్జెట్‌తోనే నిర్మించాలని నిర్ణయించారు.

2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన నాటికి 40 శాతం పనులే పూర్తయ్యాయి. రూ.116.5 కోట్ల అంచనా వ్యయం పెరిగింది. దీంతో రూ.156 కోట్లకు పెంచాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు. కరోనా కారణంగా ఏడాదిన్నర పాటు పనులు పూర్తిగా నిలచిపోయాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల కాంట్రాక్టర్‌ అర్ధాంతరంగా పనులు నిలిపేశారు. 2023 జూన్‌ 27న శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన అప్పటి సీఎం జగన్‌ ముందు నిధుల కొరతను ధర్మాన ప్రస్తావించారు. దీంతో కలెక్టరేట్‌ నిర్మాణానికి అవసరమైన రూ.69 కోట్లు మంజూరు చేస్తున్నట్టు జగన్‌ ప్రకటించారు. ఆ మేరకు రెండు దశల్లో కాంట్రాక్టర్‌కు రూ.50 కోట్లు చెల్లించారు. తుది దశ పనులు పూర్తిచేసి భవనాలకు సున్నం వేశారు. 2023 ఆగస్టు 4న శ్రీకాకుళం వచ్చిన అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ను కలెక్టరేట్‌ పనులు పరిశీలించాలని ధర్మాన కోరారు. ఆమేరకు వెళ్లిన మంత్రి మిగిలిన నిర్మాణాల పూర్తికి అవసరమైన నిధుల వివరాలను ఆర్ధికశాఖకు పంపించాలని జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు. దాని ఫలితంగా 2023 సెప్టెంబర్‌ 27న బిల్లు బకాయిల్లో రూ.7.33 కోట్లు చెల్లించారు. ఆతర్వాత మరో రూ.2.05 కోట్లు విడతల వారీగా చెల్లించారు. అన్ని ప్రభుత్వ శాఖల పాలన వ్యవహారాలు 2024 ఫిబ్రవరి నుంచి సమీకృత కలెక్టరేట్‌లో చేపట్టడానికి సన్నద్ధమవుతున్నట్టు 2023 అక్టోబర్‌ 5న కలెక్టర్‌ ప్రకటించారు. 2023 డిసెంబర్‌ నాటికి గ్రౌండ్‌ఫ్లోర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీర్లను ఆదేశించారు. 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేనాటికే సమీకృత కలెక్టరేట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రారంభిస్తామని ప్రకటించినా నిధులు మంజూరులో జాప్యం కారణంగా పనులు ముందుకు సాగలేదు. బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలో మరో రూ.30 కోట్లు మంజూరు చేస్తే తప్ప పూర్తిస్థాయిలో రోడ్లు, ఇతర మౌలిక వసతులతో కొత్త భవనం అందుబాటులోకి తీసుకురాలేమని కాంట్రాక్టర్‌ ఉన్నతాధికారులకు వివరించారు. ఫర్నిచర్‌కే రూ.2 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని కాంట్రాక్టర్‌ ప్రతినిధులు వివరించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో నూతన భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేసి ఎలక్షన్‌ కంట్రోల్‌ రూమ్‌గా రెండు నెలలు పాటు వినియోగించారు. ప్రస్తుతం భవనంలో పనులు సాగకపోయినా భవనానికి అభిముఖంగా 60 అడుగుల వెడల్పుతో ఒక రోడ్డును కొత్తగా నిర్మిస్తున్నారు.

కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధులు చెప్పినదాని ప్రకారం రూ.116.50 కోట్లతో చేపట్టిన కలెక్టరేట్‌ భవన నిర్మాణాలకు వైకాపా ప్రభుత్వం రూ.57.33 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇప్పుడు కూటమి రూ.12 కోట్లు బిల్లులను క్లియర్‌ చేసింది. ఇంకో రూ.9 కోట్ల విలువైన పని పూర్తయివుంది. దీనికి ఇంకా చెల్లింపులు జరగాలి. ఇది కాకుండా మరో రూ.30 కోట్లు ఇస్తేగాని కాంట్రాక్టర్‌కు సొమ్ముల చెల్లింపు పూర్తికాదు. ఇదిలావుండగా, ఇటీవల ఉచిత గ్యాస్‌సిలెండర్ల కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కలెక్టరేట్‌ అంశం తీసుకువెళ్లడంతో రూ.12 కోట్లు చెల్లింపునకు మార్గం సుగమమైంది. ఇప్పుడు రూ.70 లక్షలు కలెక్టర్‌ నిధులతో 60 అడుగుల రోడ్డును భవనానికి అభిముఖంగా నిర్మిస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం రోడ్డుకు ఆనుకొని సోలార్‌ ప్యానెలింగ్‌తో షెడ్లు నిర్మిస్తున్నారు. మూడు ప్రభుత్వాలు మారినా పూర్తిస్థాయి నిధులు మంజూరు కాలేదు. కానీ ఒక దార్శనికుడి ముందుచూపునకు తార్కాణంగా ఓ ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ జిల్లా ఏర్పడిన 75వ వసంతంలో అందుబాటులోకి వస్తుంది. ఏ ఆర్‌ అండ్‌ బి శాఖకు జీరో బడ్జెట్‌ అని ఎగతాళి చేశారో, అదే శాఖకు మంత్రిగా ధర్మాన ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తికాగా, స్థానిక ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద పాతబ్రిడ్జిని కూడా కూలగొట్టి, ఇదే మంత్రిత్వ శాఖ నుంచి నిధులు తెచ్చారు. పొన్నాడ వంతెన కూడా ఇటువంటిదే. విచిత్రంగా ఈ మూడూ ధర్మాన ప్రసాదరావు తీసుకువస్తే, తెలుగుదేశం హయాంలో ప్రారంభోత్సవాలవుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page