ముందు వరద గట్టు.. తర్వాత కనికట్టు.. మొత్తం కోనేరు హాంఫట్!
- BAGADI NARAYANARAO

- Oct 29, 2025
- 2 min read
అక్రమార్కుల దెబ్బకు కోనేరు మొత్తం మాయం
అందులో కొంతభాగంలోనే వరదగట్టు నిర్మాణం
రికార్డుల్లో పూర్తిగా వరదగట్టుగా మార్పించిన ఘనులు
మిగతా భూమిని వాటాలు వేసుకుని, అమ్మకాలు
సర్వే చేసి నిజాల నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే ఆదేశాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఒకప్పుడు అక్కడ కోనేరు ఉండేది. తర్వాత ప్రజావసరాల కోసం ప్రభుత్వమే అందులో కొంతభాగాన్ని వరద గట్టుగా మార్చింది. అదే అదనుగా పెద్దల రూపంలో గెద్దలు మిగతా కోనేరు భూమిని రికార్డుల కనికట్టుతో హాంఫట్ చేసేశాయి. ఎస్‌ఎల్‌ఆర్ ప్రకారం ప్రస్తుతం నగర పరిధిలోని బలగ రెవెన్యూ సర్వే నెంబర్ 1/4లో వరద గట్టు ఉంది. మరోవైపు వన్ బీ అడంగల్‌లో ఆ భూమి ఇప్పటికీ కోనేరుగానే నమోదై ఉంది. ఈ రికార్డులను ఆ తర్వాత కాలంలో మార్చేశారు. నాగావళి నది మలుపు తిరిగే క్రమంలో దాని వరద శ్రీకాకుళం పట్టణాన్ని ముంచెత్తకుండా గతంలో కోనేరు మధ్య నుంచి వరదగట్టు నిర్మించారు. కోనేరులో కొంత భాగాన్నే వరద గట్టుగా మార్చగా.. మిగిలినది కోనేరుగానే ఉండేది. కానీ తర్వాత కాలంలో బలగలో పెద్ద మనుషులుగా చెలమణీ అవుతున్న కొందరు పెద్దలు దాన్ని మాయం చేసేశారని తెలిసింది. ఆ మేరకు ఎస్‌ఎల్‌ఆర్‌లో రెండు దశాబ్దాల క్రితమే దిద్దుబాటు చేయించి కోనేరు (వరదగట్టు) విస్తీర్ణం 1.05 ఎకరాలుగా చూపించారు. రీ సర్వే తర్వాత దాన్ని 99 సెంట్లుగా చూపిస్తున్నారు. వాస్తవానికి 1958నాటి రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెం. 1/4లో ఉన్న కోనేరు అసలు విస్తీర్ణం 1.69 ఎకరాలుగా నమోదై ఉంది. దీన్ని బలగకు చెందిన పెద్దమనుషులు రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురిచేసి 64 సెంట్లు తగ్గించి 1.05 ఎకరాలుగా దిద్దుబాటు చేయించారు. పాత సర్వే నెంబర్ 495/7, 496లో 2/1 కలిపి పోరంబోకుగా కొత్త సర్వే నెంబర్`1ని కేటాయించారు. దాన్ని సబ్ డివిజన్ చేసి 1/4ను 1.69 ఎకరాల విస్తీర్ణంగా ఎస్‌ఎల్‌ఆర్‌లో చూపించారు. తర్వాత కాలంలో దీన్ని ఆక్రమణదారులు ఎస్‌ఎల్‌ఆర్‌లో దిద్దుబాట్ల ద్వారా 1.05గా మార్చేశారు. ఇక 2022లో నిర్వహించిన రీసర్వేలో ఏకంగా వరదగట్టు ప్రస్తావనే లేకుండా అధికారులను మేనేజ్ చేసేశారు. బలగ పాత సర్వే నెంబర్ 495, 496లోని భూముల మొత్తం విస్తీర్ణం 3.32 ఎకరాలు. వీటిని సబ్ డివిజన్ చేసి ఐదు సర్వే నెంబర్లలో సర్దుబాటు చేశారు. ఎస్‌ఎల్‌ఆర్‌లో చేయించిన దిద్దుబాట్లకు అనుగుణంగా వరదగట్టును ఆక్రమించి కంచె వేశారు.
రీసర్వే సమయంలో తెరపైకి
శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డు విస్తీర్ణానికి అవసరమైన భూమిని ఆర్ అండ్ బీ, రెవెన్యూ అధికారులు వరదగట్టు వైపు సేకరించే సమయంలో ఆక్రమణదారులు తెరపైకి వచ్చి ఆ భూమి తమ పూర్వీకులకు చెందినదని, దానిపై సాగు హక్కులు ఉన్నాయని వాదించడం ప్రారంభించారు. కానీ హక్కు పత్రాలు చూపించకపోవడంతో అప్పటి కలెక్టర్ 2023లోనే వారి వాదనలను తిరస్కరించారు. ఆ సమయంలోనే ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తుండటాన్ని ఆసరా చేసుకుని బలగ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 1లోని 4, 5 సబ్ డివిజన్లలో ఉన్న కోనేరు, వివాదాస్పద భూములకు ఎల్‌పీఎం నెంబర్లు కేటాయించారు. రీసర్వే తర్వాతే వందేళ్లుగా కనిపించని భూ యజమానులు కొత్తగా పుట్టుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారంపేట వద్ద ఆమదాలవలస`శ్రీకాకుళం రోడ్డుకు ఆనుకుని ఉన్న నాగావళి వరద గట్టు సర్వే నెంబర్ 1/4లో 1.69కి బదులుగా 1.05 ఎకరాలుగా రికార్డుల్లో నమోదైంది. అలాగే సర్వే నెంబర్ 1/5లో ఉన్న 74 సెంట్లను జిరాయితీగా చూపించారు. కానీ ప్రస్తుతం 1/5లో 2.10 ఎకారాలకు పైగా భూమి ఉంది. దిద్దుబాటు చేసిన రికార్డుల ప్రకారం 1/4లో 1.05 ఎకరాలు చూపించి సర్వే నెంబర్ 1/5లో 74 సెంట్లే ఉండాల్సిన చోట 1/54లోని కొంత, వరద గట్టును తవ్వి కొంత భూమి కలిపేశారు. రికార్డుల్లో మాత్రం 74 సెంట్లుగానే చూపిస్తున్నారు. నలుగురు ఆక్రమణదారులు సర్వే నెం. 1/5లో వాటాలు వేసుకుని కబ్జా చేసిన భూమి విస్తీర్ణం సుమారు 1.70 సెంట్లు. అందులో ఒక ఆర్మీ ఉద్యోగికి ఐదు సెంట్లు, ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక టీచర్‌కు చెరో 5 సెంట్లు చొప్పున విక్రయించి హద్దులు ఏర్పాటు చేశారు. ఇలా ప్రభుత్వ భూమిని ఆక్రమణదారులు సొంత ఆస్తిగా మార్చుకొని ప్రసాదాలు పంచినట్టు పంచుకున్నారు.
ఎమ్మెల్యే దృష్టికి వివాదం
ఆదివారంపేటకు చెందిన బోనెల చిరంజీవి గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదాన్ని స్థానికులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దాన్ని ప్రభుత్వ స్థలంగా నిర్ధారిస్తే ప్రజావసరాల కోసం వినియోగిస్తామని ఆయన వారికి హమీ ఇచ్చినట్టు తెలిసింది. సర్వే నెం. 1/4లోని వరద గట్టును, సర్వే నెం.1/5లో ఉన్న భూమిని సర్వే చేసి ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించినట్టు తెలిసింది. సర్వే చేస్తే ఎంత భూమి ఆక్రమణలపాలైందో బయటపడుతుందని స్థానికులు చెబుతున్నారు. వాస్తవంగా వరదగట్టు నిర్మాణానికి ముందు ఆ ప్రాంతంలో కోనేరు, దానికి ఆనుకుని నడకదారి కూడా ఉండేదని స్థానికుల కథనం. కాలక్రమంలో అదే శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డుగా రూపాంతరం చెందినట్టు బలగ ప్రాంత వృద్ధులు చెబుతున్నారు.










Comments