మాదే ప్రభుత్వం.. మేమే ప్రజాపక్షం!
- BAGADI NARAYANARAO

- Nov 5, 2025
- 3 min read
డీఆర్సీ సమావేశంలో అధికారులను నిలదీసిన ఎమ్మెల్యేలు
వ్యవసాయ అధికారులపై విరుచుకుపడిన కూన
సుఖీభవ, ఎరువుల పంపిణీలో లోపాలపై నిలదీత
మత్స్యకారులకు పరిహారం అందలేదని ఎమ్మెల్యే అశోక్ ఆక్షేపణ
అధికార పార్టీకి చెందినా సమస్యల ప్రస్తావనలో వెనుకంజ లేదని స్పష్టీకరణ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
స్వపక్షమే విపక్షంగా మారింది. ప్రజాసమస్యలను ప్రస్తావించడంలో, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమల్లో లోపాలను ఎత్తిచూపి ప్రజల పక్షాన నిలవడంలో ముందుంటామని సభ్యులు నిరూపించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి (డీఆర్‌సీ) సమావేశంలో వ్యవసాయం, ఎరువుల పంపిణీ, రైతులకు సాయం, తదితర సమస్యలపై జిల్లా యంత్రాంగాన్ని సభ్యులు నిలదీశారు. ముఖ్యంగా ప్రభుత్వ మాజీ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పలు అంశాలకు సంబంధించి అధికార యంత్రాంగాన్ని కడిగిపారేశారు. ఎన్నికల హామీ అయిన సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తుంటే జిల్లాస్థాయిలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమవుతోందని, అనేక లోపాలు కనిపిస్తున్నా, పథకాలు అందడంలేదని ఫిర్యాదులు అందుతున్నా జిల్లా యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోందని కూన రవికుమార్ తదితరులు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కింజరాపు అచ్చెన్నాయుడుల సమక్షంలోనే అధికారులను గట్టిగా నిలదీశారు. ఈ`క్రాప్ నమోదు, మొంథా తుపాను పరిహారానికి ఆస్తి నష్టం వివరాల సేకరణ సక్రమంగా జరగడంలేదని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. కానీ ఆయా శాఖల అధికారులు కాకి లెక్కలు చూపించి మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. అధికారుల తప్పిదాల వల్ల ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
46వేల మందికి అందని సుఖీభవ
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ నగదు సాయాన్ని జిల్లాలో 46వేల మంది రైతుల ఖాతాల్లో ఇంతవరకు జమ కాలేదని దీనికి ఎవరు బాధ్యులని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. ఖరీఫ్‌లో ఎరువుల కొరత నెలకొనడానికి కూడా వ్యవసాయ శాఖ అధికారులే కారణమని విమర్శించారు. దమ్ములకు రైతులు వినియోగించే పొటాష్‌కు ఈ ఏడాది ఎందుకు ఇండెంట్ పెట్టలేదని ఆయన నిలదీశారు. అయితే తాము ఇండెంట్ పెట్టినా ఉన్నతాధికారులు స్టాక్ పంపించలేదని అధికారులు సమాధానం చెప్పడంతో కూన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అమరావతిలో జరిగిన పీయూసీ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ఏడాది పొటాష్ ఇండెంట్ రానేలేదని అక్కడి ఉన్నతాధికారులు చెప్పిన విషయాన్ని కూన ప్రస్తావించారు. దీంతో మాటమార్చిన జిల్లా అధికారులు గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాకు వచ్చిన పొటాష్‌ను రైతులెవరూ తీసుకోలేదని, అందువల్ల ఈ ఏడాది ఇండెంట్ పెట్టలేదని చెప్పారు. దీనిపై స్పందిస్తూ వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్న మాటలు, చూపుతున్న లెక్కలను నమ్మవద్దని ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి కూన రవి సూచించారు.
ఈ`క్రాప్ నమోదులో అలసత్వం
60 శాతానికి మించి రైతులు ఈ`క్రాప్ నమోదు జరగలేదని, దీనిపైనా అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు. ఈ`క్రాప్‌లో నమోదు కాని రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదన్న విషయాన్ని ప్రచారం చేసి అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని రవికుమార్ విమర్శించారు. మొంథా తుపాను వల్ల వాటిల్లిన పంట నష్టాలను గుర్తించి సేకరించడంలో వ్యవసాయ శాఖ అలసత్వం ప్రదర్శించిందని కూన విమర్శించారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ మాట్లాడుతూ మొంథా తుపాను వల్ల నిరాశ్రయులైన మత్స్యకారులను గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. తుపాను సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న మత్స్యకారులకు ప్రకటించిన రూ.3వేల పరిహారాన్ని ఇంతవరకు ఎందుకు పంపిణీ చేయలేదని మత్స్యశాఖ అధికారులను నిలదీశారు. సముద్రంలో వేటకు వెళ్లేవారికే ఇచ్చి, మిగతావారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తీర ప్రాంతాల్లో ఉపాధిహమీ పథకంలో సీసీ రోడ్లు వేయడానికి సామాజిక అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారని, దీనికి ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం చూపించాలని మంత్రులను కోరారు. గత ప్రభుత్వం ఉపాధి హమీ పథకంలో పనిచేసే ఉద్యోగులను కక్షపూరితంగా తొలగించిందని, తొలగించినవారిని విధుల్లోకి తీసుకోవాలని అధికారులకు విన్నవిస్తున్నా ఎందుకు తీసుకోవడం లేదని ఆ శాఖ అధికారులను కూన రవి ప్రశ్నించారు. ఫౌజ్ కోటాలో ఇచ్చే సామాజిక పింఛన్లు కొందిరికే ఇస్తున్నారని, అందరికీ అందడం లేదని, దీనిపై మంత్రులు పునరాలోచన చేయాలని కూన రవికుమార్ కోరారు.
వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సమాచారం ఇస్తున్నారని, దీనివల్ల ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని కూన రవికుమార్ మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఇన్‌ఛార్జి మంత్రి శ్రీనివాసరావు స్పందిస్తూ దీన్ని సాగదీయవద్దని, మిగతా శాఖలపైనా సమీక్షించాల్సి ఉందన్నారు. దీనిపై కూన రవికుమార్ స్పందిస్తూ డీఆర్‌సీకి ఒక ప్రత్యేకత ఉందని, ఎంత సమయమైనా సమీక్ష జరుపుకొనే వెసులుబాటు ఉందిన గుర్తు చేశారు. ఇన్‌చార్జీ మంత్రి శ్రీనివాసరావు సమాధానం ఇస్తూ ఖరీఫ్‌కు ముందే వ్యవసాయశాఖపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి తగిన సూచనలు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కచ్చితంగా జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. మొంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పంట పరిహారం ప్రభుత్వం నుంచి త్వరితగతిన వచ్చేలా చూడాలని మంత్రులను కోరారు. తుపాను వల్ల రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి పనుల పురోగతి, నిధుల వినియోగం, జిల్లాలో పెండిరగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై కూన రవికుమార్ సమావేశంలో ప్రస్తావించారు. సమావేశంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు ఎన్.ఈశ్వరరావు, గొండు శంకర్, గౌతు శిరీష, బొగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










Comments