top of page

మానవహక్కులకు ఎవరు దిక్కు?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 3 min read
  • 20 నెలలుగా అధ్యక్షుడు, సభ్యులే లేని అనాథ

  • దరఖాస్తులు ఆహ్వానించి ఆర్నెల్లు అయినా పట్టించుకోని సర్కారు

  • మురిగిపోతున్న సుమారు పదివేల కేసులు

  • హక్కులు పరిరక్షించే సంస్థకే తీరని దుర్గతి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

మానవహక్కులను హరించి, రాజ్యాంగపరంగా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను కాలరాసి వ్యవస్థలు, వ్యక్తుల స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతినిత్యం అనేక అరాచకాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి మీడియాలో విస్తతంగా వార్తలు వస్తున్నా ఫలితం కనిపించడంలేదు. మానవహక్కులను పరిరక్షిస్తూ పౌరులకు రక్షా కవచంగా పనిచేయడానికి చట్టపరంగా ఏర్పాటైన రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఉన్నా.. ఎక్కడా దాని ఉనికి ప్రస్ఫుటం కావడంలేదు. దీనికి కారణం దాన్ని పర్యవేక్షించే నాథుడు లేకపోవడమే. సుమారు రెండేళ్లుగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచఆర్‌సీ) అధ్యక్షుడితో పాటు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. ఫలితంగా సుమారు పదివేల హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులు అపరిష్కతంగా మానవ హక్కుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో మగ్గిపోతున్నాయి. ఈ కారణంగానే పనితీరు పరంగా ఏపీ మానవహక్కుల సంఘం దాదాపు చిట్టచివరన 23వ స్థానంలో నిలుస్తోంది. సమాచార హక్కు(ఆర్టీఐ) ద్వారా సేకరించిన ‘ఇండియా జస్టిస్ రిపోర్టు`2025’ లోని గణాంకాల ప్రకారం దేశంలో మానవ హక్కుల కమిషన్లు ఉన్న 23 ప్రధాన రాష్ట్రాల ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉంది. ఈ ర్యాంకు కేవలం అంకె కాదు.. హక్కుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి మచ్చుతునక.

నామమాత్రంగా కమిషన్

దేశ పౌరుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా జాతీయస్థాయిలోనూ, రాష్ట్రాల్లోనూ మానవహక్కుల కమిషన్లు చట్టబద్ధంగా ఏర్పాటు చేశారు. మానవహక్కుల పరిరక్షణ చట్టం`1993 ద్వారా కేంద్ర స్థాయిలో జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచఆర్‌సీ) ఢిల్లీ కేంద్రంగా పని చేస్తుంటే.. ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్రాల రాజధానులు లేదా ఇతర ముఖ్య నగరాల్లో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (ఎస్‌హెచఆర్‌సీ) కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయాన్ని రాష్ట్ర విభజన తర్వాత రెండుగా విడదీశారు. ఆ మేరకు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని 2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఆ మేరకు 151 జీవో జారీ చేసింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ప్రభుత్వం న్యాయ రాజధానిగా ప్రతిపాదించిన కర్నూలులో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి 2021లో జీవో నెం.89 జారీ చేసింది. ఆ మేరకు ప్రస్తుతం కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్‌లోని కేవలం రెండు గదుల్లో ఈ కార్యాలయం కునారిల్లుతోంది. సరే.. ఏదో గూడు ఉంది కదా.. ఏదోలా కార్యకలాపాలు సాగుతాయనుకుంటే.. అసలు ఫిర్యాదులను పరిశీలించే నాథుడే అక్కడ లేరు.

నియామకాల్లో తాత్సారం

రాష్ట్ర కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు ఉంటారు. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తిని అధ్యక్షుడిగా రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. అలాగే హైకోర్టులో పదవిలో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తిని లేదా ఏడేళ్లు జిల్లా న్యాయమూర్తిగా చేసిన అనుభవం ఉన్న వ్యక్తిని ఒక సభ్యుడిగా నియమించాల్సి ఉంటుంది. రెండో సభ్యుడిగా మానవహక్కుల రంగంలో అనుభవం కలిగిన వారిని నియమించాల్సి ఉంటుంది. వీరిని ఎంపిక చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, ఆ రెండు సభల ప్రతిపక్ష నాయకులు, రాష్ట్ర ీVAంమంత్రి సభ్యులుగా కమిటీ ఉంటుంది. ఈ కమిటీ సిఫార్సుపై గవర్నర్ నియామకాలు జరుపుతారు. ఆ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కర్నూలులో ఏర్పాటు చేసినప్పుడే 2021 మార్చిలో అప్పటి వైకాపా ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామమూర్తిని కమిషన్ ఛైర్మన్‌గా, మరో ఇద్దరు సభ్యులను నియమించింది. అయితే వారి పదవీకాలం 2024 మార్చి 23న ముగిసింది. అప్పటినుంచి కొత్త పాలకవర్గాన్ని నియమించలేదు. కొత్త బోర్డు నియామకానికి అప్పటి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. కానీ అదే ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నియామకాలు జరుపుతామంటూ గతంలో జరిగిన ప్రక్రియను రద్దుచేసి మళ్లీ ఫ్రెష్‌గా దరఖాస్తులు ఆహ్వానించింది. ఇది జరిగి కూడా ఆరునెలలు గడిచిపోయాయి. కానీ ఇంతవరకు అతీగతీ లేదు.

ఫిర్యాదులు బుట్టదాఖలు

కమిషన్ అధ్యక్షుడు, సభ్యులు లేకపోవడంతో దైనందిన కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. నిత్యం ఎన్నో మానవ హక్కులు ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వాటిపై వందలాది ఫిర్యాదులు వెళ్తున్నాయి. కానీ వాటిని తెరిచి చూసే నాథుడు కూడా ఆ కార్యాలయంలో లేరు. ఆర్టీఐ సమాచారం ప్రకారం.. జస్టిస్ సీతారామమూర్తి పదవీ విరమణ చేసిన 2024 మార్చి నాటికే 1,661 కేసులు పెండింగులో ఉన్నాయి. తర్వాత ఆ సంఖ్య 4,722కు పెరిగింది. ముఖ్యంగా 2025 జనవరి ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు వచ్చిన 1,561 కొత్త ఫిర్యాదులపై కమిషన్ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఫలితంగా ప్రస్తుతం కమిషన్ వద్ద అనాథలుగా పడి ఉన్న ఫిర్యాదుల సంఖ్య పదివేల వరకు ఉంటుందని హక్కుల సంఘాల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మానవహక్కుల సంఘ నియామకాల్లో ఇదే తరహా తత్సారం జరిగిందని, మళ్లీ ఇప్పుడు అదే జరుగుతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా విడ్డూరమేమిటంటే.. మనం డిజిటల్ యుగంలో ఉన్నా ఇప్పటికీ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయానికి సొంత వెబ్‌సైట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page