top of page

ముందుకెళ్తే నుయ్యి.. వెనక్కొస్తే గొయ్యి!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 7 days ago
  • 2 min read
  • స్థానిక సంస్థల మీద ప్రభుత్వాల పెత్తనం

  • 16 మంది మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు

  • సిక్కోలు కమిషనర్ ఎందుకు వెళ్లిపోయారో తెలిసిందిప్ప్పుడు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు స్వయంప్రతిపత్తి ఉంది. వారు వసూలుచేసిన పన్నులు వారే ఖర్చు చేసుకునే విధంగా వెసులుబాటు ఉంది. 001 పద్దు కింద ఉద్యోగుల జీతభత్యాలు చెల్లిస్తారు. 002 కింద మున్సిపాలిటీలో మెయింటినెన్స్ కోసం నిధులు ఖర్చు చేస్తారు. ఈ రెండు ఖాతాల్లో ఉన్న నిధులు ఖర్చు చేయడానికి వీళ్లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు అభివద్ధి పనుల బిల్లుల చెల్లింపునకు నిధులు వాడేయడంతో రాష్ట్రంలో 16 మున్సిపాలిటీలకు సంబంధించి కమిషనర్లకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అందులో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణ పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ వేగవంతం చేశారు. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసి ప్రారంభం కాని పనులన్నిటినీ పట్టాలెక్కించారు. వైకాపాలో కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయని కాంట్రాక్టర్లు పనులు చేయడానికి నిరాకరిస్తే, వాటి చెల్లింపునకు ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి 001, 002 పద్దుల్లో నిల్వ ఉన్న సొమ్మును వాడేశారు. రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల్లో ఇదే జరిగింది. దీంతో జీతాలకు నిర్దేశించిన పద్దు నుంచి, మెయింటినెన్స్, డీజిల్ ఖర్చులకు నిర్దేశించిన 002 పద్దు నుంచి బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం కమిషనర్లకు సంజాయిషీ అడిగింది. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో 001 కింద రూ.11 కోట్లు, 002 కింద రూ.23 కోట్లు కొత్త ప్రభుత్వం వచ్చేనాటికి ఉన్నాయి. వీటిని మిగిలిన పనుల కోసం ఖర్చు చేస్తే, జీతాలకు, మెయింటినెన్స్‌కు తమపై ఆధారపడతారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ రెండింటినీ ఫ్రీజ్ చేసింది. కానీ కార్పొరేషన్ పరిధిలో పనులు జరగాలంటే ప్రభుత్వమైనా నిధులివ్వాలి, లేదా మున్సిపాలిటీ నిధులనైనా వాడుకోవాలి. ఈ రెండూ లేకుండా అభివద్ధి పనులు జరగవు. మున్సిపాలిటీలో అభివద్ధి పనులంటూ జరిగితే, ఈ రెండు అకౌంట్లకు అనుసంధానంగా పే అండ్ అకౌంట్స్ నేతత్వంలో శ్రీనిధి పోర్టల్‌ను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. అంటే సంబంధిత పనుల బిల్లులు ఇందులో అప్‌లోడ్ చేస్తే ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో వీటిని చెల్లిస్తుంది తప్ప, మున్సిపాలిటీలో ఉన్న నిధులు ఖర్చు చేయడానికి వీళ్లేదు. అలాగే మున్సిపాలిటీలో వాహనాలు నడపడానికి డీజిల్, కరెంట్ బిల్లులు వంటివాటి కోసం సీఎఫఎంఎస్‌కు బిల్లులు అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఇవేవీ జరిగే పనులు కావని, మున్సిపాలిటీ వసూలు చేస్తున్న షాపు అద్దెల కోసం ఓ ప్రత్యేక అకౌంట్‌ను ఓపెన్ చేశారు. అందులో పడిన అద్దెలను అభివద్ధి పనులకు వాడేస్తున్నారు. ఇప్ప్పుడు దీనిమీదే శ్రీకాకుళం కమిషనర్‌కు మెమో అందింది. ఒక పక్క ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్న ఒత్తిడి, మరోవైపు పాలకవర్గం లేకపోవడం, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కొత్త అకౌంట్ తెరిచి బిల్లులు చెల్లించాల్సిరావడం కమిషనర్ దుర్గాప్రసాద్‌కు తలనొప్పిగా మారింది. దీంతో ఆయన కొత్త పోస్టింగ్ ఇచ్చేవరకు ఆగకుండానే రిలీవ్ అయిపోయారు. ఇప్ప్పుడు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఉన్న డీఈ కమలాకర్ దీనికి సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి తమ నిధులు తాము వాడుకోకుండా పే అండ్ అకౌంట్స్‌తో ముడిపెట్టడమేమిటంటూ చాలామంది కమిషనర్లు కొద్ది నెలల క్రితం జరిగిన సీడీఎంఏ వీడియో కాన్ఫరెన్స్‌లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో కూడా స్టేట్ ఆడిట్, సెంట్రల్ ఆడిట్ జరుగుతాయని, బిల్లుల చెల్లింపులో అభ్యంతరాలు ఉంటే వారు చూస్తూ ఊరుకోరని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా సీఎఫఎంఎస్, పే అండ్ అకౌంట్స్‌తో తమకు ముడిపెట్టడం సరికాదని వాదించారు. దీనిపై ప్రభుత్వం నిబంధనలు సడలించాలని భావించే లోపే 16 మున్సిపాలిటీలకు షోకాజ్ నోటీసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ వరకు రూ.4.50 కోట్లు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వాడినట్లు తేలింది. దీనిపై కమిషనర్ ఏం సమాధానమిస్తారో చూడాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page