top of page

మొన్న ప్రభుత్వ భూమి.. నేడదే జిరాయితీ!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 4 days ago
  • 2 min read
  • రీసర్వేలో ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టేస్తున్న రెవెన్యూ

  • ప్రభుత్వ పాఠశాల విస్తీర్ణం ప్రైవేటుకు ధారాదత్తం

  • ప్రభుత్వం సేకరించిన భూమి మధ్యలో జిరాయితీ ఉందంటున్న యంత్రాంగం

  • ఫిర్యాదు పరిష్కారానికి 105 రోజులు గడువు


    ree

    (సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ప్రభుత్వ భూమి రోజుల వ్యవధిలో జిరాయితీగా మారిపోయింది. జులై 7 నాటికి ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైవుంటే ఆతర్వాత రోజు జిరాయితీగా మారిపోయింది. ఈ ఉదాహరణ రెవెన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది అక్రమాలకు శాంపిల్‌ మాత్రమే. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన కాలనీలో జిరాయితీ భూమి ఉందని రెవెన్యూ అధికారులు చెప్పడంపై గార మండలం కళింగపట్నం మత్స్యలేశం (కె.మత్స్యలేశం) ఎన్టీఆర్‌ కాలనీవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నా, భూమి స్వభావాన్ని రీసర్వేలో జిరాయితీగా మార్చి కట్టబెట్టేశారు. దీనిపై కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారానికి 105 రోజులు గడువు ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల ప్రాప్తికి సర్వే నెం`211/6 (రీసర్వే ఎల్పీఎం నెంబర్‌ 1036)లో ప్రభుత్వ భూమి 1.56 ఎకరాలుగా నమోదై ఉంది. దీన్ని రీసర్వే తర్వాత గ్రామానికి చెందిన తయ్య సుభద్రమ్మ పేరుతో జిరాయితీగా మార్చి విస్తీర్ణాన్ని 1.82 ఎకరాలుగా నమోదు చేశారు. వాస్తవంగా తయ్య సుభద్రమ్మ మృతిచెంది దశాబ్ధం అయింది. సుభద్రమ్మకు వారసత్వంగా వచ్చినట్టు చూపించి ఆమె వారసులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిసింది. సర్వే నెం`211/8 (ఎల్పీఎం నెంబర్‌ 1037)లో 1.75 సెంట్లు జిరాయితీ భూమి ఉంది. ఈ సర్వే నెంబర్‌లో తయ్య సుభద్రమ్మ పేరున 29 సెంట్లు, రాజారావు పేరున 38 సెంట్లు, తయ్య మేరీ పేరున 33 సెంట్లు, ఎంపీయూపీ మోడల్‌ స్కూల్‌ పేరున 50 సెంట్లు, ఎవరికి చెందని భూమి 25 సెంట్లుగా రికార్డు చేశారు.

రీసర్వే తర్వాత ఈ సర్వే నెంబర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాల విస్తీర్ణం 50 సెంట్లు నుంచి 30 సెంట్లకు కుదించి ప్రత్యేకంగా ఒక ఎల్పీఎంను ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలను మినహాయించిన తర్వాత సర్వే నెంబర్‌ 211/8లో 1.75 ఎకరాలకు గాను విస్తీర్ణంను 2.06 ఎకరాలకు పెంచి రెవెన్యూ అధికారులు వన్‌బీలో చూపించారు. అదనంగా వన్‌బీలో నమోదు చేసిన భూమిని తయ్య దమయంతి, సుభద్రమ్మ, మేరీ, రాంబాబు, దాసరి సరస్వతి పేర్లతో ఒక్కొక్కరికీ 2.06 ఎకరాలు వారసత్వంగా దఖలుపడినట్టు నమోదు చేశారు. సర్వే నెంబర్‌ 210, 211/6 లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో అనేక కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ నివాసాలకు రహదారి సౌకర్యం లేకుండా రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి యంత్రాల సాయంతో చదును చేసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని గార తహసీల్దారుకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని స్థానికుడు బొంది రమణారావు చెబుతున్నారు. దీంతో కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మండల రెవెన్యూ అధికారులు, కె.మత్స్యలేశం సచివాలయం సర్వేయర్‌ అక్రమాలకు పాల్పడినట్టు కాలనీవాసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం రెవెన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమాలను సక్రమం చేసుకోవడానికి రీసర్వేను అవకాశంగా తీసుకొని అవకతవకలకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. అవకతవకలపై విచారణ జరిపి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఈ రెండు సర్వే నెంబర్లతో పాటు మిగతా సర్వే నెంబర్లలోనూ ఇదే పద్ధతిలో ప్రభుత్వ భూమిని రీసర్వేలో జిరాయితీగా మార్చేశారని కె.మత్స్యలేశం గ్రామస్తులు చెబుతున్నారు. జాయింట్‌ ఎల్పీఎంలు ఇచ్చి కొందరిని నట్టేట ముంచారని, భూవిస్తీర్ణం తక్కువ చూపించి వేరొకరి ఖాతాలో మిగతా భూమిని చేర్చారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. గ్రామం పరిధిలో చేపట్టిన రీసర్వేలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో బొంది రమణారావు కోరారు.



Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page