top of page

మోదీ స్ఫూర్తికి చంద్రబాబు తూట్లు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 14 hours ago
  • 2 min read
  • మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు

  • నేరుగా ప్రధానికే లిఖితపూర్వక ఫిర్యాదు

  • ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీ భూసంస్కరణలకు ఊతం

  • ఆ చట్టాన్నే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా చంద్రబాబు నేతత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తికి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని మాజీ రెవెన్యూమంత్రి, వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. మనదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నిర్దేశిస్తున్న ప్రణాళికలు, ఆలోచనలను సాకారం చేయడానికి దోహదం చేసే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని గతంలో తమ వైకాపా ప్రభుత్వం అమల్లోకి తెస్తే.. ఇప్పుడే రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వమే దాన్ని రద్దు చేయడం విచారకరమన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానికి ధర్మాన రాసిన లేఖ వివరాలు పాఠకులకు యథాతథంగా..

‘గౌరవనీయ శ్రీ ప్రధానమంత్రి గారికి నమస్కారములు.. భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అన్న శ్లోకాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మీరు చేపట్టిన పాలన చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుంది. మీరు ప్రపంచస్థాయి నాయకుడిగా ప్రవర్ధమానం కావడం ఈ దేశానికి ఎంతో గర్వకారణం. భారతదేశాన్ని ప్రపంచంలో 30 ట్రిలియన్ డాలర్లతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా మీరు ప్రారంభించిన ఆత్మనిర్భర్, వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక పథకాలు ప్రజలకు వరంగా నిలుస్తున్నాయి. ‘ఫస్ట్ డెవలప్ ఇండియా(ఎఫ్‌డీఐ)’ని మీరు సృజనాత్మకంగా పునర్నిర్మించడం మనదేశంలో పెట్టుబడులపై మీ దూరదృష్టిని ప్రతిబింబిస్తుంది. ఈ లక్ష్యసాధన దిశగా 2020 ఏప్రిల్ 24న ‘స్వామిత్వ’ గ్రామాల సర్వే, గ్రామ ప్రాంతాల్లో భూముల సాంకేతిక మ్యాపింగ్ అనే చారిత్రక కార్యక్రమం రూ.566.23 కోట్ల బడ్జెట్‌తో, 1.61 లక్షల గ్రామాల్లో రూ.2.42 కోట్ల ఆస్తి కార్డుల పంపిణీ, 3.20 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాకుండా జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ మరియు మోడ్రనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా మీరు ‘భూమి’ అనే రాష్ట్ర జాబితాలోని అంశంపై చేసిన కృషి గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. భూ రికార్డులను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతో ఉంది. దేశీయ, విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించడానికి వివాదాల శాతం తగ్గించవలసిన అవసరముందని గుర్తించి కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్‌తో కలిసి ముసాయిదా చట్టం తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది. ప్రస్తుతం ఉన్న భావనాత్మక హక్కు స్థానంలో నిర్ధారిత హక్కు వ్యవస్థను తీసుకురావడానికి రాష్ట్రాలను ప్రోత్సహించింది. భూ సంబంధిత సమస్యలను, తగువులను పరిష్కరించి మన దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి, పౌరుల మధ్య వివాదరహిత సామరస్యాన్ని పెంపొందించడానికి ఈ చర్యలు మీ ప్రభుత్వం చేపట్టింది. మీ ప్రభుత్వ లక్ష్యాలు, దార్శనికతకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ని (యాక్ట్ నెం.27 ఆఫ్ 2023) 31.10.2023న అమలులోకి తీసుకువచ్చింది. అయితే 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వారు నిర్వహించిన సర్వేలో మన దేశం 154వ స్థానంలో ఉందనే సత్యాన్ని, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు ఇటువంటి ప్రగతిశీల చట్టం యొక్క అవసరాన్ని విస్మరిస్తూ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని రద్దు చేసింది. ప్రస్తుతానికి దేశంలో 12 రాష్ట్రాలు మాత్రమే నీతి అయోగ్ సూచించిన ఈ ముసాయిదా బిల్లును చట్టంగా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కానీ అన్ని రాష్ట్రాలు ఈ ముసాయిదా బిల్లును చట్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆస్తి యాజమాన్య హక్కుకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చే విధానంలో కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ప్రతిపాదించిన ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నేను సగౌరవంగా చేసే విన్నపం ఏమిటంటే.. ఈ విషయంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ చట్టం అమలును సమీక్షించాలని, లేదా ఈ అంశాన్ని చర్చించడానికి సంబంధిత వ్యవస్థలను ఆదేశించాలని కోరుతున్నాను. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించే క్రమంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలని రాష్ట్రాలకు సూచించాలని కోరుతున్నాను. అంతర్జాతీయ మేటి రాజనీతిజ్ఞునిగా రూపొందుతున్న మన దేశ ప్రధానమంత్రి గారికి సహకరించడం అంటే ఈ చట్టం అమలు చేయడమే!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page