మానవ రక్తంలో మరో అరుదైన గ్రూప్
- DV RAMANA

- Jul 3, 2025
- 3 min read
15 ఏళ్ల పరిశోధన తర్వాత కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు
గ్వాడా నెగిటివ్‌గా నామకరణం.. ఐఎస్‌బీటీ గుర్తింపు
సర్జరీకి వచ్చిన ఓ మహిళలో దీన్ని కనుగొన్న వైద్యులు
ప్రపంచంలో 48వ రక్త గ్రూప్‌గా ప్రకటన

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
మానిషి జీవించడానికి రక్తం అతి కీలకమైనది. శరీరంలో రక్తం తగినంతగా లేకపోయినా.. కలుషితమైనా సదరు వ్యక్తులు తీవ్ర వ్యాధుల ముప్పును ఎదుర్కొంటుంటారు. రక్త లేమిని సూచించేది మొదట ఎనీమియా అనే అవలక్షణం. దీన్ని సకాలంలో గుర్తించి తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి విషమించి.. చివరికి ప్రాణాల మీదకు తెస్తుందని వైద్యులు చెబుతున్నారు. రక్తం చూడటానికి ఎరుపు రంగుతో ఒకేలా ఉన్నా.. అందరి రక్తం ఒకే జాతికి చెందినది కాదు. రక్తంలోని తెల్ల, ఎర్ర రక్త కణాలు, ఇతర ప్రత్యేకతల అధారంగా రక్తన్ని 47 గ్రూపులుగా వర్గీకరించారు. దీని ప్రకారం శస్త్రచికిత్సలు చేసేటప్పుడు, ఎవరికైనా రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు రోగి రక్త గ్రూపు కలిగి ఉన్న వారి నుంచే రక్తం సేకరిస్తారు. లేకపోతే వేరే వారు ఇచ్చిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకులో ఎక్స్ఛేంజ్ చేసి కావలసిన గ్రూపు రక్తం ఇస్తుంటారు. రక్త గ్రూపుల్లో మూడు అరుదైన రకాలుగా గుర్తించిన వైద్య పరిశోధకులు తాజాగా మరో అరుదైన రక్త గ్రూపును కనుగొన్నారు. అదే గ్వాడా నెగిటివ్ గ్రూప్.
15 ఏళ్ల పరిశోధన
సుమారు 15 ఏళ్ల పరిశోధన తర్వాత ఈ అరుదైన కొత్త రక్త గ్రూపును ఫ్రెంచ్ వైద్య పరిశోధకలు గుర్తించారు. కరీబియన్ దీవులకు చెందిన ఓ ఫ్రెంచ్ మహిళలో ఈ కొత్త రకం రక్త వర్గాన్ని కనుగొన్నారు. ఈ బ్లడ్ గ్రూప్‌ను ‘గ్వాడా నెగిటివ్’గా ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెంచ్ బ్లడ్ సప్లై ఏజెన్సీ ప్రకటించింది. ప్రపంచం మొత్తంలో ఈ కొత్త బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తి ఈ మహిళ మాత్రమే. ప్యారీస్‌లో నివసిస్తున్న గ్వాడెలోప్ ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల మహిళ 2011లో ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు సర్జరీ అవసరమని గుర్తించిన వైద్యులు.. దానికి ముందు సాధారణంగా చేసే వైద్య పరీక్షలు చేయించారు. అయితే రక్త పరీక్ష కోసం ఆమె నుంచి సేకరించి రక్త నమూనా అసాధారణంగా కనిపించి వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె శరీరం నుంచి తీసుకున్న శాంపిల్ ఏ బ్లడ్ గ్రూపులతోనూ సరిపోలలేదు. ఆమె రక్తంలో ఉన్న యాంటీ బాడీస్‌ను ఇంతవరకు ఏ రక్త గ్రూపులోనూ గుర్తించలేదని వైద్యులు పేర్కొన్నారు. అసాధారణంగా ఉన్న ఈ బ్లడ్ శాంపిల్‌ను ప్రయోగశాలకు పంపి ఏకంగా ఎనిమిదేళ్ల పాటు పరిశోధనలు జరిపినా ఎలాంటి ఫలితం రాలేదు. ఆ రక్తం ఎలా వర్గీకరించాలో వైద్య నిపుణులకు అర్థం కాలేదు. అయితే 2019లో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత సహాయంతో పట్టు వదలని విక్రమార్కుల్లా మళ్లీ పరిశోధన మళ్లీ ప్రారంభించారు. హై క్వాలిటీ థ్రోపుట్ డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ సహాయంతో మరో ఆరేళ్లు పరిశోధించిన శాస్త్రవేత్తలు ఎట్టకేలాకు ఆ రక్తం అనుపానులు కనుగొన్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రూపులకు అదనంగా దీన్నో కొత్త రక్తం గ్రూపుగా నిర్థారించారు. ఆ రక్తాన్ని కలిగి ఉన్న మహిళ నివాస ప్రారంతం గ్వాడెలోప్ పేరు కలిసి వచ్చేలా ఈ కొత్త గ్రూపునకు గ్వాడా నెగిటివ్ గ్రూప్ అని నామకరణం చేశారు. ఈ మహిళ తల్లిదండ్రులు ఇద్దరూ అరుదైన వేర్వేరు జన్యువులు కలిగి ఉండేవారు. వారి జన్యువులే కుమార్తెకు సంక్రమించాయి. ఆమె శరీరంలో ఆ రెండు కలిసి జెనిటిక్ మ్యుటేషన్‌కు గురి కావడం ద్వారా ఈ సరికొత్త బ్లడ్ గ్రూప్ ఆవిష్కారమైందని పరిశోధకులు ఎట్టకేలకు తేల్చారు.
48వ కొత్త బ్లడ్ గ్రూప్
ప్రపంచంలో ఇప్పటి వరకు మొత్తం 47 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. కొత్తగా కనుగొన్న గ్వాడా నెగిటివ్ గ్రూప్‌ను 48వ రకం బ్లడ్ గ్రూప్‌గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ మేరకు ఫ్రెంచ్ బ్లడ్ ఎస్టాబ్లిష్‌మెంట్ 48వ రక్తవర్గాన్ని గురించి అధికారికంగా ప్రకటించింది. ఈ బ్లడ్ గ్రూప్‌నకు ఇటీవలే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ (ఐఎస్‌బీటీ) గుర్తింపు కూడా లభించింది. ఇప్పటి వరకు ఈ సంస్థ 47 రక్తవర్గాలను అధికారికంగా గుర్తించింది. వాస్తవానికి ఇంతవరకు 47 గ్రూపులు ఉన్నా వాటిలోని కణాలు, యాంటిజెన్స్ ఆధారంగా ప్రధానంగా నాలుగు గ్రూపులుగా.. ఎనిమిది ఉప వర్గాలుగా వ్యవహరిస్తున్నారు. ఏ, బీ, ఓ, ఏబీ పాజిటివ్ గ్రూప్‌లు ప్రధానమైనవి కాగా.. వీటిలోనే ఏ నెగిటివ్, బీ నెగిటివ్, ఓ నెగిటివ్. ఏబీ నెగిటివ్ పేర్లతో ఉప వర్గాలు అధికంగా చెలామణీలో ఉన్నాయి.
అరుదైన గ్రూపల్లో నాలుగోది
ప్రస్తుతం గుర్తించిన 48 రక్త గ్రూపుల్లో ఆర్‌హెచ్ నల్, బాంబే బ్లడ్ గ్రూప్, ఏబీ నెగిటివ్‌లను అరుదైన గ్రూపులుగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు వాటి సరసన గ్వాడా నెగిటివ్ గ్రూప్ చేరింది. ప్రస్తుతానికి ఈ గ్రూప్ రక్తం కలిగిన మహిళ ఒక్కరే ఉన్నారు.
ఆర్‌హెచ్ నల్ గ్రూప్ రక్తంలో ఎర్ర రక్త కణాలపై ఆర్‌హెచ్ యాంటిజెన్స్ ఉండవు. ప్రపంచంలోని ప్రతి ఆరు మిలియన్ల ప్రజల్లో ఒకరికి మాత్రమే ఈ గ్రూప్ రక్తం ఉంటుంది.
హెచ్‌హెచ్ అనే సాంకేతిక నామంతో పిలిచే బాంబే బ్లడ్ గ్రూపులో హెచ్(క్యాపిటల్ హెచ్) యాంటిజెన్ ఉండదు. ఇది సాధారణంగా ఓ బ్లడ్ గ్రూప్‌లా కనిపించినా క్రాస్ మ్యాచింగ్‌లో తేడా చూపిస్తుంది.
ఏబీ నెగిటివ్ గ్రూప్‌ను కూడా అరుదైనదిగానే పరిగణిస్తున్నారు. ఇది జనాభాలో అతి తక్కువగా ఒక్క శాతం మందిలోనే రక్త గ్రూపు ఉంటుంది.
అందువల్లే ఈ గ్రూపుల రక్త సేకరణ, మార్పిడి ప్రక్రియల్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.










Comments