top of page

మోదీ ‘పసిడి’ పలుకు ఫలిస్తుందా?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 20
  • 2 min read

భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోళ్ల జోలికి పోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు పిలుపునివ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు అప్పటి ప్రధానులు కూడా ఈ తరహాలోనే స్పందించారు. ముఖ్యంగా 1965లో ఇండో`పాక్ యుద్ధం, తీవ్ర కరువు పరిస్థితుల్లో సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి దేశప్రజల సహకారం కోరారు. బంగారం, వెండి, నగదు విరాళాలు కోరడంతోపాటు అవసరమైతే ఒకపూట భోజనం మాని ఆ డబ్బులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దానికి దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. దేశంలో అత్యంత సంపన్న నవాబుగా పేరొందిన హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏకంగా ఐదు టన్నులు అంటే ఐదువేల కేజీల బంగారాన్ని దేశఖజానాకు విరాళంగా ఇచ్చారు. అలాగే రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ ప్రజలు 56.8 కేజీల బంగారాన్ని సేకరించి సమర్పించారు. అప్పట్లో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెనుభారంగా మారుతున్న దిగుమతుల బిల్లును తగ్గించుకునే చర్యల్లో భాగంగానే బంగారం కొనుగోళ్లు జరపవద్దని పిలుపునిచ్చిన మోదీ ప్రభుత్వం.. దిగుమతి సుంకాన్ని కూడా ఒకేసారి 6 నుంచి 15 శాతానికి పెంచేసింది. గతంలో మాదిరిగా ప్రధాని పిలుపునకు దేశప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారా? బంగారం కొనుగోళ్లు తగ్గించుకుంటున్నారా?? ఆ మేరకు దిగుమతులు తగ్గుతున్నాయా??? అన్న ఆసక్తి రేకెత్తడం సహజం. ఎందుకంటే.. భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది.. శతాబ్దాలుగా పెనువేసుకున్నది. ఆ అనుబంధాన్ని.. ఆ మోజును తాత్కాలికంగానైనా వదులుకోవడానికి గానీ.. తగ్గించుకోవడానికి గానీ భారతీయులకు మనస్కరిస్తుందా అన్న అనుమానాలు కలగడం సహజం. సరిగ్గా ఈ కోణంలోనే దేశవ్యాప్తంగా జరిపిన ఒక అధ్యయనం పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. సాధారణంగా బంగారం ఎక్కువగా కొనుగోలు చేసే భారతీయుల్లో సుమారు 61 శాతం మంది ప్రధాని మోదీ పిలుపునకు సానుకూలంగా స్పందించారు. ఏడాది పాటు బంగారం కొనుగోలుకు దూరంగా ఉంటామని చెప్పారు. అయితే దీని ప్రభావంతో బంగారం లావాదేవీలు, దిగుమతులు తగ్గుతున్న సూచనలు మాత్రం ఇప్పటివరకు కనిపించడంలేదు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ముందువరుసలో ఉంటుంది. కానీ మన వినియోగానికి సరిపడినంతగా దేశంలో ఉత్పత్తి లేకపోవడంతో ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్నది. ఏటేటా పెరుగుతూ పోతున్న దిగుమతుల భారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 72 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పెరుగుతున్న దిగుమతులు మనదేశ అంతర్జాతీయ వాణిజ్యం, విదేశీమారక నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొన్న సమయాల్లో ఇది మరింత సమస్యాత్మకంగా మారింది. సాధారణంగా పండుగలు, వివాహాల సీజన్లలో బంగారం వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇది భారత కరెన్సీ (రూపాయి) విలువను, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల వైఖరిపై జరిపిన సర్వేలో భిన్నమైన స్పందనలు వ్యక్తమయ్యాయి. ప్రధాని పిలుపు మేరకు ప్రస్తుతానికి బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవడానికి అంగీకరించినప్పటికీ.. వారిలో చాలా మంది ఆర్థికంగా, సాంస్కృతికంగా బంగారం తమకు ఎంతో అవసరమని భావిస్తున్నారు. కొందరు కొనుగోలుదారులు పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాల కోసమే బంగారం కొంటామని పేర్కొనగా, మరికొందరు ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ఉన్నప్పటికీ దీర్ఘకాల పెట్టుబడికి బంగారమే అత్యంత సురక్షితమైన మార్గం, సాధనమని నొక్కి చెప్పారు. భారతీయ కుటుంబాల్లో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గతంలో దీన్ని హాదాకు చిహ్నంగా, పొదుపు సాధనంగా, సాంస్కృతిక వారసత్వంగానే భావించేవారు. కానీ ఈమధ్య కాలంలో పెట్టుబడి సాధనంగా కూడా ఎక్కువమంది పరిగణిస్తున్నారు. మనదేశంలో పండుగలు, వివాహ సంప్రదాయాలతో బంగారానికి ప్రత్యేక అనుబంధం ఉన్నందున, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం అంత సులభసాధ్యం కాదని భావిస్తున్నారు. అయినప్పటికీ నిరంతరం పెరుగుతున్న బంగారం ధరలు, మార్కెట్ అస్థిరత మరియు ప్రభుత్వం నిర్వహించే అవగాహన కార్యక్రమాల వల్ల యువ కొనుగోలుదారులు మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు వంటి ఇతర పెట్టుబడి మార్గాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి కారణాలతో అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ధరలు విపరీతంగా పెరుగుదల కారణంగా సహజంగానే చాలా మధ్యతరగతి కుటుంబాలు ఆభరణాల కొనుగోలు విషయంలో వెనుకంజ వేస్తాయి. అర్జంట్ కాకపోతే కొనుగోళ్లను వాయిదా వేసుకోవడానికే మొగ్గు చూపుతారని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఆర్థిక అస్థిరత నెలకొన్న సమయాల్లో విదేశీమారక నిల్వలను స్థిరంగా ఉంచుకోవాలంటే బంగారం దిగుమతులు తగ్గించుకోవడమే మార్గమని అంటున్నారు. మొత్తం మీద బంగారం కొనుగోళ్లపై మోదీ పిలుపు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. చాలా మంది మోదీ ఆర్థిక వ్యూహాన్ని, పిలుపును అభినందిస్తుండగా.. కొందరు మాత్రం భారతీయులకు బంగారంతో ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. సంక్షోభ సమయాల్లో భారతీయ కుటుంబాలను సంప్రదాయకంగా దాచుకునే బంగారమే ఆదుకుంటుందని, అందువల్ల కొనుగోళ్లను పూర్తిగా ఆపడం అసాధ్యమంటున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page