top of page

మౌన ముని మహాభినిష్క్రమణ

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 27, 2024
  • 2 min read

నిజానికి తను పొలిటిషియన్‌ కాదు.. ఆర్థిక రథాన్ని ఎలా నడపాలో బాగా తెలిసిన సారథి.. ప్రణాళికవేత్త.. అన్నింటికీ మించి పదే పదే ప్రశంసించదగిన సుగుణం. అవినీతి, అక్రమాలతో కుళ్లిన వర్తమాన రాజకీయ వ్యవస్థలోనే దశాబ్దాల పాటు కీలక స్థానాల్లో ఉన్నా సరే, ఏదీ అంటకుండా నిష్కళంకుడిగా బతికిన స్వచ్ఛుడు. తన ఆర్థిక విధానాలను, తన పాలన విధానాలను తీవ్రంగా వ్యతి రేకించే వ్యక్తులు, పార్టీలు కూడా ఆయన్ని ఎప్పుడూ అవినీతిపరుడిగా విమర్శలకు పోలేదు. తను ప్రధానిగా ఉన్న పదేళ్ల యూపీఏ పాలనలో బోలెడు అక్రమాలు, అవినీతి భాగోతాలు.. అది వైఫల్యం కాదా అనేవాళ్లూ ఉంటారు. తను నిస్సహాయుడు, యూపీఏ హయాంలో కాంగ్రెస్‌, దాని భాగస్వామ్య పక్షాల నిర్వాకాలకు తను మౌనసాక్షి మాత్రమే. మొత్తం తన జీవితచరిత్రలో బాగా నచ్చేది ఈ స్వచ్ఛతే. స్టేట్స్‌మన్‌ అనే పదానికి ఓ ఐకన్‌ తను. ఎక్కడా ఒక్క పదం కూడా తూలడు.. వ్యర్థ ప్రసం గాలు ఉండవు.. అమర్యాద, కుసంస్కారం, బంధుప్రీతి వంటివేమీ లేని టవరింగ్‌ పర్సనాలిటీ. అందుకే 92 ఏళ్ల జీవితం మకిలిపట్టలేదు. 2జీ కుంభకోణంలో భ్రష్టుపట్టిన మాజీ కేంద్ర మంత్రి రాజా ఓసారి తమ నిర్ణయాలన్నీ ప్రధానితో సంప్రదించాక తీసుకున్నవే అని ఆరోపించాడు. మన్మో హన్‌ సింగ్‌కు బురద పూసి, తమపై ఆరోపణల తీవ్రత తగ్గించుకునే మూర్ఖపు ఎత్తుగడ. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ మన్మోహన్‌ సింగ్‌ తప్పు వీసమెత్తు లేదని క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఇంకేదో ఇష్యూలో అప్పటి ప్రధాని కార్యాలయ అధికారులను సైతం సీబీఐ ప్రశ్నించింది. ఎక్కడా ఎవ్వరూ మన్మోహన్‌ మీద అణువంత అవినీతి మరకను కూడా చూపలేకపోయారు. తను రాజకీయ పదవులు అధిరో హించిన ఓ హైలెవల్‌ బ్యూరోక్రాట్‌. అదీ సింపుల్‌గా మన్మోహన్‌ సింగ్‌. కంట్రాస్టు ఏమిటంటే..? మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ దగ్గర తను ఆర్థిక వ్యవహారాల సలహాదారు. ఆ కాలంలోనే మన ఆర్థిక వ్యవస్థ పాతాళంలోకి పడిపోయి, మన బంగారాన్ని కుదువపెట్టాల్సి వచ్చింది. తను చెప్పినా వినిపిం చుకునేవారెవరు నాటి పాలన వ్యవస్థలో? అదే మన్మోహన్‌ సింగ్‌ తిరిగి అదే బంగారాన్ని విముక్తం చేయడానికి, దేశ ఆర్థిక రథాన్ని గాడిన పడేయటానికి అహర్నిశలూ కష్టపడ్డాడు. అదీ తన తత్వం. పాలసీ డెసిషన్స్‌ తీసుకునేవాళ్లను బట్టి తన పనితీరు. అంతే.. నిజానికి పీవీ తనను వెలుగులోకి తీసుకొచ్చాడు అంటారు కానీ కాదు. మినిస్ట్రీ ఆఫ్‌ పారిన్‌ ట్రేడ్‌ లలిత్‌ నారాయణ్‌ మిశ్రా తనను సలహాదారుగా తీసుకున్నాడు. అప్పటి నుంచే తను ఆర్బీఐ, ప్లానింగ్‌ కమిషన్‌ దాకా బోలెడు బాధ్యతలు నిర్వర్తించాడు. అంతకుముందు సీనియర్‌ లెక్చరర్‌, రీడర్‌, ఐక్యరాజ్యసమితికి కూడా వర్క్‌ చేశాడు తను. కాకపోతే పీవీ నరసింహారావు ఏకంగా తనను ఆర్థికమంత్రిగా తీసుకుని, కావల్సిన స్వేచ్ఛ ఇచ్చారు. మన్మోహన్‌ విధానాల్ని తను ప్రధానిగా డిఫెండ్‌ చేసుకునేవారు. ఆర్థిక సరళీకరణకు రథి పీవీ, సారథి మన్మోహన్‌సింగ్‌. సోనియా ప్రధాని కావాలని భావించినా దేశం యావత్తూ నిరసన చెప్పేసరికి. తను చెప్పినట్టు నడుచుకునే ఓ నాన్‌ కంట్రవర్సీ బ్యూరోక్రాట్‌ ప్రధాని కావాల్సివచ్చాడు ఆమెకు. సో, పేరుకు ప్రధాని తనే. కానీ అసలు ప్రధాని కార్యాలయం టెన్‌ జనపథ్‌..! తన పిల్లలు కూడా ఉన్నత విద్యావంతులు. ఎప్పుడూ ఎవరూ రాజకీయాల వాతావరణంలోకి రాలేదు. వర్తమాన రాజకీయ దుర్లక్షణాల వాసన కూడా సోకనివ్వలేదు. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పనిచేయాలి, దేశా నికి ఏమైనా మంచి చేయాలి. అందుకే పెద్దగా మీడియా ముందుకు కూడా వచ్చేవాడు కాదు. మొత్తానికి భారత దేశ చరిత్రలో మన్మోహన్‌ సింగ్‌ది ఓ విశిష్ట అధ్యాయం..! వెరీ రేర్‌ పర్సనాలిటీ..! దేశానికి రెండో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి కుటుంబం రాజకీయాలకు ఎంత దూరంగా ఉందో, మన్మోహన్‌సింగ్‌ కుటుంబం కూడా అంతే దూరం పాటించింది. శాస్త్రి ప్రధాని అయ్యాక తన కుమా రుడు పని చేస్తున్న కంపెనీ ఆయనకు పదోన్నతి ఇచ్చిందని తెలుసుకున్న లాల్‌బహదూర్‌ ఆ ఉద్యోగా నికి కొడుకు చేత రాజీనామా చేయించారని చదువుకున్నాం. మన్మోహన్‌ ఆర్ధిక మంత్రి అయిన తర్వాత కూడా ఆయన భార్యాబిడ్డలు గోధుమ పిండి కొనుక్కోవడం కోసం ఆటోలో మార్కెట్‌కు వెళ్లే వారని కథనాలు చదివాం. వారసులు లేకుండా బ్రహ్మచారి జీవితం గడిపినవారు ప్రధానులైనా, రాష్ట్ర పతులైనా నిజాయితీగా, నిష్టగా ఉండటం వేరు. కానీ మన్మోహన్‌సింగ్‌, లాల్‌బహదూర్‌ శాస్త్రిలాగా ఓ కుటుంబం ఉండి, వారికీ అభిలాషలు ఉండి నిజాయితీగా ఉండటం గొప్ప.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page