మృత్యుధామాలు.. ఈ హోటళ్లు!
- DV RAMANA

- Jul 4, 2025
- 2 min read
కాశీ క్షేత్రంలో పెరుగుతున్న కొత్త సంస్కృతి
మోక్షగామిగా ఈ నగరంలోపై హిందువుల విశ్వాసం
అందుకే పెద్దసంఖ్యలో చివరి రోజులు ఇక్కడికి రాక
మరణాన్ని ఆహ్వానిస్తూ ఈ వసతిగృహాల్లో నిరీక్షణ

పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు నిత్యం సందర్శకులతో కిటకిటలాడుతుంటాయి. దేశ విదేశాల నుంచి వచ్చే ఈ సందర్శకులకు వసతి సౌకర్యం కల్పించేందుకు హోటళ్లు, లాడ్జీలు, చౌల్ట్రీలను ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో నిర్వహించడం అందరికీ తెలిసిందే. కానీ విహార యాత్రలతో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి కాకుండా మరణాన్ని ఆహ్వానిస్తూ.. మోక్షం కోరుకుంటూ చాలామంది వెళ్లే ఒక ప్రాంతానికి వెళుతుంటారని తెలుసా? ఆ నగరం మన దేశంలోనే ఉందని.. అదొక ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమని తెలుసా?? అదే అతి పురాతన శైవక్షేత్రమైన కాశీ అనబడే వారణాసి నగరం. ఈ నగరంలో పలు చోట్ల మరణం ఎదురుచూసేవారు అడుగడుగునా కనిపిస్తున్నారు. ఇటువంటి వారి కోసమే ప్రత్యేకంగా హోటళ్లు, వసతి కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు. మోక్షం కోరుకునేవారు వీటిలో గడుపుతూ మరణానికి ఆహ్వానం పలుకుతుంటారు. అందుకే వీటికి డెత్ హోటల్స్ లేదా మృత్యు హోటళ్లుగా వ్యవహరిస్తున్నారు.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
కాశీ, వారణాసి, బెనారస్.. పేరు ఏదైనా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా.. ఆది దంపతులైన శివపార్వతులు విశ్వనాథుడు, అన్నపూర్ణలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారని ప్రతీతి. అందుకే హిందువులకు ఇది పరమ పుణ్యక్షేత్రంగా అనాది కాలంగా భాసిల్లుతోంది. అత్యంత ప్రాచీన నగరాల్లో ఒకటైన కాశీ క్షేత్రం ముక్తిధామంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మరణించినవారికి పునర్జన్మ అనే జీవనచక్రం నుంచి విముక్తి లభించి మోక్షం ప్రాప్తిస్తుందని హిందూ గ్రంథాలు, పురాణాల ఆధారంగా ప్రజలు విశ్వసిస్తారు. దేశవిదేశాల నుంచి వేలసంఖ్యలో భక్తులు నిత్యం ఈ క్షేత్రాన్ని సందర్శించి పూజలు చేస్తారు. వారితోపాటు జీవిత చరమాంకంలో ఉన్నవారు, చనిపోవాలనుకునేవారు కూడా పెద్దసంఖ్యలో కాశీలోనే తుదిశ్వాస వీడాలన్న కాంక్షతో ఈ పవిత్ర నగరానికి చేరుకుని మరణం కోసం ఎదురుచూస్తే ఇక్కడే కాలం గడుపుతుంటారు. ఈ కారణంతోనే కాశీలోని గంగా నదీతరంలో ఉన్న శ్మశానవాటికల్లో ఇరవై నాలుగ్గంటలూ చితి మంటలు రగులుతూనే ఉంటాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం వారణాసిలో మరణించినవారు నేరుగా విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠానికి చేరుకుంటారని నమ్మిక. అదే కాకుండా ఇతర ప్రాంతాల్లో మరణించినవారి చితాభస్మాన్ని వారి కుటుంబ సభ్యులు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వారణాసికి తీసుకొచ్చి గంగానదిలో కలపడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల మరణించిన తమ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి చేకూరుతుందని భావిస్తారు.
పెరుగుతున్న హోటళ్లు

మోక్షం కోరుకుంటూ, మరణాన్ని ఆహ్వానిస్తూ కాశీకి వచ్చి నిరీక్షించేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. వీరిలో పండు ముదసలివారితో పాటు దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు అధికంగా ఉంటున్నారు. సాధారణ హోటళ్లు, లాడ్జీల్లో ఇటువంటి వారికి వసతి లభించడం కష్టం. దాంతో వీరు రోడ్ల మీద, ఖాళీ స్థలాల్లోనూ ఆవాసం ఉండటం ప్రారంభించారు. అయితే ఇటువంటి వారి కోసమే ప్రత్యేకంగా హోటల్స్ ప్రారంభమవుతున్నాయి. మరణాన్ని ఆహ్వానిస్తూ కాశీకి వచ్చే వారిని ఈ హోటళ్లు ఆహ్వానిస్తున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో చివరి రోజులు గడిపే అవకాశం కల్పిస్తున్నాయి. ‘మా హోటల్ మరణం కోసం వేచి ఉండే గది లాంటిది. మా అతిధుల్లో చాలామంది వ్యాధిగ్రస్తులే. వారి నుంచి రోజుకు కేవలం రూ.20 మాత్రమే అద్దె వసూలు చేస్తాం’ అని ఇలాంటి ఒక హోటల్ యజమాని చెప్పారు. చాలామంది నెలల తరబడి ఉండిపోతుంటారని ఆయన చెప్పారు. కాలక్రమంలో ఈ ‘డెత్ హోటల్స్’ సంఖ్య పెరుగుతోంది. కాశీ విశ్వనాథాలయ సమీపంలో ఉన్న ముముక్షు భవన్ ఈ కోవకు చెందిన హోటళ్లలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ఒక్క హోటల్లోనే 40 మంది వృద్ధులు మరణం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు. కొందరైతే ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నారు. లక్సా ప్రాంతంలో ఉన్న ముక్తి భవన్ కూడా ప్రసిద్ధి చెందిన హోటల్.
మరణం ఒక వేడుక

కాశీ విశ్వనాథ్ దేవస్థానాన్ని విశ్వనాథ్ కారిడార్‌గా ఆధునికీకరించిన తర్వాత ముముక్షు భవన్‌కు కూడా కొత్త భవనం నిర్మించారు. తారా సంస్థాన్, ఉదయ్‌పూర్‌లోని నారాయణ్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ భవన్‌లో 40 మంది వరకు ఉచిత వసతి, భోజనం వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. వైద్యులు, నర్సులు, కౌన్సెలర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ‘ఇక్కడ ఉండే వారినుంచి మేం ఎలాంటి ఫీజు వసూలు చేయం. నివాసితులు చిన్న వంటగదిలో తమకు కావాల్సిన ఆహారం కూడా వండుకోవచ్చు’ అని ముముక్షు భవన్ మేనేజర్ సునైనా ఖారే తెలిపారు. మరణాన్ని ఒక విషాదఘట్టంగా అందరూ భావిస్తారు. కానీ వారణాసిలో మరణాన్ని చాలామంది వేడుక చేసుకుంటారు. అంతిమ సంస్కారాల ఊరేగింపులో పాటలు, నృత్యాలు ఉంటాయి. గంగా నదీతీరంలోని మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ రెండిరటిలోనూ సామూహిక దహన సంస్కారాలు జరుగుతాయి. ఈ రెండు ఘాట్లను ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ముముక్షు భవన్ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు నాలుగువేల మంది ఇక్కడ విడిది చేసి పవిత్ర వారణాసిలో మరణించాలనే తమ చివరి కోరికను నెరవేర్చుకున్నారు.










Comments