మిథున్‌ను ముంచేసిన రాము వాక్ప్రవాహం!
- DV RAMANA

- 5 days ago
- 2 min read
లోక్‌సభ వేదికగా ఆసక్తికర సన్నివేశం
ఏపీలో ప్రభుత్వ వేధింపులపై మిథున్‌రెడ్డి ఆరోపణలు
అనర్గళ ప్రసంగంతో గట్టిగా తిప్పికొట్టిన రామ్మోహన్‌నాయుడు
జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఉదాహరణలతో ఎండగట్టిన మంత్రి
ఐదేళ్లనాడు జరిగిన దానికి ఆ విధంగా బదులు తీర్చుకున్న నేత

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
కర్మఫలం ఎప్పటికైనా అనుభవించక తప్పదంటారు. మనం చేసిన కర్మలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా.. సమయం దొరికిన వెంటనే గత కర్మ తన ప్రభావం చూపిస్తుంది. ఎంతటివారైనా దీనికి అతీతులు కారని చెప్పడానికి చరిత్రలో ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి. అధికార దర్పంతో మిడిసిపడే రాజకీయ నాయకులు సైతం కర్మకు బద్ధులే. అదే విషయం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మరోసారి రుజువైంది. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాల్లో మన రాష్ట్ర నాయకులే ఈ ఉదంతంలో పాత్రధారులుగా నిలిచారు. వారిలో ఒకరు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కాగా.. మరొకరు వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి. పార్లమెంటులో రాష్ట్ర వ్యవహారాల ప్రస్తావన విషయంలో ఐదేళ్ల క్రితంనాటి సీన్‌ను ఈ ఇద్దరు నేతలు రిపీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మిథున్‌రెడ్డి సుమారు ఐదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు మంత్రి హోదాల్లో రామ్మోహన్‌నాయుడు తిప్పికొట్టి.. నోరు మెదపలేని పరిస్థితి కల్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే రివర్స్ అవుతుంది. వైకాపా ఎంపీ మిధున్‌రెడ్డికి అటువంటి పరిస్థితి ఎదురైంది. రామ్మోహన్‌నాయుడి వాగ్ధాటి ముందు ఆయన మౌనం వహించాల్సి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఐదేళ్ల క్రితం తన పట్ల మిధున్‌రెడ్డి వ్యవహరించిన తీరుకు రామ్మోహన్‌నాయుడు బదులు తీర్చుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఏపీ పరిణామాలపై వాగ్వాదం
శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సోమవారం లోక్‌సభలో వైకాపా ఎంపీ మిధున్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు. సొంత నియోజకవర్గంలో నే తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని, ప్రత్యర్థులపై కేసులు, అరెస్టులు వంటి నిర్బంధాలు, వేధింపులు తీవ్రంగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఆయన ఆరోపణలను తీవ్ర పదజాలంతో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ధీటైన సమాధానం ఇవ్వడం ద్వారా గట్టిగా తిప్పికొట్టారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామ్మోహన్ నాయుడు తన వాగ్ధాటితో తీవ్రంగా విరుచుకుపడుతుంటే ఏం మాట్లాడాలో తెలియక మిథున్‌రెడ్డి సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాన్ని సుమారు ఐదేళ్లనాటి ఘటనను అనుభవజ్ఞులు గుర్తుచేస్తున్నారు.
గతంలో జరిగిందేమిటంటే..
ఇదే మిథున్‌రెడ్డి ఆనాడు రామ్మోహన్‌నాయుడు విషయంలో వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చకు వస్తోంది. నాడు నిండు సభలో ఒక సందర్భంలో సాటి తెలుగు ఎంపీ అని కూడా చూడకుండా ‘కూర్చోరా భాయ్.. నువ్వు మాట్లాడిరది చాలు’ అంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడారు. సీన్ కట్ చేస్తే సరిగ్గా ఐదేళ్ల తర్వాత చిన్న వయసులోనే కేంద్ర కేబినెట్ మంత్రి పదవి పొందిన రామ్మోహన్‌నాయుడు ఉండగా.. మిథున్‌రెడ్డి అప్పటికీ ఇప్పటికీ అదే ఎంపీ స్థానంలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను 22 చోట్ల గెలిచింది. తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకే పరిమితమైంది. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. సంఖ్యాబలం స్వల్పంగానే ఉన్నప్పటికీ ఈ ముగ్గురు తమ వాగ్ధాటితో లోక్‌సభలో టీడీపీ వాయిస్‌ను గట్టిగానే వినిపించేవారు. ముఖ్యంగా హిందీ, ఇంగ్లిష్, తెలుగు అనర్గళంగా మాట్లాడగలిగే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తరచూ రాష్ట్ర, జాతీయ అంశాలు, సమస్యలపై అనర్గళ ప్రసంగాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు అధికారపక్షంతో పాటు విపక్షాలు సైతం నిశ్శబ్దంగా, ఆసక్తిగా గమనించేవి. చివరకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం అబ్బురపడి అభినందించిన సందర్భాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రామ్మోహన్‌నాయుడు పనితీరును గుర్తించి చిన్న వయసులోనే పౌర విమానయాన లాంటి పెద్ద శాఖను కొత్త ప్రభుత్వంలో అప్పగించారు. అటువంటి రామ్మోహన్‌నాయుడను రాష్ట్ర ప్రభుత్వంపై మిధున్‌రెడ్డి విమర్శలు గుప్పించడంతో తీవ్రంగా స్పందించారు. గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పారు.
సభను ఆకట్టుకున్న ప్రసంగం
రామ్మోహన్‌నాయుడు మూడుసార్లు ఎంపీగా గెలిచారు. అదే సమయంలో మిథున్‌రెడ్డి సైతం రాజంపేట నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే రామ్మోహన్ నాయుడుకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన్ను ఓడిరచడానికి వైకాపా నాయకత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డి చేసిన విమర్శలను సభలోనే ఉన్న రామ్మోహన్‌నాయుడు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్‌రెడ్డి ఆస్తులు, వివాదాలు, కేసులు, ఆయన ఐదేళ్ల పాలనలో ప్రత్యర్థులను వెంటాడిన తీరు, ఆయన విధానాలతో రాష్ట్రం నష్టపోయిన తీరును ఉదాహరణలతో సహా గుక్క తిప్పుకోకుండా ఎదురుదాడి చేయడం సభను ఆకట్టుకుంది. మిథున్‌రెడ్డిని అవాక్కయ్యేలా చేసింది. దీన్ని అనేకమంది వీడియోలతో సహా వైరల్ చేస్తున్నారు. నాటి మిథున్‌రెడ్డి ప్రవర్తనకు ఆలస్యమైనా ధీటైన సమాధానం చెప్పారంటూ రామ్మోహన్‌నాయుడును అభినందిస్తున్నారు.










Comments