మానవత్వమే మరణించింది!
- DV RAMANA

- Oct 28, 2025
- 2 min read

సాఫీగా గమ్యస్థానానికి చేరుకుంటామన్న ధీమాతో ఆదమరిచి నిద్రపోతున్నవారిని నిద్రలోనే దహించేసిన ఘోర బస్సు దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తులో వెలుగుచూస్తున్న పలు అంశాలు విస్మయం, భయం కలిగిస్తున్నాయి. రెండు ప్రధాన అంశాలు మనుషుల్లో మానవత్వం మాయమవుతోందని, పక్కా వాణిజ్య పంథా పాతుకుపోతోందని వెల్లడిస్తున్నాయి. కర్నూలు బస్సు దుర్ఘటనపై దర్యాప్తులో బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, బైక్‌పై ప్రయాణిస్తున్న వారిలో ఒకడైన ఎర్రిస్వామి చెప్పిన వివరాల ప్రకారం.. బైక్ బస్సును గుద్దలేదు. వర్షం కురుస్తున్న ఆ అర్ధరాత్రి వేళ శివశంకర్, ఎర్రిస్వామిలు ప్రయాణిస్తున్న బైకు అంతకుముందే ప్రమాదానికి గురి కాగా బైక్‌తో సహా దాన్ని నడుపుతున్న శివశంకర్ రోడ్డుపైన పడిపోయారు. శివశంకర్ అక్కడికక్కడే మృతిచెందగా, ఎర్రిస్వామికి కొంత గాయాలయ్యాయి. అదే సమయంలో చాలా వేగంగా వస్తున్న వి.కావేరీ ట్రావెల్స్ బస్సు అదే వేగంతో బైక్‌ను తొక్కుకుంటూ వెళ్లిపోయింది. ఆ సమయంలో బస్సును నడపుతున్న డ్రైవర్ లక్ష్మయ్య దీనికి వివరణ ఇస్తూ వర్షంలో రోడ్డుపై పడి ఉన్న బైక్ నలుపు రంగంలో ఉండటం వల్ల దగ్గరికి వెళ్లేవరకు కనిపించలేదని, కానీ అప్పటికే ఆలస్యం కావడంతో బైక్‌ను తప్పించినా, సడన్ బ్రేక్ వేసినా బస్సు ప్రమాదానికి గురై, వెనుక వస్తున్న వాహనాలు ఢీకొని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న ఆలోచనతో బైక్ పైనుంచి పోనిచ్చానని చెపుకొచ్చాడు. తమ బస్సు కంటే ముందు రెండు మూడు బస్సులు బైక్‌ను తప్పించుకుని వెళ్లాయని డ్రైవర్ చెప్పగా..అంతకంటే ఎక్కువ వాహనాలే వెళ్లాయని ఎర్రిస్వామి చెప్పాడు. వీరిద్దరు చెప్పినదాని ప్రకారం చూస్తే.. రోడ్డుపై పడి ఉన్న బైకును, అక్కడే ఉన్న శివశంకర్ మృతదేహాన్ని చూసి కూడా మనకెందుకులే.. అనుకొంటూ ఆ వాహనాల్లోని వారు వెళ్లిపోయారని స్పష్టమవుతోంది. పోనీ లక్ష్మయ్య చెప్పినట్లు బ్రేకులు వేయలేక వెళ్లాయని అనుకున్నా.. కాస్త ముందుకెళ్లాక అయినా వాహనాలను ఆపి ఏం జరిగిందో తెలుసుకోవడంతోపాటు రోడ్డుపై పడి ఉన్న ఆ బైక్‌ను, శివశంకర్ డెడ్ బాడీని పక్కకు జరిపి ఉంటే బహుశా ఇంత భారీ ప్రమాదం, ప్రాణనష్టం జరిగి ఉండేది కాదేమో! మనుషుల్లో మానవత్వం మాయమైపోతున్నదనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకేం కావాలి. పక్కవాడు ఏమైపోతే మనకెందుకు? అన్న సంకుచిత ధోరణి.. తోటి వారికి సహాయం చేయాలన్న ఆలోచన లేకపోవడం 19 నిండు ప్రాణాలను బలిగొందనడంలో సందేహం లేదు. ఒకరిద్దరు స్పందించినా అప్పటికే ఆలస్యమైపోయింది. బస్సును నడుపుతున్న లక్ష్మయ్య కూడా సడన్ బ్రేకులు వేయడం డేంజరని బైక్ పైనుంచి వెళ్లినా.. ఆ వెంటనే స్పీడ్ కంట్రోల్ చేసి బస్సును ఆపి ఉంటే బైక్ బస్సు కింద చిక్కుకుందన్న విషయం తెలిసేది. వీటన్నింటినీ చూస్తే.. ఈ దుర్ఘటనలో ప్రయాణికులే కాదు.. మనుషుల్లో మనవత్వం కూడా చచ్చిపోయిందని చెప్పకతప్పదు. రోడ్డుపై ప్రమాదం జరిగి చాలామంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా ఆ మార్గంలో వెళుతున్న అనేక వాహనాల్లో ప్రయాణిస్తున్న పలువురు వీడియోలు తీసుకుంటూ కాలక్షేపం చేశారే తప్ప.. ముందు పోలీసులకు సమాచారం అందించడం, క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న ఆలోచన చేయకపోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రమాదానికి గురైన వారిని కాపాడితే కేసులు, సాక్ష్యం అంటూ పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని.. ఆ బాధంతా మాకెందుకని అనుకోవడం కూడా తప్పే. అదే ప్రమాదం మనకి జరిగితే.. కాపాడేందుకు ఒక్కరూ రాలేదని తిట్టుకుంటాం. మనం ప్రాణం అయితే ఒకటి.. ఇతరుల ప్రాణాలైతే ఇంకొకటి అన్న సంకుచిత భావం మానవత్వాన్ని మరుగుపరిచేస్తోంది. మనిషి ప్రాణానికి విలువ లేదా? మన పెద్దల కాలంలో ఎవరికైనా ఆపద వస్తే.. ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఆ కాలంలో స్మార్ట్‌ఫోన్లు లేవు. కానీ బంధాలకు, మనుషులకు విలువనిచ్చేవాళ్లు. వస్తువులను వాడుకుని మనుషులను ప్రేమించేవాళ్లు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మోజుతో ఎక్కడ ఏం జరిగినా వీడియోలు తీసి వైరల్ చేయాలని పోటీ పడుతున్నారే తప్ప.. తమవంతు సహాయం చేద్దామన్న ఆలోచన చేయలేకపోతున్నారు. మనిషి ప్రాణం కంటే వీడియోలను వైరల్ చేయడానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది మనలోని మానవత్వానికి పాతరేస్తోందన్న విషయాన్ని గురించాల్సి ఉంది. ఇక ఈ ప్రమాదం ట్రావెల్ నిర్వాహకుల నిర్వాకాలను మరోసారి ప్రశ్నించింది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు లెసెన్సులు తీసుకునే బస్సుల్లో సరుకు రవాణా చేయడానికి వీల్లేదు. అలా చేయాలంటే సరుకు రవాణా వాహనంగా అధిక పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారులు కూడా తమ సరుకులను రవాణా పన్నులను ఎగ్గొట్టేందుకు బస్సుల ద్వారా రవాణా చేస్తుంటారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఆదాయం కోసం కక్కుర్తి పడి తమ బస్సుల్లో సరుకు రవాణా చేస్తున్నారు. ప్రయాణికుల లగేజీ పెట్టాల్సిన ప్రదేశాల్లో ఈ సరుకును లోడ్ చేసి తరలిస్తున్నారు. ఆర్టీఏ అధికారులు కూడా ఈ బస్సులను తనిఖీ చేసిన పాపానా పోవడంలేదు. పలువురు వ్యాపారులు ఇదే అదనుగా ప్రమాదకర వస్తువులను కూడా ట్రావెల్స్ బస్సుల్లోనే తరలిస్తున్నారు. కర్నూలు వద్ద దహనమైన బస్సు కింద ఉన్న లగేజీ కంపార్ట్‌మెంటుల్లో లక్షల రూపాయల విలువైన సెల్‌పోన్లు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వీటిలో ఉండే లిథియం అయాన్ బ్యాటరీలు ప్రమాదకరమైన రసాయనాలతో కూడినవి. ఈ ప్రమాదంలో బస్సు కింద ఇరుక్కున్న బైక్ నుంచి మంటలు చెలరేగి లగేజీ కంపార్ట్‌మెంట్ అంటుకోగా.. సెల్‌ఫోన్లలోని బ్యాటరీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి బస్సును, ప్రయాణుకులను ఆహుతి చేశాయి.










Comments